అధ్వానంగా రహదారులు
జహీరాబాద్ నేటి ధాత్రి:
ఝరాసంగం మండల పరిధిలో పలు గ్రామాలకు వెళ్లే రహదారులు అధ్వానంగా తయారయ్యాయి. రోడ్లపై గుంతలు ఏర్పడటంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. దాంతో ప్రయాణం నరకప్రాయంగా మారింది. ఝరాసంగం – మేదపల్లి ఈదులపల్లి నుండి దిగ్వాల్ వెళ్లే రహదారి రోడ్డుపై వర్షపు నీరు రోడ్డుపైకి చేరుకోవడంతో గుంతలు ఏర్పడి వాహనాల రాకపోకలకు ఇబ్బందిగా మారింది. రాత్రి సమయాల్లో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈదులపల్లి నుండి దిగ్వాల్ రహదారిపై ఏర్పడిన గుంతల వల్ల వాహనాలు ఒక పక్కకు ఒరిగి వెళ్లే పరిస్థితి దాపురించింది.కాగా, రీబీటీ వేసి ఇబ్బందులు తొలగించాలని ప్రయాణికులు, స్థానికులు కోరుతున్నారు. రోడ్డుపై కంకర తేలి ప్రమాదకరంగా మారింది. ఈ రహదారి వెంట మేదపల్లి ఈదులపల్లి కు చెందిన ప్రజలు నిత్యం రాకపోకలు సాగిస్తుంటారు. రాత్రివేళ ప్రయాణించాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వెళ్లాల్సిన పరిస్థితి నెలకొందని వాపోతున్నారు. కొత్త ప్రభుత్వం మండలంలోని రహదారుల మరమ్మతులకు నిధులు కేటాయించి ఇబ్బందులు లేకుండా చూడాలని ప్రయాణికులు, స్థానిక ప్రజలు కోరుతున్నారు. ఉన్నతాధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు చొరవ తీసుకొని మరమ్మతులు చేయించాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.
ప్రమాదకరంగా రహదారులు
రహదారులపై ప్రమాదకరంగా గుంత లు ఏర్పడటంతో రాకపోకలకు ఇబ్బందిగా మారింది. ముఖ్యంగా ఝరాసంగం మేదపల్లి ఈదులపల్లి రహదారిపై పెద్ద పెద్ద గోతులు ఏర్పడ్డాయి. రాత్రివేళ ఈ రహదారిపై వెళ్లాలంటేనే భయమేస్తోంది. ఈదులపల్లి వద్ద మురుగు రోడ్డుపైకి చేరడంతో గుంతలు ఏర్పడ్డాయి. ప్రభుత్వం వెంటనే మరమ్మతులు చేపట్టాలి.