Call for Grand Success of Revanth Reddy Meeting
సీఎం రేవంత్ రెడ్డి సభకు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి గ్రాండ్ సక్సెస్ చేయాలి- వెలిచాల
కరీంనగర్, నేటిధాత్రి:
ఈనెల 20వ తేదీ సోమవారం రోజున కాటారంలో జరగనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భారీ బహిరంగ సభకు కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ కార్పొరేటర్లు, కాంగ్రెస్ ముఖ్య నాయకులు, ప్రజా ప్రతినిధులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలిరావాలని కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు పేర్కొన్నారు. కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు సీఎం సభను గ్రాండ్ సక్సెస్ చేయాలని కోరారు. శనివారం వెలిచాల రాజేందర్ రావు మీడియాతో మాట్లాడుతూ ఈనెల 20వ తేదీన సోమవారం రోజున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఐటీ పరిశ్రమలు శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో కలిసి మేడిగడ్డ, కాలేశ్వరం ప్రాజెక్టులను సందర్శిస్తారని తెలిపారు. వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి గత బీఆర్ఎస్ పాలకులు కాలేశ్వరం ప్రాజెక్టును కుప్ప కూల్చారని మండిపడ్డారు. బీఆర్ఎస్ నేతలు వేలకోట్ల అవినీతికి పాల్పడ్డారనీ, బీఆర్ఎస్ అంటేనే అవినీతికి కేరాఫ్ అడ్రస్ గా మారిందని ఆరోపించారు. బీఆర్ఎస్ పాలకుల తప్పులను సరిదిద్దుతూ కాంగ్రెస్ ప్రభుత్వం
సంక్షేమం అభివృద్ధికి సమాన ప్రాధాన్యమిస్తూ ముందుకు సాగుతుందని పేర్కొన్నారు.
కాలేశ్వరం ప్రాజెక్టు మరమ్మత్తులు చేసేందుకు ప్రభుత్వం నడుం బిగించిందనీ, ఇందులో భాగంగానే మేడిగడ్డ కాలేశ్వరం ప్రాజెక్టును పరిశీలించేందుకు ముఖ్యమంత్రి వస్తున్నారని తెలిపారు. ఆతర్వాత కాటారం మండలం నస్తురిపల్లి గ్రామంలో జరిగే బహిరంగ సభలో ముఖ్యమంత్రి పాల్గొంటారని పేర్కొన్నారు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి ముఖ్యమంత్రి రైతు సోదరుల కోసం రెండో విడత రైతు భరోసా నిధులను విడుదల చేస్తారని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగ సభకు కరీంనగర్ నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు, కాంగ్రెస్ ముఖ్య నాయకులు, సర్పంచులు ప్రజాప్రతినిధులు మాజీ కౌన్సిలర్లు కార్పొరేటర్లు కార్యకర్తలు అన్ని విభాగాల కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని రాజేందర్ రావు కోరారు. రెండు వందల వాహనాల ద్వారా కార్యకర్తలు నాయకులను తరలించేందుకు సమాయత్తమవుతున్నట్లు రాజేందర్ రావు పేర్కొన్నారు.
