ప్రజల పక్షాన పోరాడిది కమ్యూనిస్టులే
స్థానిక సంస్థల ఎన్నికల్లో అధిక సీట్లు గెలిపించుకోవాలి
సిపిఐ జిల్లా కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్
భూపాలపల్లి నేటిధాత్రి
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించక సుమారు రెండు సంవత్సరాలు గడుస్తుందని, ఎన్నికలు జరగక గ్రామాల అభివృద్ధి కుంటుపడుతుందని వెంటనే ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించాలని సిపిఐ జిల్లా కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్ డిమాండ్ చేశారు. ఆదివారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని రావి నారాయణరెడ్డి భవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కొరిమి రాజ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికలు పదవి కాలం పూర్తయి సుమారు రెండు సంవత్సరాలు గడుస్తుందని దీంతో అభివృద్ధి ఆగిపోతుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ కుల గణన చేసి బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇవ్వాలని నిర్ణయించడంతో రిజర్వేషన్లు 50 శాతం మించారాదని హైకోర్టు స్టే విధించడంతో ప్రస్తుతం ఎన్నికలు వాయిదా పడ్డాయ న్నారు. దేశంలో 65శాంతం బీసీలు ఉన్నారని ప్రభుత్వం దానికి 42 శాతం రిజర్వేషన్ కేటాయించడంతో కోర్టు జోక్యం చేసుకొని రిజర్వేషన్లు 50 శాతం మించరాదని నిబంధనలు ఉన్నాయని దీంతో రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియ ఆగిపోయిందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని లేదంటే కాంగ్రెస్ కు నష్టం జరిగే అవకాశం ఉందన్నారు. 42 శాతం రిజర్వేషన్ కోసం సుప్రీంకోర్టుకు వెళ్లడం అనేది కాలయాపన తప్ప మరేం లేదన్నారు. రాష్ట్రంలో ప్రజా ప్రతినిధులు లేక గ్రామాలు, మున్సిపాలిటీల కాల పరిధి ముగిసి సుమారు రెండు సంవత్సరాలు అవుతుందని, రాష్ట్రానికి రావలసిన నిధులు రాక అభివృద్ధి స్తబ్దతగా మారిందన్నారు. బీసీ రిజర్వేషన్ విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించాలని కోరారు. కమ్యూనిస్టు పార్టీగా స్థానిక సంస్థ ఎన్నికల్లో జిల్లాలో రేగొండ, చిట్యాల, మొగుళ్లపల్లి, భూపాలపల్లి మండలాల్లో పోటీ చేయడం జరుగుతుందని ఎంపీటీసీ జెడ్పిటిసి సర్పంచులు అధిక స్థానాలు గెలుచుకునే విధంగా మా ప్రయత్నం ఉంటుందన్నారు. ప్రజా సమస్యలపై నిత్యం పోరాడేది కమ్యూనిస్టులేనని పోరాటాలు నిర్వహించే పార్టీలను ప్రజలు ఆదరించాలని ఈ సందర్భంగా రాజ్ కుమార్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో సిపిఐ పట్టణ కార్యదర్శి సోతుకు ప్రవీణ్ కుమార్,క్యాతరాజ్ సతీష్,కోరిమీ సుగుణ,గంగసరపు శ్రీనివాస్ ,నేరెళ్ల జోసెఫ్ ,గోలి లావణ్య ,మహేశ్,పీక రవికాంత్ తదితరులు పాల్గొన్నారు