అక్షరాభ్యాసం తోనే అభివృద్ధి సాధ్యం
భూపాలపల్లి నేటిధాత్రి
జిల్లా విద్యాశాఖ అధికారి యం రాజేందర్ డిఆర్డిఏ పిడి బాలకృష్ణ ఆధ్వర్యంలో ఉల్లాస్ కార్యక్రమం పై సమీక్ష నిర్వహించనైనది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా అడిషనల్ కలెక్టర్ విజయలక్ష్మి హాజరై ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో ఉన్నటువంటి వయోజనులను అక్షరాస్యత క్రమము పెంచే దిశగా ఈ కార్యక్రమము కొనసాగుతుందని ప్రతి గ్రామము మండలంలో వయోజనులలో నిరక్షరాస్యులను గుర్తించి అక్షరాస్యులుగా తీర్చి దిద్దడానికి అందరూ కృషి చేయాలని కోరారు. చదువుకోవాలని కోరిక గల వారికి ఉజ్వల భవిష్యత్తును తెలంగాణ ఓపెన్ స్కూల్ విద్యావకాశాన్ని కల్పిస్తుందని అన్నారు. ముఖ్యంగా బాలికలు, మహిళలు, గ్రామీణ యువత, పనిచేసే స్త్రీ, పురుషులు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు ఇతరులకు విద్యను అందించడమే తెలంగాణ ఓపెన్ స్కూల్ యొక్క ముఖ్య ఉద్దేశం అని, అందరికీ విద్యను అందించే ఉద్దేశంతో తెలంగాణ ఓపెన్ స్కూల్ 2008-09 విద్యా సంవత్సరం నుండి పదవ తరగతి కోర్సును అందిస్తుందన్నారు. 2010-11 నుండి తెలంగాణ ఓపెన్ స్కూల్ ఇంటర్మీడియట్ ను కోర్సును ప్రారంభించిందని తెలియజేశారు.కమ్యూనిటీ మొబైలైజ్డ్ అధికారి సామల రమేష్ మాట్లాడుతూ అక్షరాస్యత తోనే అభివృద్ధిని సాధించగలమని అందుకు అనుగుణంగా మండల పరిధిలోని మండల విద్యాధికారులు, కాంప్లెక్స్ పరిధిలోని కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు, పాఠశాల పరిధిలోని ప్రధానోపాధ్యాయులు అందరము ఉమ్మడిగా పనిచేసి తమ తమ పరిధిలోగల వయోజనులందరిని అక్షరాస్యతులుగా చేసినట్లయితే దేశ పురోభివృద్ధిలో వారి పాత్ర గణనీయంగా ఉంటుందని, దానివల్ల దేశ ఆర్థిక, సామాజిక పరిస్థితులు మెరుగవుతాయని మీ అందరూ వీటికి అనుగుణంగా పనిచేసి మన జిల్లాను ముందు వరసలో నిలపాలని వారు ప్రత్యేకంగా కోరినారు. పూర్వపు వరంగల్ జిల్లా సార్వత్రిక విద్యాపీఠం కోఆర్డినేటర్ సదానందం మాట్లాడుతూ వయోజనులలో గుర్తించిన నిరక్షరాస్యులను పదో తరగతి ఇంటర్మీడియట్ లలో ప్రవేశము పొందడానికి వారిని గుర్తించి సంబంధిత మండలంలోని పాఠశాలలో కోఆర్డినేటర్ కు సార్వత్రిక విద్యాపీఠము పదవ తరగతి, ఇంటర్మీడియట్లలో చేర్పించవలసిందిగా వారు కోరినారు. ఈ కార్యక్రమంలో వయోజన విద్య విభాగ కోఆర్డినేటర్ వేణుగోపాల్ జిల్లాలోని కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు సి ఆర్ పి లు డిఆర్డిఏ ఏపీఎంలు, సీసీలు పాల్గొన్నారు.