వరంగల్ తూర్పు, నేటిధాత్రి
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నూతన ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న తరుణంలో, నూతన ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రిగా భట్టి విక్రమార్క, ఆర్థిక మంత్రిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్లు దాదాపు ఖరారు అయినట్లే కనిపిస్తోంది. ఈ సమయంలో ఉమ్మడి వరంగల్ జిల్లా నుండి గతంలోనే మంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్న కొండా సురేఖకు హోం మంత్రి ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కొండా దంపతులకు ఢిల్లీ లెవెల్ లో పరిచయాలు ఉండటం కూడా కలిసి వస్తుంది అనే చెప్పొచ్చు. ఏది ఏమైనా కొండా సురేఖ హోం మినిస్టర్ కావాలనే కోరిక కొండా అభిమానుల్లో బలంగా వినిపిస్తుంది. గతంలోనే వైఎస్ హయాంలో మంత్రిగా పనిచేసిన అనుభవం కూడా ఉండటం, ఉమ్మడి వరంగల్ జిల్లా నుండి గెలిచిన మహిళల్లో సీనియర్ నాయకురాలు కావడం, గెలిచిన వాళ్ళలో కొండా సురేఖకు మాత్రమే మాజీ మంత్రిగా చేసిన అనుభవం ఉంది కనుక కొండా సురేఖ హోంమంత్రి అయ్యే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాకు హోంమంత్రి వచ్చే అవకాశం ఉందని, అందులో వరంగల్ తూర్పు నుండి గెలిచిన కొండా సురేఖకు హోంమంత్రి వస్తుందని కొండా అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు..