గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఏర్పాట్లు చేయాలి
జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ
భూపాలపల్లి నేటిధాత్రి
77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశించారు.
బుధవారం ఐడిఓసి కార్యాలయంలో అన్ని శాఖల అధికారులతో గణతంత్ర దినోత్సవ ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ డా బిఆర్ అంబేద్కర్ క్రీడా మైదానంలో జరగనున్న గణతంత్ర దినోత్సవ వేడుకలకు మైదానం పూర్తిగా పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆహూతులు సౌకర్యవంతంగా కూర్చునేందుకు షామియానాలు, కుర్చీలు ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశించారు.
ప్రజలకు ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై అవగాహన కల్పించే విధంగా సింగరేణి, విద్యా, డిఆర్‌డీఓ, గృహ నిర్మాణ, సంక్షేమ, వ్యవసాయ, ఉద్యాన, వైద్య శాఖల అధికారులు స్టాళ్లు ఏర్పాటు చేయాలని తెలిపారు. అలాగే గణతంత్ర దినోత్సవ వేడుకలలో పాఠశాలల విద్యార్థులచే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని విద్యా శాఖ అధికారిని ఆదేశించారు.
ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రతిబింబించే ప్రసంగ పాఠాన్ని సిద్ధం చేయాలని డిపిఆర్‌ఓను కలెక్టర్ ఆదేశించారు. గణతంత్ర దినోత్సవ వేడుకలు విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని కలెక్టర్ రాహుల్ శర్మ ఈ సందర్భంగా సూచించారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి, ఏఎస్పి నరేష్ కుమార్, ఆర్డిఓ హరికృష్ణ, అన్ని శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
