మైనార్టీ యువతి యువకులకు ఉచిత శిక్షణ

వనపర్తి / నేటి ధాత్రి.

వనపర్తి జిల్లాల్లో మైనార్టీ యువతకు ఉచితంగా గ్రూప్-1,2,3,4 ఆర్ఆర్ బి, ఎస్ఎస్సి, బ్యాంకింగ్ వంటి పరీక్షలకు నాలుగు నెలల పాటు ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి సుబ్రహ్మణ్యం శనివారం తెలిపారు. నిరుద్యోగులు ఈనెల 17వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తుదారులు ఎస్ఎస్సి, ఇంటర్, డిగ్రీ, మెమో, ఆధార్ కార్డు జిరాక్స్, రెండు ఫోటోలతో వనపర్తి కలెక్టర్ కార్యాలయంలోని ఐడిఓసి కార్యాలయం నందు దరఖాస్తులను అందజేయాలన్నారు.

ప్రజలతో ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి ముఖాముఖి

భూత్పూర్ /నేటి ధాత్రి.

మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ మున్సిపాలిటీ సమీపంలోని మినీ ఇండోర్ స్టేడియంలో అధికారులు, మండలంలోని వివిధ గ్రామ ప్రజలతో శనివారం ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి ముఖాముఖి, సమీక్ష సమావేశంను నిర్వహించారు. ఈ సందర్భంగా..గ్రామాల్లోని సమస్యలను ఆయా గ్రామాల ప్రజలు ఎమ్మెల్యే దృష్టికి తేవడంతో… అట్టి సమస్యలపై అధికారులతో చర్చించి, పలు సమస్యలను తక్షణం పరిష్కరించి, మిగతా సమస్యలను నోటిఫై చేసుకున్నారు. పెండింగ్ సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని ఎమ్మెల్యే అన్నారు.

శ్రీ పాండురంగ స్వామి దేవాలయంలో గోదాదేవి ధనుర్మాస ఉత్సవాలు

వనపర్తి నేటిధాత్రి :
వనపర్తి పట్టణంలో బ్రాహ్మణవాడలో శ్రీ పాండురంగ స్వామి దేవాలయంలో ధనుర్మాస ఉత్సవాలు గోదాదేవి పల్లకి సేవ ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహిస్తున్నామని ఆలయ కమిటీ అధ్యక్షులు పూరి పాండు నిర్వాహకులు 15వ వార్డ్ మున్సిపల్ కౌన్సిలర్ బండారు కృష్ణ పూరి బాలరాజ్ పాపిశెట్టి శ్రీనివాసులు వలకొండ జగదీష్ కోట్ర నరసింహ కొంపల బాలచంద్రుడు ఒక ప్రకటనలో విలేకరులకు తెలిపారు ఆలయ పురోహితులు రామకృష్ణ పూజ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని వారు పేర్కొన్నారు ప్రతిరోజు ఉదయం 5 గంటలకు గోదాదేవి అమ్మవారి పల్లకి సేవ అష్టోత్తరం పూజలు ఉంటాయని వారు పేర్కొన్నారు భక్తులు శ్రీ పాండురంగ స్వామి దేవాలయంలో ధనుర్మాస ఉత్సవాలలో పాల్గొని పాండురంగ స్వామి గోదాదేవి అమ్మవారి అనుగ్రహం పొందాలని వారు కోరారు భక్తులు జర్నలిస్టు నాగబంది వెంకట్ రమణ క్రాంతి ట్రాన్స్ పోర్టు నుకల విజయ హరి నాథ్ అలుగడ్డ శ్రీనివాసులు కొండ విశ్వనాథం లగిశెట్టి చక్రవర్తి భక్త్తులు పాల్గొన్నారు

గట్టుఇప్పలపల్లిలో బ్యాంకును ఏర్పాటు చేయాలని ఎంపీ మల్లు రవికి వినతి.

తలకొండపల్లి /నేటి ధాత్రి

తలకొండపల్లి మండలంలోని గట్టు ఇప్పలపల్లి గ్రామంలో నూతన బ్యాంకును ఏర్పాటు చేయాలని గ్రామస్తులు శనివారం ఎంపీ మల్లురవిని కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ.. గ్రామంలో బ్యాంకు లేకపోవడంతో సుదూర ప్రాంతాలకు వెళ్ళవలసి వస్తుందని, వికలాంగులు, వృద్ధులు అవస్థలు పడుతున్నారు అన్నారు. బ్యాంకును ఏర్పాటు చేయాలని ఎంపీ మల్లు రవిని కోరారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు ప్రశాంత్ రెడ్డి, సీనియర్ నాయకులు రేణురెడ్డి, ఇందికంటి శివకుమార్ గౌడ్, బొడ్డే కిషన్, మధుసూదన్ రెడ్డి, సురేష్ మహేష్ తదితరులు పాల్గొన్నారు.

గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో సావిత్రిబాయి పూలే జన్మదిన వేడుకలు

కళాశాల ప్రిన్సిపాల్: డాక్టర్ గోలి శ్రీలత

హన్మకొండ, నేటిధాత్రి:

తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాల వరంగల్ వెస్ట్ నందు సావిత్రిబాయి పూలే 194 వ జన్మదినం సందర్భంగా సావిత్రిబాయి జన్మదిన వేడుకలు నిర్వహించడం జరిగినది. ఈ సందర్భంగా విద్యార్థులకు ఉపన్యాస పోటీలు ,వ్యాసరచన పోటీలు నిర్వహించడం జరిగినది. కళాశాల విద్యార్థులు మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే గురించి వారి జీవిత విశేషాలను ఎంతో చక్కగా వివరించారు. అలాగే కళాశాల అధ్యాపకులు డాక్టర్ సాంబలక్ష్మి మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే మహిళల విద్య కోసం ఏ విధంగా కృషి చేశారో వివరించారు. డాక్టర్ రాధిక గారు సావిత్రిబాయి అడుగుజాడల్లో నడవాలని విద్యార్థులకు సూచించారు. అలాగే వైస్ ప్రిన్సిపల్ మాలతి గారు మాట్లాడుతూ విద్యార్థులు సమయాన్ని వినియోగించుకోవాలని సూచించారు. మరియు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ గోలి శ్రీలత గారు మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే ఎన్నో అవమానాలను ఓర్చుకొని నిస్వార్థ సేవ చేసి ఎంతోమంది మహిళలకు ఆదర్శంగా నిలిచారు. మొదటి మహిళా ఉపాధ్యాయురాలిగా సావిత్రిబాయి పూలే ఉండడం మనకు గర్వకారణం అని, అలాగే రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సావిత్రిబాయి పూలే జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం ఈరోజును (3 జనవరి)మహిళ ఉపాధ్యాయ దినోత్సవం గా వేడుకలు జరుపుకోవాలని నిర్ణయించడం ఎంతో ఆనందదాయకమని వివరించారు. అలాగే రామకృష్ణ పరమహంస వంటి నిరంతర సామాజిక సేవాభావం కలిగిన మహానుభావులు చెప్పినటువంటి సమదృష్టి గురించి కొన్ని కథలను విద్యార్థులకు వారి అమూల్యమైన సందేశాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు సీనియర్ ఫ్యాకల్టీ భద్రకాళి మేడం ,డాక్టర్ జక్కె పద్మ, జ్యోతి డాక్టర్ సాంబలక్ష్మి, డాక్టర్ రాధిక ,డాక్టర్ విమల మరియు విద్యార్థులు పాల్గొన్నారని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ గోలి శ్రీలత ఒక ప్రకటనలో తెలియజేశారు.

‘‘దమ్మిడీ అడగాలంటే’’ ‘‘దఢ పుట్టాలే’’.

-అవినీతి అంతమే మంత్రి పొంగులేటి లక్ష్యం.

-లంచం కూడా దొంగతనంతో సమానం కావాలే!

-దొంగలకిచ్చే ట్రీట్‌ మెంట్‌ జరగాలే!

-అవినీతి సొమ్ము ముట్టుకోవాలంటే చేతులు వణకాలే!

-అవినీతి సహించొద్దు..దొరికితే వదలొద్దు!

-గత ప్రభుత్వం హయాంలో విచ్చలవిడిగా అవినీతి.

-దశాబ్దానికి పైగా ట్రాన్స్‌ఫర్లు లేకపోవడంతో విపరీతంగా అవినీతి.

-రిజిస్ట్రేషన్‌ శాఖ అధికారులు వందల కోట్లలో సంపాదనలు.

-రెవెన్యూ, రిజిస్ట్రేషన్‌ శాఖలో అంతులేని అవినీతి.

-ధరణితో రెవెన్యూ శాఖ అధికారులు కోట్లకు పడగలెత్తారు.

-భూముల ధరలు పెరగడంతో రిజిస్ట్రేషన్‌ శాఖ అధికారుల చెలరేగిపోయారు.

-ప్రైవేటు వ్యక్తులను పెట్టుకొని మరీ సంపాదనకు ఎగబడ్డారు.

-ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత అనిశా వలకు చిక్కుకుంటున్నారు.

-అయినా కించిత్‌ కూడా ఎవరిలోనూ భయం లేదు.

-పదేళ్లుగా అడ్డగోలు దోపిడీ తో కోట్లు కూడబెట్టుకున్నారు.

-ఉద్యోగాలు పోయినా ఫరవాలేదని తెగిస్తున్నారు.

-ఇటీవల ప్రభుత్వ భూమిని అప్పనంగా అమ్ముకున్న సంఘటన వెలుగులోకి వచ్చింది.

-అసలు సూత్రదారి ‘‘సంతోష్‌’’ తప్పించుకున్నాడు?

-పాత్రదారులైన ఇతర ఉద్యోగులు పట్టుబడ్డారు.

-600 కోట్ల భూమి వ్యవహారం ఎక్కడిదాకా వచ్చిందో ఎవరికీ తెలియదు.

-అసలు సూత్రదారి దర్జాగా తిరుగుతున్నాడు.

-అవినీతి కేసులో దోషిని చేయడానికి పై అధికారులే ముందుకు రావడం లేదు.

-అందుకే మంత్రి పొంగులేటి రంగంలోకి దిగనున్నారు.

-అవినీతి అధికారుల భరతం పట్టేందుకు సిద్దమౌతున్నారు.

-రెవెన్యూలో త్వరలో సమూల మార్పులు.

-అవినీతి పరులపై కఠినమైన చర్యలు.

-రిజిస్ట్రేషన్‌ శాఖలో పూర్తి స్థాయిలో ప్రక్షాళన.

-రిజిస్ట్రేషన్‌ శాఖ అధికారుల ఆస్థులు మీద నిఘా.

-రిజిస్ట్రేషన్‌ కోసం వచ్చిన వారిని ఇబ్బంది పెడితే కటకటాలే!

-ప్రజలను వేధిస్తే జైలు పాలు చేయడమే!

-పట్టుబడిన వెంటనే వారి ఉద్యోగాలు ఊడిపోవాలే!

-ఆస్థులన్నీ జప్తు జరిపి రోడ్డున పడాలే!

 

హైదరాబాద్‌,నేటిధాత్రి:
తెలంగాణలోని కొన్ని శాఖల్లో అధికారుల అవినీతికి హద్దూ బద్దూ లేకుండాపోతోంది. మరీ ఇంత అన్యాయానికి ఎందుకు తెగబడుతున్నారని ప్రశ్నించే వారు కూడా లేకుండాపోతున్నారు. ఓ వైపు అవినీతి నిరోధక శాఖ అధికారులు డేగ కండ్లేసుకొని జల్లపడుతున్నా అవినీతి ఆగడంలేదు. వారిలో భయం అన్నది కనిపించడం లేదు. నిత్యం ఎవరో ఒకరు ఎక్కడోఅక్కడ పట్టుబడుతూనే వున్నారు. ఈ ఏడాది కాలంలో 300లకు పైగా అధికారులు పట్టుబడ్టారంటే అవినీతి ఏమేరకు విశృంఖలంగా జరుగుతుందో అర్ధం చేసుకోవచ్చు. గత పదేళ్ల అవినీతి పరంపరను అవినీతి అదికారులు ఆపడం లేదు. కొత్త ప్రభుత్వం వచ్చిందన్న భయం అంతకన్నా లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో దృష్టిపెట్టి అవినీతిని అంతం చేయాలని చూస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. ఉద్యోగం వెలగబెట్టడమంటే ప్రజలను పీడిరచి సొమ్ము వసూలు చేయాలని అనుకుంటున్నారో ఏమో? ప్రజల చెల్లించే పన్నుల ద్వారా జీతాలు తీసుకుంటూ, ప్రజలకు సేవ చేయాల్సిన బాద్యతలో వున్నామన్న విషయాన్ని ఎప్పుడో మర్చిపోయినట్లున్నారు. అందుకే ఇంతగా భరితెగిస్తున్నారు. ఓ వైపు మేం వేతన జీవులమంటూ అమాయకపు చూపులు చూస్తూ, ప్రభుత్వం నుంచి పొందాల్సిన సదుపాయాలు పొందుతూ, హక్కులు సాధించుకుంటూనే వున్నారు. జీతాలు ఇబ్బడి ముబ్బడిగా పెంచినా, ప్రజలను పీడిరచడం మానుకోవడంలేదు. అవినీతిని ఆపడం లేదు. లంచాలకు మరిగి కోట్లు సంపాదించుకుంటున్నారు. మేం లేకపోతే వ్యవస్ధ నడవదన్న అహం అధికారుల్లో బాగా పెరిగిపోయింది. ఉద్యోగం పోతే జీవితం ఆగమైపోతుందన్న భయం లేకుండాపోయింది. ఎందుకంటే జీవితాంతం ఉద్యోగం చేస్తే జీతం ద్వారా వచ్చే ఆదాయం చాలా మంది ఉద్యోగులు అంతకు పది రెట్లు ఈ పదేళ్ల కాలంలో సంపాదించిపెట్టుకున్నారు. ఆస్ధులు కూడబెట్టుకున్నారు. ఇండ్లు , స్ధలాలు కొని పెట్టుకున్నారు. హైదరాబాద్‌ లో కూడా చిన్నా చితక ఉద్యోగులు కూడా విల్లాలు కొనుగోలు చేసుకున్నారంటే అవినీతి ఎంతగా రాజ్యమేలుతుందో అర్దం చేసుకోవచ్చు. ఇక పెద్ద పెద్ద హోదాలలో వున్న అధికారుల సంపాదన ఎలా వుందో పట్టుబడిన వారిని చూస్తేనే తెలిసిపోతుంది. గత ప్రభుత్వ హాయంలో ధరణి మూలంగా రెవిన్యూశాఖ, భూముల విలువ పెంచడంతో రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులు చేసిన దోపిడీ అంతా ఇంకా కాదు. అవినీతికి పాల్పడి, అక్రమంగా సంపాదించిన అధికారుల ఆస్ధులు వెలికితీస్తే రాష్ట్ర ప్రభుత్వ ఆదాయంతో సరిసమానమౌతుందని అంటున్నారు. అంతలా ఈ పదేళ్ల కాలంలో ప్రజలు జలగల్లా పీల్చుకుతిన్నారు. ఇంకా చాలదన్నట్లు తింటూనే వున్నారు. జేబులు నింపుకుంటూనే వున్నారు. పట్టుబడుతూనే వున్నారు. అయినా ఏ ఉద్యోగ వ్యవస్ధలో కించింత్‌ భయం కూడా కనిపించడం లేదు. ఉద్యోగం పోతే పోని అన్నట్లుగా తయారయ్యారు. అందుకే ఇలా భరితెగించి లాంచాలు తీసుకుంటున్నారు. రైతులు తమ భూమిని కుటుంబ సభ్యుల మీదకు మార్చుకుంటే కూడ లక్షల రూపాయలు ముట్టజెప్పుకోవడం ఏమిటి? ప్రభుత్వానికి చెల్లించాల్సిన రుసుములు చెల్లింపులు చేస్తున్నా, అధికారులకు లంచాలు ఎందుకివ్వాలి. ప్రభుత్వానికి చెల్లిస్తున్న సొమ్ముకు పదింతలు లంచాలు వసూలు చేస్తున్నారు. కోట్లు రూపాయలు గడిస్తున్నారు. భూములను కుటుంబ సభ్యుల పేరు మీద మార్చడానికి కూడా లక్షల రూపాయలు వసూలు చేసి, కోట్లు కొల్లగొడుతున్నారు. అవినీతికి అలవాటు పడిన అధికారులను దారిలోకి తీసుకురావాల్సిన అసవరం వుంది. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, రెవిన్యూ శాఖ, రిజిస్ట్రేషన్లు, స్టాంపుల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డిలు సీరియస్‌గానే వున్నారు. అవినీతి అన్నది అన్ని శాఖలో పాతుకుపోయింది. వైరస్‌ కన్నా ప్రమాదకరంగా మారిపోయింది.
తెలంగాణలో అవినీతి అధికారుల మూలంగా రెవిన్యూ, రిజిస్ట్రేషన్ల శాఖలు పూర్తిగా భ్రష్టుపట్టిపోయాయి. అందుకే రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఇక పూర్తిగా రంగంలోకి దిగుతున్నారు. రెండు శాఖల్లో జరుగుతున్న అవినీతిని కూకటి వేళ్లతో పెకిలించే ప్రయత్నానికి శ్రీకారం చుడుతున్నారు. ఇప్పటికే పలు మార్లు చెప్పి చూశారు. హచ్చరించారు. అయినా అదికారుల్లో మార్పు రావడం లేదు. లంచాలవతారాలు మారడం లేదు. వారి చేతి వాటం ఆపడం లేదు. అధికారులు చేసే అవినీతి మూలంగా ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే ప్రమాదముంది. పైగా కొత్తగా భూ భారతి వచ్చింది. సమస్యలతో సతమతమౌతున్న రైతులు రెండు శాఖల కార్యాలయాలకు క్యూ కట్టే సమయం వచ్చింది. గత ప్రభుత్వం ధరణి దరిద్రం తెచ్చిపెట్టినప్పటి నుంచి రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అప్పటి నుంచి తీరని సమస్యలు భూ భారతి ద్వారా తీరుతాయిని ఎన్నొ ఆశలు పెట్టుకుంటున్నారు. ఇలాంటి సమయంలో రైతులను, ప్రజలు రెవిన్యూ, రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులు ఇబ్బందులకు గురిచేసే పరిస్దితులు లేకపోలేదు. అందుకే మంత్రి పొంగులేటి ముందస్తుగా హెచ్చరించారు. రైతులనుగాని, ప్రజలను గాని ఇకపై ఇబ్బందులకు గురి చేస్తే చర్యలు తప్పవని తేల్చి చెప్పారు. అయినా లెక్క చేయకుండా ఎవరైనా లంచాలు తీసుకుంటే మాత్రం పరిణామాలు తీవ్రంగా వుండే అవకాశం వుంది. లంచం తీసుకొని దొరికిపోతే పోయేది ఉద్యోగమే కదా? అని ఇకపై అనుకుంటే పొరపాటు. గత పాలకులు అవినీతిని ప్రోత్సహించి, అధికారుల అవినీతిని చూస్తూ ఊరుకున్నారు. అధికారులు జనాన్ని పీల్చి పిప్పి చేస్తున్నా పట్టించుకోలేదు. కాని ప్రజా ప్రభుత్వం ప్రజలకు ఇబ్బందులు ఎదురైతే మాత్రం ఉపేక్షించే పరిస్ధితి లేదు. ప్రజలు ఎవరు ఇబ్బందులకు గురిచేసినా, లంచాల కోసం పీడిరచినా, వేదించినా, ఒక్క రూపాయి తీసుకున్నట్లు సమచారం అందినా సరే ఆ ఉద్యోగి కొలువు ఊడిపోవడమే కాకుండా, ఉద్యోగిగా అవినీతి సంపాదన మొత్తం వెలికి తీస్తారు. ఆస్దులను జప్తు చేస్తారు. ఉద్యోగులను జైలు పాలు చేస్తారు. దాంతో కుటుంబం ఉద్యోగులు కుటుంబాలు వీధినపడే అవకాశాలున్నాయి. ఇంత కాలం అలాంటి భయం లేకపోవడం వల్లనే అధికారులు విచ్చలవిడిగా లంచాల రూపంలో దోచుకున్నారు. ప్రజల జీవితాలతో ఆడుకున్నారు. నిజానికి లంచగొండి తనాన్ని దొంగతనంగా భావించాలి. ఒక దొంగ దొంగతనానికి పాల్పడితే పోలీసులు ఎలాంటి ట్రీట్‌ మెంటు ఇస్తారో! అలాంటి ట్రీట్‌ మెంటు అమలులోకి తీసుకురావాలి. ఓ వైపు విచ్చలవిడిగా అవినీతి సాగిస్తారు. మరో వైపు ప్రశ్నించిన ప్రజలను వేదిస్తారు. అవసరమైతే కేసులు నమోదు చేస్తారు. ఇలా ప్రజలను తమ దారికి తెచ్చుకోవడానికి అధికారులు వేసే వేలం వెర్రి వెషాలకు కూడా అడ్డుకట్ట పడాలి. ఒక అదికారి నీతిగా నిజాయితీగా ప్రజలకు పనులు చేసి పెడితే దండం పెడతారు. దేవుడని కొలుస్తారు. జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు. కాని అదే అదికారులు పీడిరచుకు తింటే నిత్యం శపిస్తారు. ఇలాంటి సమయంలో అదికారులు అత్యుత్సాహానికి పోయి బాదితుల మీద కేసులు నమోదు చేసి వేదిస్తుంటారు. ఇకపై ఇలాంటివి జరక్కుండా ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోవాలి. లేకుంటే అదికారులు దారికి రారు. వారి అవినీతిని ఆపరు. లంచాలు అడగాలంటే అదికారులు ధడ పుట్టాలి. అవినీతి చేయాలంటే చేతులు వణికిపోవాలి. గత పదేళ్ల కాలంలో అటు రెవిర్యూ, ఇటు రిజిస్ట్రేషన్‌ శాఖల్లో ట్రాన్స్‌ఫర్లు లేకుండా ఏళ్ల తరబడి తిష్టవేసుకొని వున్నారు. అవినీతి సామ్రాజ్యాలు సృష్టించుకున్నారు. రిజిస్ట్రేషన్‌ శాఖలో ఇది మరీ దారుణంగ తయారైంది. జిల్లా స్ధాయిలో పనిచేసిన రిజిస్ట్రేషన్‌ అదికారులు, ఉద్యోగులు చిన్న పట్టణాలలో పనిచేయడానికి నామోషీగా భావిస్తున్నారు. పాతుకుపోయిన దగ్గర కోట్లకు కోట్లు సంపాదించుకునే వెసులుబాటు కల్పించుకున్నారు. ఇటీవల మేడ్చల్‌,మల్కాజిగిరి జిల్లా పరిధిలో సుమారు 600 కోట్ల రూపాయల ప్రభుత్వ భూమిని జిల్లా రిజిస్ట్రేషన్‌ అధికారి కనుసన్నల్లో హంపట్‌ చేశారు. ప్రభుత్వ భూమిని మాయం చేశారు. ప్రైవేటు వ్యక్తులకు దార దత్తం చేశారు. ఇది వెలుగులోకి రావడంతో కింది స్ధాయి ఉద్యోగులను బలి చేశారు. అంత పెద్ద రిజిస్ట్రేషన్‌ తంతు జిల్లా రిజిస్ట్రార్‌కు తెలియకుండా జరిగిందా? అని నేటిధాత్రి అనేకసార్లు ప్రశ్నించింది. కాని సమాధానం చెప్పిన వారు లేరు. డిఆర్‌పై చర్యలు తీసుకున్నది లేదు. 600 కోట్ల రూపాయల స్ధలం మాయంలో సూత్రదారి బాగానే వున్నారు. కాని జిల్లా అధికారి ఆదేశాలను పాటించిన పాత్రదారులైన కింది స్ధాయి ఉద్యోగులు బలయ్యారు. జైలు పాలయ్యారు. అందుకే ఈ రెండు శాఖలను పూర్తిగా ప్రక్షాళన చేస్తే గాని వ్యవస్ధలు గాడిలో పడవు. అవినీతి ఆగదు. ప్రజలు మేలు జరగదు. లేకుంటే యాదా విధిగా అదే అవినీతి రాజ్యమేలక తప్పదు.

అవకాశవాదులకు నో ఛాన్స్‌

ఈ ఎన్నికల్లో గెలిస్తే రేవంత్‌ ఇక బాహుబలే!

సంక్షేమ పథకాలే ఆయుధం

పదేళ్లు పార్టీని నమ్ముకున్న కార్యకర్తలకే అవకాశాలు

తన మార్క్‌ వ్యూహంతో ముందుకెళుతున్న రేవంత్‌

హైదరాబాద్‌,నేటిధాత్రి:

రేవంత్‌ ప్రభుత్వం విజయవంతంగా ఏడాది పాలన ముగించుకొని రెండో ఏడాదిలోకి ప్రవేశిం చింది. అయితే ఈ ఏడాది స్థానిక ఎన్నిక సంస్థల గడువు ముగిసిపోనుండటంతో వాటికి ఎన్నికలు జరపాలి. రేవంత్‌ సర్కార్‌ ఈ ఎన్నికల నిర్వహణకు ఇప్పటినుంచే సమాయత్తమవుతున్నట్టు జరుగుతున్న పరిణామాలు వెల్లడిస్తున్నాయి. ఇప్పుడు జీహెచ్‌ఎంసీ ఎన్నికలతో పాటు, జిల్లా పరిషత్‌లు, మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలకు ఎన్నికలకు నిర్వహించాలి. మున్సిపాలిటీల పాలక వర్గాల కాలపరమితి జనవరి 26తో, గ్రామ పంచాయతీల కాలపరమితి ఫిబ్రవరితో, జిల్లా మరియు మండల పరిషత్‌ల కాలపరమితి వచ్చే జులైతో ముగియనుంది. ఈ నేపథ్యంలో ప్రభు త్వం ఎన్నికలు నిర్వహించి, తన బలానికి తిరుగులేదని మరోసారి నిరూపించుకోవడానికి సంసిద్ధమవుతోంది. ముఖ్యంగా గ్రామ పంచాయతీలు, జిల్లా పరిషత్‌లు, మండల ప్రజాపరిషత్‌లకు ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలనేదానిపై ఈనెల 4న జరిగే మంత్రివర్గ సమావేశంలో చర్చకురానుంది. సంక్రాంతి తర్వాత మార్చి నెలాఖరులోగాదశల వారీగా ఈ ఎన్నికలు జరపాలన్నది ప్రభుత్వ ఉద్దేశంగా కనిపిస్తున్నది. మార్చి నెలలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు, గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీల ఎన్నికలు జరుగనున్న తరుణంలో వాటితో పాటే ఈ ఎన్నికలను కూడా ముగించేస్తే బాగుంటుందని ప్రభుత్వం భావిస్తున్న తరుణంలో ఈ అంశంపై చర్చకు ప్రాధాన్యత ఏర్పడిరది. డిసెంబర్‌ 7వ తేదీన కాంగ్రెస్‌ తన ఏడాది పాలన ముగిసిన సందర్భంగా ఉత్సవాలు చేసుకున్న నేపథ్యంలో ఈ ఎన్నికలు రేవంత్‌ ప్రభుత్వానికి అత్యంత ప్రతిష్టాత్మకమైనవని చెప్పక తప్పదు. రాష్ట్రంలో మొత్తం 12769 గ్రామ పంచాయతీలు, 129 మున్సిపాలిటీలు, 13 మున్సిపల్‌ కార్పొరేషన్లు వున్నాయి. 2021లో రాష్ట్రంలో ప్రవేశపెట్టిన జోనల్‌ వ్యవస్థ కింద ప్రస్తుతం ఏడు జోన్లున్నాయి. అవి వరుసగా బాసర, భద్రాద్రి, కాళేశ్వరం, రాజన్న, చార్మినార్‌, జోగులాంబ మరియు యాదగిరి. 5857 ఎంపీటీసీ స్థానాలు, 539 జెడ్పీటీసీ స్థానాలకు ఈ ఎన్నికలు జరుగుతాయి.
స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే అవకాశమున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, మంత్రు లకు ఇతర నాయకులకు దిశానిర్దేశం చేస్తున్నారు. ముఖ్యంగా బీఆర్‌ఎస్‌ పాలనలో కూడా పార్టీ ని అంటిపెట్టుకొని నిబద్ధంగా పనిచేసిన కార్యకర్తలకు మాత్రమే స్థానిక సంస్థల ఎన్నికల్లో అవకాశం కల్పించాలని ఆయన స్పష్టంగా నిర్దేశించినట్టు తెలుస్తోంది. అవకాశవాద రాజకీయాలు నెర పుతూ, అవసరాన్ని బట్టి పార్టీలు మారేవారిని పట్టించుకోవద్దని ఆయన స్పష్టమైన సంకేతాలు పంపుతున్నారు. అదీకాకుండా గత అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికల్లో అంతకుముందు అంపశయ్య పై ఉన్న పార్టీని ఏకంగా అధికారంలోకి తెచ్చిన రేవంత్‌ ఇప్పుడు స్థానిక ఎన్నికల్లో కూడా తా నేంటనేది మరోసారి నిరూపించుకోబోతున్నారు. స్థానిక ఎన్నికలు ప్రధానంగా గ్రామీణ ప్రాంతా ల్లో జరుగనున్నందున రైతు, మహిళ, బీసీ, ఎస్సీ సంక్షేమ కార్యక్రమాలపై దృష్టి కేంద్రీకరించి, తమది సంక్షేమ ప్రభుత్వమని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ఆయన కృతనిశ్చయంతో అడుగులు ముందుకు వేస్తున్నారు. అయితే ఈ ఎన్నికల్లో పార్టీకి ఏమాత్రం నష్టం జరిగినా, అది రేవంత్‌ నాయకత్వానికి ఇబ్బందులు కలిగించే అవకాశాలు లేకపోలేదు. కాంగ్రెస్‌లో ఇప్పటివరకు స్తబ్దుగా ఉన్న సీనియర్‌ నాయకులు ఒక్కసారి జూలు విదిల్చి రేవంత్‌ను చికాకుపెట్టడానికే యత్నిస్తారు. తన మార్కు రాజకీయాలు నెరపుతున్న రేవంత్‌కు యివేవీ తెలియంది కాదు.
2019 స్థానిక ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ క్లీన్‌ స్వీప్‌ చేసినప్పటికీ, ఈ సారి రాజకీయాల్లో పూర్తి మార్పు కనిపిస్తోంది. గత అసెంబ్లీ మరియు లోక్‌సభ ఎన్నికల్లో ఘోర పరాభవం తర్వాత బీఆర్‌ఎస్‌కు చెందిన జిల్లాస్థాయి నాయకులు, చాలా మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరిపోయారు. ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికి కాంగ్రెస్‌ ప్రభుత్వం తాను ఇప్పటివరకు అమలు చేసిన సంక్షేమ పథకాలపై ఆధారపడుతోంది. రైతుబంధు రూ.10వేల నుంచి రూ.15వేలకు పెంపు, దీనికి తోడు భూమిలేని, కౌలు రైతులకు రైతు భరోసా కింద వార్షి కంగా రూ.12వేలు చెల్లింపు, రైతులకు సన్నవరి ధాన్యానికి క్వింటాకు రూ.500 బోనస్‌ చెల్లిం పు, మహిళలకు రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌ సరఫరా వంటి సంక్షేమ పథకాలు ఈ ఎన్నికల వైతరిణి నుంచి గట్టెక్కిస్తాయన్న గట్టి నమ్మకంతో కాంగ్రెస్‌ పార్టీ బరిలోకి దిగనుంది.
కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత, పార్టీ ఫిరాయింపులతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న బీఆర్‌ఎస్‌ కచ్చితంగా ఈ ఎన్నికలపై చావో రేవో అన్న రీతిలో దృష్టిపెట్టక మానదు. ఇదే సమ యంలో కాషాయపార్టీ కూడా స్థానికంగా మరింత బలపడేందుకు అవసరమైన వ్యూహాలు రచి స్తోంది. కాంగ్రెస్‌ ఇంకా రైతు భరోసా చెల్లించలేదు. దీనికోసం కసరత్తు జరుగుతున్నదని వార్త లు వస్తున్నాయి. ఇదిలావుండగా జనవరి 4వ తేదీన రాష్ట్ర కేబినెట్‌ సమావేశం జరుగనుంది. బీసీ కమిషన్‌ నివేదిక ఆధారంగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వెనుకబడిన వర్గాలకు ఎంతమేర రిజర్వేషన్లు కల్పించాలన్నది, ఎస్సీ ఉప`కుల వర్గీకరణపై ఏకసభ్య కమిషన్‌ నివేదించిన అం శాలు, రైతుబంధు స్థానంలో రైతుభరోసాను ప్రవేశపెట్టడం, యాదగిరిగుట్ట దేవస్థానానికి, టీటీడీస్థాయిలో పాలక మండలిని ఏర్పాటు చేయడం వంటి అంశాలు చర్చకు వచ్చే అవకాశముంది. బీసీ కమ్యూనిటీల పై సర్వే నిర్వహించేందుకు గత నవంబర్‌లో ప్రభుత్వం ప్రత్యేకంగా బీసీ కమిషన్‌ను నియమించింది. ఐ.ఎ.ఎస్‌. ఆఫీసర్‌ బి. వెంకటేశ్వరరావు దీనికి నేతృత్వం వహిస్తున్నారు. ఈ కమిటీ నివేదిక ఒకటి రెండు రోజుల్లో ప్రభుత్వానికి అందే అవకాశముంది. అదేవిధంగా సుప్రీంకోర్టు నిర్దేశాల మేరకు ఎస్సీ ఉప`కుల వర్గీకరణకు సంబంధించి రిటైర్డ్‌ హైకోర్టు న్యాయ మూర్తి జస్టిస్‌ షమీమ్‌ అక్తర్‌ నేతృత్వంలో ఒక కమిషన్‌ను అక్టోబర్‌ 11న ప్రభుత్వం నియమిం చింది. ముందుగా ఈ కమిషన్‌ కాలావధిని రెండు నెలలుగా నిర్దేశించినప్పటికీ, తర్వాత వివిధకారణాలవల్ల మరో నెలపాటు ప్రభుత్వం పొడిగించింది. ఈ కమిషన్‌ తుది నివేదిక కూడా ఈవారం చివర్లో అందే అవకాశముంది. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం ఈ కమిషన్‌ నివేదిక అందాల్సిన నేపథ్యంలో, తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ మరియు ఇతర నియామక సంస్థల నియామ కాలను తాత్కాలికంగా నిలిపేసింది. ఎస్సీ ఉప`కుల వర్గీకరణ కమిషన్‌ నివేదిక ఆధారంగా రిజ ర్వేషన్లను అమలు పరచాలన్న ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. వివిధ శాఖల్లో రిజర్వేషన్ల అమలుపై కూడా ఈసమావేశంలో సమీక్షించనున్నారు.
ఈ కేబినెట్‌ సమావేశంలో విధానపరంగా కీలకమైన మార్పు విషయంలో కూడా నిర్ణయం తీసుకునే అవకాశముంది. ప్రస్తుతం అమలు చేస్తున్న రైతుబంధు స్థానంలో రైతు భరోసాను తీసుకు రావాన్నది రేవంత్‌ ప్రభుత్వ ఉద్దేశం. అంటే రైతుబంధు కింద ఇప్పటివరకు రైతులకు వార్షికంగా రూ.10వేలు పెట్టుబడి సాయం కింద ప్రభుత్వం అందజేస్తున్నది. అయితే దీన్ని రూ.15వేలకు పెంచి రైతుభరోసాగా పేరుమార్చాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. ఇదే సమయంలో పెట్టుబడి సా యం అందించే విషయంలో కొత్త నిబంధనలు తీసుకువచ్చే అవకాశముంది. ముఖ్యంగా సహా యం అందించడానికి సాగుభూమి పరిమితిని విధించడం, వ్యవసాయేతర భూములను ఈ పథ కం నుంచి మినహాయించడం, వ్యవసాయ భూమి పరిమితిని 5`10ఎకరాలుగా నిర్ణయించడం వంటి అంశాలు ఈ కేబినెట్‌ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశముంది. అంతేకాకుండా రైతు బంధు నుంచి మినహాయించిన వ్యవసాయ కూలీలు, కౌలు రైతులను రైతు భరోసా కిందికి తీసుకొచ్చి వార్షికంగా రూ.12వేలు చెల్లించే అంశాన్ని కూడా కేబినెట్‌ సమావేశంలో చర్చించనున్నా రు.
యాదరిగిరి గుట్ట దేవస్థానానికి తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో పాలక మండలిని ఏర్పాటుచేయాలన్నది కూడా ప్రభుత్వ ఉద్దేశం. ఇదికూడా చర్చకు వచ్చే అవకాశముంది. ఇదిలావుం డగా సంక్రాంతి తర్వాత కొత్త రేషన్‌ కార్డులను ఇవ్వాన్నది ప్రభుత్వ ఉద్దేశం. రేషన్‌కార్డు ఇచ్చేం దుకు ప్రస్తుతం వున్న వార్షికాదాయ పరిమితిని పెంచే అవకాశముంది. ఏది ఏమైనా ఈ ఏడాది స్థానిక సంస్థలకు ఎన్నికలు జరుగనున్నదున, ఇది కూడా ఎన్నికల నామ సంవత్సరంగా మారిం ది. అందువల్ల ఈ ఏడాది రాష్ట్ర రాజకీయాలు హాట్‌గానే వుండబోతున్నాయనేది స్పష్టమవుతోంది.

క్రికెట్ పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి.

మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలం డోకూర్ గ్రామంలో ప్రేమ్ కుమార్, సంపత్ కుమార్ స్మారకార్థం నిర్వహించిన క్రికెట్ పోటీలను ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి శుక్రవారం ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ..కాంగ్రెస్ ప్రభుత్వం క్రీడాలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తుందన్నారు. క్రీడలు మానసిక ఉల్లాసంతో పాటు..శారీరక దృఢత్వాన్ని పెంచుతాయని తెలిపారు, క్రీడాకారులు గెలుపు, ఓటములను క్రీడా స్ఫూర్తితో తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు క్రీడాకారులు పాల్గొన్నారు.

పి డి ఎస్ యు ఆధ్వర్యంలో రాజీవ్ చౌక్ లో దిష్టిబొమ్మ దహనం.

వనపర్తి,నేటిధాత్రి:
వనపర్తి పట్టణంలోని రాజీవ్ చౌక్ లో శుక్రవారం పి డి ఎస్ యు ఆధ్వర్యంలో ఇంజనీరింగ్ విద్యార్థినీ, విద్యార్థులు సి ఎం ఆర్ కాలేజీ యజమాన్యం దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా పి డి ఎస్ యు ఉమ్మడి జిల్లా అధ్యక్షులు పవన్ మాట్లాడుతూ హైదరాబాద్ లో విద్యార్థినిలను వేధించినందుకు నిరసనగా దిష్టిబొమ్మను దహనం చేశామని ఆయన పేర్కొన్నారు. వెంటనే సీఎంఆర్ కాలేజీ గుర్తింపును రద్దు చేయాలని విద్యార్థులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దిష్టిబొమ్మను దహనం చేసే సమయంలో ట్రాఫిక్ పోలీసులు అక్కడికి వచ్చి దిష్టిబొమ్మను దహనం చేయడానికి అనుమతి ఉన్నదా? అని పి డి ఎస్ యు ఉమ్మడి జిల్లా అధ్యక్షులు పవన్ కుమార్ ను ప్రశ్నించారు.

ఎంపీ వద్దిరాజు ఎమ్మెల్సీ సిరికొండ, రాజ్యసభ మాజీ సభ్యులు రావులతో కలిసి సంఘ సంస్కర్త సావిత్రి భాయికి నివాళి

రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర శాసనమండలిలో బీఆర్ఎస్ పక్ష నాయకులు సిరికొండ మధుసూదనాచారి,

vaddiraju ravichandra

రాజ్యసభ మాజీ సభ్యులు రావుల చంద్రశేఖరరెడ్డితో కలిసి స్త్రీఅభ్యుదయవాది, గొప్ప సంస్కర్త,స్త్రీవిద్య,అణగారిన వర్గాల హక్కుల కోసం పోరాడిన వీరవనిత సావిత్రి భాయిపూలేకు ఘనంగా నివాళులర్పించారు.సావిత్రి భాయి 194వ జయంతి సందర్భంగా ఎంపీ రవిచంద్ర ఎమ్మెల్సీ మధుసూదనాచారి, మాజీ ఎంపీ చంద్రశేఖర్ రెడ్డి, సాహిత్య అకాడమీ మాజీ ఛైర్మన్ జూలూరు గౌరీశంకర్, మాజీ ఎమ్మెల్యే శశిధర్ రెడ్డి తదితర ప్రముఖులతో కలిసి శుక్రవారం హైదరాబాద్ తెలంగాణ భవన్ లో ఆమె చిత్రపటానికి పూలుజల్లి ఘనంగా నివాళులర్పించి స్త్రీవిద్యా వ్యాప్తికి చేసిన కృషిని కొనియాడారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు గెల్లు శ్రీనివాస్ యాదవ్,కోతి కిశోర్ గౌడ్,తుంగబాలు,గాంధీ నాయక్ తదితరులు పాల్గొని సావిత్రి భాయి చిత్రపటానికి పూలువేసి నివాళులర్పించారు.

బిసిటియు వరంగల్ జిల్లా అధ్యక్షుడిగా పెరుమాండ్ల సాంబమూర్తి

 

నేటిధాత్రి,కాజీపేట

కాజీపేట ఫాతిమా నగర్ కు చెందిన పెరుమాండ్ల సాంబమూర్తి బిసిటియు వరంగల్ జిల్లా అధ్యక్షుడిగా నియమితులైనారు. ఈ మేరకు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు అయిన జాజుల శ్రీనివాస్ గౌడ్ ఈ నియామక ఉత్తర్వులను సాంబమూర్తికి అందించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. బీసీ సంక్షేమ సంఘం అనుబంధ సంఘమైన బీసీ టీచర్స్ యూనియన్ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడిగా వరంగల్ నగరంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల రైల్వే గేట్ లో సోషల్ స్టడీస్ స్కూల్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్న పెరుమాండ్ల సాంబమూర్తి సేవలందించారని తెలిపారు. బీసీలకు రాజ్యాధికారమే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. అంతకుముందు సాంబమూర్తి మాట్లాడుతూ వరంగల్ జిల్లా బిసిటియు అధ్యక్షుడుగా నియమించిన జాతీయ అధ్యక్షులైన జాజుల శ్రీనివాస్ గౌడ్ కు, బి సి టి యు నేతలైన తాళ్లపల్లి సురేష్, సుంకరి శ్రీనివాస్ రావు, ఇతర నేతలకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు ప్రకటించారు. అనంతరం సాంబమూర్తిని పలువురు అభినందించారు

భూభారతి 2024 చట్టంతో సమస్యలు తీరేనా?

రైతులకు చుక్కలు చూపించిన ధరణి

భౌతిక రికార్డులకు డిజిటల్‌ రికార్డులకు పొంతనలేదు

చిన్న పొరపాటుకు కూడా కలెక్టర్‌నే కలవాలంటే ఎట్లా?

పనులు వదులుకొని రైతులు కలెక్టర్‌ ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన దుస్థితి

ప్రభుత్వ నిర్వాకానికి లబోదిబో మంటున్న రైతులు

రేవంత్‌ సర్కార్‌పై ఆశలు పెట్టుకున్న రైతులు

కొత్త చట్టం అమల్లోకి వస్తే బాధలనుంచి గట్టెక్కుతామన్న ఆశ

హైదరాబాద్‌,నేటిధాత్రి:

కొత్త రెవెన్యూ చట్టం భూభారతి (ఆర్వోఆర్‌ా2024) బిల్లు గవర్నర్‌ ఆమోదం కోసం తెలంగాణ ప్రభుత్వం పంపింది. గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ ఆమోదం తెలిపిన తర్వాత ఈ బిల్లు అమల్లోకి వ స్తుంది. డిసెంబర్‌ 18న శాసనసభలో రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆర్వోఆర్‌ా2024 బిల్లును ప్రవేశపెట్టడం, 20వ తేదీన శాసనసభలో, 21న శాసన మండలిలో చర్చలు జరిగిన తర్వాత బిల్లు ఉభయసభల ఆమోదం పొందింది. ఈ కొత్త చట్టానికి సంబంధించిన మార్గదర్శకాలు, ప్రక్రియలను రెవెన్యూశాఖ అధికార్లు పూర్తిచేశారు. ఇక సాగుభూముల రిజిస్ట్రేషన్‌, మ్యుటేషన్ల సేవల పోర్టల్‌ ధరణి…నిర్వహణ బాధ్యతలను పూర్తిగా కేంద్ర ప్రభుత్వం సంస్థ ఇన్ఫ ర్మేటిక్‌ సెంటర్‌ చేతికి వచ్చాయి. జనవరి 1వ తేదీన ఈ పోర్టల్‌ను సంస్థ పూర్తిస్థాయిలో నిర్వ హించింది. గత ప్రభుత్వ హయాంలో 2020 నవంబర్‌ 2వ తేదీనుంచి అమల్లోకి వచ్చిన ధరణి పోర్టల్‌ను ఐఎఫ్‌ఎల్‌ఎస్‌, దాని అనుబంధ సంస్థ టెర్రా ఐఏసీఎస్‌లు నిర్వహిస్తూ వచ్చాయి. ఈ విదేశీ సంస్థలను తొలగించి స్వదేశీ నిర్వహణలోకి ఈ పోర్టల్‌ను తీసుకొస్తామని కాంగ్రెస్‌ ఎన్నికల సందర్భంగా వాగ్దానం చేసింది. ఈమేరకు నవంబర్‌ నెలాఖరుతో టెర్రా ఐఏసీఎస్‌తో ఒప్పందా న్ని ముగించింది. ధరణి పోర్టల్‌ను భూభారతిగా మార్చారు. ఇందుకోసం రెవెన్యూ చట్టంలో ప్ర భుత్వం మార్పులు చేసింది. దీనికి సంబంధించిన లోగో మరియు ఇతర వివరాలను రెవెన్యూ శాఖ రూపొందిస్తోంది. ముఖ్యమంత్రితో సమావేశం తర్వాత లోగో ఖరారు చేసి, ప్రారంభించే తేదీని నిర్ణయిస్తారు.

తెలంగాణ రైట్స్‌ ఇన్‌ ల్యాండ్‌ అండ్‌ పట్టాదార్‌ పాస్‌బుక్స్‌ యాక్ట్‌`2020 ప్రకారం ‘ధరణి’ పేరుతో ఆన్‌లైన్‌ రికార్డును గత ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కానీ ఈ ధరణిపై భూయజమానుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ముఖ్యంగా పట్టేదార్‌ పాస్‌పుస్తకాలు అందకపోవడం లేదా రిక ర్డుల్లో తమ భూములు, పేర్ల వివరాలు తప్పుగా నమోదు కావడంతో రైతులు గగ్గోలు పెట్టారు. ఈ పొరపాట్ల వల్ల వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనాల్సి వచ్చింది. మరి ఈ ఇబ్బందులను పరిష్కరించేందుకు సరైన యంత్రాంగం లేకపోవడం పరిస్థితిని మరింత క్లిష్టతరం చేసింది. సరిగ్గా ఇదే సమయంలో కాంగ్రెస్‌ పార్టీ రంగంలోకి దిగి దీన్ని పూర్తిగా మార్చివేస్తామని, సమస్యలను పరి ష్కరిస్తామని 2023 అసెంబ్లీ ఎన్నికల ముందు ప్రజలకు వాగ్దానం చేసింది.

ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రేవంత్‌ ప్రభుత్వం ధరణి పోర్టల్‌ వల్ల ఏర్పడిన సమస్యలపై ని యమించిన సబ్‌`కమిటీ మొత్తం 123 సమస్యలనుగుర్తించింది. భూమి కొనుగోలుదార్లు, రైతులకు నిద్రలేని రాత్రులనే ధరణి మిగిల్చింది. దిగువ స్థాయిలో అప్పిలేట్‌ అథారిటీ లేకపోవడం మరిన్ని సమస్యలు సృష్టించింది. నిజానికి ఈ 123 సమస్యల్లో సింహభాగం మండల స్థాయిలోనే పరిష్కారమవుతాయి. మొత్తం బాధ్యతను కలెక్టర్‌కే అ ప్పగించడంతో చిన్నా, పెద్దా సమస్యలన్నీ పెండిరగ్‌లో పడిపోయాయి. చిన్న సమస్య పరిష్కారానికి కూడా కలెక్టర్‌ వద్దకే పరిగెత్తాల్సి రావడం గ్రామాల్లోని చిన్న,సన్నకారు రైతులకు పెద్ద తలనొప్పిగా మారింది. ధరణిపోర్టల్‌లో వచ్చిన తప్పులు లేదా పొరపాట్లు లేదా ఇతరత్రా చిన్న సమస్యలను ఎమ్మార్వో దృష్టికి తీసుకెళ్లినా తమకు అధికారం లేదంటూ చేతులెత్తేయడంతో రైతులు తీవ్ర అయోమయానికి గురైనమాట వాస్తవం. అదీ కాకుండా పాత పద్ధతే వుంటే ఈ గొడవ వుండేది కాదుకదా అన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమయ్యాయి. ఆవిధంగా చిన్న పొరపాట్లకు సంబంధించి వేలాది కేసులు అట్లా పెండిరగ్‌లో పడిపోయాయి. అవి ఎప్పటికి పరిష్కారమవుతాయో కూడా తెలియని పరిస్థితి! ఇక మ్యుటేషన్‌ విషయానికి వస్తే దాన్ని దిగువ స్థాయి అధికార్లకు వదిలేస్తే సరిపోయేది. ఒకవేళ అక్కడ సమస్య పరిష్కారం కకపోతే వారికి ఎగువన రెవెన్యూ డివిజన్‌ స్థాయి లో మరొక లేయర్‌ అధికార్లకు సమస్య పరిష్కారానికి అవకాశం కల్పించాల్సింది. ఇక నాలాల ఆక్రమణల విషయం కూడా స్థానిక అధికార్ల స్థాయిలోనే పరిష్కరించవచ్చు. ఆ విధానమే లేకుండా మొత్తం ఏకబిగిన కలెక్టర్‌, సీసీఎల్‌లపైనే మొత్తం భారం పెట్టడంతో ప్రతి చిన్న సమస్య పీటముడి పడిరది. అప్పుడు రైతులు తమ వ్యవసాయపనులు ఇతర కుటుంబ వ్యవహారాలు చూసుకోవాలా, ప్రభుత్వం చేసిన నిర్వాకానికి కలెక్టర్‌ ఆఫీసు చుట్టూ తిరగాలా? అన్న పరిస్థితి ఏర్పడిరది.

ధరణి సమస్యలను గుర్తించడానికి ఒక స్వచ్ఛంద సేవాసంస్థ పైలెట్‌ ప్రాజెక్టు కింద రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలోని పది గ్రామాల్లో సర్వే చేసింది. ఈ గ్రామాల్లో 2114 మంది రైతులు ధరణి పరంగా సమస్యలు ఎదుర్కొంటున్నట్టు తేలింది. అంతేకాదు 4465 ఎకరాలు సర్వే నెంబర్లకు కూడా ధరణివల్ల లేనిపోని సమస్యలు వచ్చినట్టు స్పష్టమైంది. ‘లీగల్‌ ఎంపవర్‌మెంట్‌ అండ్‌ అసిస్టెంన్స్‌ టు ఫార్మర్స్‌’ (లీఫ్‌) ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ సంస్థ తాము సేకరించిన సమస్యాత్మక సమాచారాన్ని రెవెన్యూ అధికార్లకు గత సెప్టెంబర్‌ నెలలో అందజేసింది. ఈ సంస్థ తొలి దశలో ఆయా గ్రామాల్లో క్యాంప్‌లు ఏర్పాటు చేయగా, రెండో దశలో రెవెన్యూ రికార్డులను పరిశీలించి రెవెన్యూ అధికార్ల దృష్టికి తీసుకెళ్లడం, మూడో దశలో రైతులకు సమస్య పరిష్కారంలో సహకరించడం అనే రీతిలో ఈ సంస్థ పనిచేసింది.

భూముల సమగ్ర సర్వే చేపట్టకుండానే ధరణి పోర్టల్‌లో రెవెన్యూ రికార్డులను డిజిటలైజ్‌ చేస్తూ వచ్చారని, ఫలితంగా చాలామంది భూయజమానులైన రైతుల పేర్లు పోర్టల్‌లో కనిపించడం లేదన్న ఆరోపణలు బలంగా వచ్చాయి. దీనివల్ల రైతుబంధుకు అర్హులైన రైతులకు రైతుబంధు మొ త్తం వారి ఖాతాల్లో జమకాలేదు. మరికొంతమంది రైతులు ధరణి రాకముందే తమ భూములను తనఖాకు పెట్టిన సందర్భాలున్నాయి. వీరు రుణాలు చెల్లించిన తర్వాత ధరణి పోర్టల్‌లోని పొర పాట్ల కారణంగా తమకు పాస్‌పుస్తకాలు రావడంలేదని లబోదిబోమంటున్నారు. ఇన్ని సమస్యల నేపథ్యంలో ప్రస్తుతం రైతులు భూభారతి పోర్టల్‌లోనైనా తమ సమస్యలకు పరిష్కారం లభిస్తుందా అని ఎదురుచూస్తున్నారు.

నిజానికి గత మూడేళ్ల కాలంలో ధరణి పోర్టల్‌ వల్ల అనేక కొత్త సమస్యలు పుట్టుకొచ్చాయి. బౌతికంగా వున్న రికార్డులకు, డిజిటల్‌ రూపంలో ధరణిలో పేర్కొన్న రికార్డులకు అసలు పొంతనే లేదు. కొన్ని దశాబ్దాలుగా రైతులు దున్నుకుంటున్న భూములను నిషేధిత జాబితాలో చేర్చారు. దీంతో ఆ భూ యజమానులు అయోమయంలో పడటమే కాదు, తమ సమస్యను ఎవరికి చెప్పుకో వాలో కూడా తెలియని పరిస్థితికి లోనయ్యారు. నిషేధిత జాబితాలో చేర్చడంతో అత్యవసర పరిస్థితుల్లో తమ భూములను అమ్ము కోవడానికి వీల్లేకుండా పోయింది. సమస్యను నియమిత కాలావ ధిలో పరిష్కరించే యంత్రాంగం లేకపోవడం పరిస్థితిని మరింత సంక్లిష్టం చేసింది. ఫలితంగా రెవెన్యూ అధికారి స్థాయిలో పరిష్కారం కావాల్సిన సమస్యలు ధరణి పుణ్యమాని కోర్టుల్లో మూ లుగుతున్నాయి. నిరుపేద రైతులు తమ సమస్యలను వినిపించుకునే అవకాశమే లేకుండా పో యింది. ఈ నేపథ్యంలోనే ధరణి కారణంగా రైతులు ఎదుర్కొంటున్న పలు సమస్యలకు పరిష్కారంగా కొత్త ప్రభుత్వం భూభారతి పేరుతో కొత్తచట్టాన్ని రూపొందించింది. వ్యవసాయేతర భూ ములను కూడా ఈ చట్ట పరిధిలోకి కాంగ్రెస్‌ ప్రభుత్వం తీసుకురావడమే కాదు, సమస్యలు ఉత్పన్నమైతే దాన్ని పరిష్కరించేందుకు ఒక యంత్రాంగాన్ని కూడా ఏర్పాటు చేసింది. ఇదే సమయంలో ప్రభుత్వ భూములు అక్రమ ఆక్రమణలకు గురికాకుండా కాపాడటం కూడా దీన్ని ముఖ్యోద్దేశం. ప్రస్తుత ప్రభుత్వం భూములను రీసర్వే చేయడం ద్వారా ధరణిలో జరిగిన పొరపాట్లను సరిదిద్దడానికి ఉద్యుక్తమైంది. ఈ కొత్త వ్యవస్థ ద్వారా ప్రభుత్వం ఏవిధంగా ప్రస్తుతం రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరిస్తుందో చూడాలి.

కాలేజీల దుర్మార్గం… తల్లిదండ్రుల దౌర్భాగ్యం!?

`బాధ్యతలేని సమాజంలో బతుకుతున్నాం.

`చదువు పేరుతో పిల్లలను నరకకూపంలోకి పంపుతున్నాం.

`పేరున్న విద్యా సంస్థలని లక్షలు పోసి సీట్లు కొంటున్నాం.

`పిల్లల జీవితాలతో కాలేజీలు ఆటలాడుతుంటే గుడ్లప్పగించి చూస్తున్నాం

`చేష్టలుడిగి మన చేతగాని తనానికి సిగ్గు పడుతున్నాం

`తల్లిదండ్రులుగా ఫెయిల్‌ అవుతున్నాం.

`పిల్లలకు గొప్ప చదువులు చదివించాలని ఆరాటపడుతున్నాం.

`మన కోరికలను వారి మీద బలవంతంగా రుద్దేస్తున్నాం.

`వారికి ఎలాంటి చదువు ఇష్టమో కనుక్కోలేకపోతున్నాం.

`లక్షల ఫీజులు చెల్లించి బందర దొడ్డి లాంటి కాలేజీలకు పంపిస్తున్నాం.

`వాళ్లు పడుతున్న ఇబ్బందులు తెలుసుకునే ప్రయత్నం చేయం.

`కాలేజీలో సమస్యల గురించి పిల్లలు చెబితే వినిపించుకోం.

`చదవలేక కుంటిసాకులు చెబుతున్నారని బెదిరిస్తాం.

`లక్షల ఫీజులు చెల్లించామని పిల్లల్నే భయపెట్టిస్తాం.

`మన పిల్లలు మన వద్ద వుంటే చదవలేరని మనమే డిసైడ్‌ అవుతాం.

`హస్టళ్లలో వేస్తేనే భయంతో చదువుతారని గుడ్డిగా నమ్మేస్తుంటాం.

`మన బలహీనతలు విద్యా సంస్థల అరాచకాలకు ఆజ్యం పోస్తున్నాయి.

`మన పాలిట యమపాశాలౌతున్నాయి.

`అయినా మనం కళ్లు తెరవం.

`కార్పొరేట్‌ కాలేజీలకి పిల్లలను పంపడం ఆపం.

`మన దౌర్భాగ్యం…కార్పొరేట్‌ కాలేజీల అరాచకాలను నిలదీయలేం.

`ఎన్ని దుర్మార్గాలు చేసినా మళ్ళీ మళ్ళీ అవే కాలేజీలకు పంపిస్తుంటాం.

`మనమెందుకు మారతాం..పిల్లల ప్రాణాలు పోతున్నా చలించం.

`చదువు పేరుతో ఆడపిల్లలను రాక్షసుల మధ్యకు పంపిస్తూనే ఉంటాం.

తెలంగానలోని కార్పోరేట్‌ కాలేజీల్లో రోజుకో వివాదం ముసురుకుంటోంది. కాలేజీలలో యాజమాన్యాల పట్టింపు లేని తనం, అందులో పనిచేసే ఉద్యోగుల నిర్లక్ష్యం, దుర్మార్గాల మూలంగా విద్యార్దుల జీవితాలు ఆగమౌతున్నాయి. ఇంటర్‌ నుంచి ఇంజనీరింగ్‌ కాలేజీల దాకా అనేక రకాలైన వివాదాలు చుట్టుముడుతూనే వున్నాయి. యాజమాన్యాలు సంపాదన మీద పెట్టే దృష్టి పిల్లల భద్రత మీద పెట్టడం లేదు. నోట్లు లెక్కపెట్టుకోవడంలో వున్న శ్రద్ద మహిళా విద్యార్ధులకు రక్షణ కల్పించడంలో చూపడం లేదు. అసలు కాలేజీ హస్టళ్లలో అమ్మాయి వీడియోలు రహస్యంగా తీస్తూ, వారి జీవితాలతో ఆటలాడుకునేంత ధైర్యం ఎలా వచ్చింది? అమ్మాయిలు వుండే హస్టళ్లలో ఎన్ని రకాలైన కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలో అవగాహన లేకుండా పోతోందా? అందులో పనిచేసే ఉద్యోగుల వ్యహరశైలి ఎలా వుందో తెలుసుకోలేనంత తీరక యాజమాన్యాలకు లేదా? తాజాగా మేడ్చల్‌ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి ఇంజనీరింగ్‌ కాలేజీలో జరిగిన ఉదంతంలో దోషులను కఠినంగా శిక్షించాల్సి వుంది. కాలేజీ యాజమాన్యం మీద కూడా కేసు నమోదు చేయాల్సిన అవసరం వుంది. ప్రైవేటు కార్పోరేట్‌ కాలేజీలలో ఏం జరిగిన పాలకులు పట్టించుకోరన్న ఒక భావన అందరిలోనూ ఏర్పడిపోయింది. విద్యా సంస్దలపై ఎలాంటి నిర్ణయం తీసుకున్నా విద్యార్దుల కేరిర్‌ పాడైపోతుందనో, ఏడాది విద్యా కాలం వారికి వృధా అవుతుందని పాలకులు దూర దృష్టితో ఆలోచిస్తుంటే, యాజమన్యాలు మాత్రం సంకుతంగా తయారౌతున్నారు. పాలకులు తమ జోలికి రారన్న ధీమాతో వుంటున్నారు. ఇటీవల నగరశివారులో వున్న అనేక కార్పోరేట్‌ కాలేజీలో అనేక వరుస సంఘటలను జరిగాయి. శ్రీచైతన్య కాలేజీలో ఓ అమ్మాయి చనిపోయింది. మరో కాలేజీలో వీడియోలు తీస్తున్నారన్న ఆరోపణలు వచ్చాయి. ఇటీవలే చామకూర మల్లారెడ్డి కాలేజీలో ఆహారం విషయంలో విద్యార్ధులు రోడ్కెక్కారు. లక్షలకు లక్షల ఫీజులు వసూలు చేస్తూ విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెట్టడం లేదని విద్యార్దులు ఆందోళన చేశారు. నాసిరకం బోజనాల మూలంగా అనారోగ్యం పాలౌతున్నామని గోడు వెల్లబోసుకున్నారు. ఆ వివాదం ముగిసిపోకముందే చామకూర మల్లారెడ్డి కాలేజీలో విద్యార్ధునులకు చెందిన వీడియోలు తీస్తున్నారని, బ్లాక్‌ మెయిల్‌ చేస్తున్నారని విద్యార్దులు రెండు రోజులుగా ఆందోళన చేస్తున్నారు. పాలమ్మిన, పూలమ్మిన, పడరాని కష్టాలు పడినా అని చెప్పుకునే మల్లారెడ్డి కాలేజీలో నీతి మాలిన పనులు చేస్తుంటే ఏం చేస్తున్నాడు. దేశంలోనే ఎక్కడా లేనన్ని విద్యా సంస్ధలు ఏర్పాటు చేశానని, తన కాలేజీలలో వున్న సౌకర్యాలు మరెక్కడా లేవంటూ ఊదరగొట్టే మల్లారెడ్డి ఈ విద్యార్దులకు ఏం సమాధానం చెబుతారు.

విద్యా సంస్ధలు ఏర్పాటు చేసుకోవడం, అక్రమాలు చేయడం, రాజకీయాల్లో చేరడం తప్పులను కప్పిపుచ్చునేందుకు అండగా మల్చుకోవడం ఈ మధ్య బాగా అలవాటైపోయింది. ఇదే మల్లారెడ్డి అల్లుడికి చెందిన మెడికల్‌ కాలేజీలో చనిపోయిన వ్యక్తికి చికిత్స చేసి ఠాగూర్‌ సినిమాను చూపించారని బంధువులు ఆందోళన చేశారు. ఇలా విద్యా సంస్ధల ముసుగులో కాలేజీలు ఏర్పాటు చేసి ప్రజల జీవితాలతో ఆటలాడుకునే వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలి. చామ కూర మల్లారెడ్డి కాలేజీలో చదువుకునే అమ్మాయిలు గత కొంత కాలంగా కాలేజీకి అనుబంధమైన హాస్టల్‌లో ఏదో జరుగుతోందని వార్డెన్‌కు పిర్యాధులు చేస్తూనే వున్నారు. గత మూడు నెలల నుంచి ఏదో జరుగుతోందన్న అనుమానం అమ్మాయిలు వ్యక్తం చేస్తూనే వున్నారు. అయినా వార్డెన్‌లో స్పందన లేదని, పైగా తమనే బెదిరిస్తోందని విద్యార్థులు చెబుతున్నారు. తీరా పిల్లలు నిలదీస్తే అమ్మాయిలు బాత్‌ రూముల్లో ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, అందుకోసం కెమెరాలు ఏర్పాటు చేసినట్లు నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నట్లు కూడా చెబుతున్నారు. అంటే అమ్మాయిలు కాలేజీలలో చేరింది హస్టల్‌ బాత్‌ రూంలలో ఆత్మహత్యలు చేసుకోవడానికా? ఇలాంటి సమాధానాలు ఎవరైనా చెబుతారా? అంటే కాలేజీ హస్టళ్లలోని బాత్‌ రూంలలో తామే కెమెరాలు ఏర్పాటు చేశామని వార్డెన్‌ చెబుతున్నప్పుడు వెంటనే మల్లారెడ్డి చర్యలు తీసుకోవాలి. ఇంతటి దుర్మార్గాలకు ఒడిగడుగుతున్న మల్లారెడ్డి కాజీలను మూసేయించాల్సిన అవసరం వుంది. మల్లారెడ్డి కాలేజీ మూసేస్తే విద్యార్ధులకు ఒక ఏడాది విద్యా సంవత్సరం వృధా అవుతుందేమో కాని, వారి జీవితాలకు భద్రత దొరుకుతుంది. లేకుంటే వారి జీవితాలు నాశనమౌతాయి. ఇప్పుడున్న పరిస్దితుల్లో ఆడపిల్లలకు భద్రత లేకుండా వుంది. ఉన్నత విద్యలను అభ్యసిస్తున్న విద్యార్దుల విషయంలోనే ఇంత నిర్లక్ష్యంగా వున్న కాలేజీల అనుమతులు రద్దుచేస్తే, ఇతర కాలేజీల్లో భయం ఏర్పడదు. విద్యార్ధుల జీవితాలతో ఆటలాడుతున్న కాలేజీలను గుర్తించి, వాటి గుర్తింపు రద్దు చేస్తే తప్ప విద్యా వ్యవస్ధలో మార్పులు రావు.

కాలేజీల వ్యవహారం ఇలా వుంటే తల్లిదండ్రుల దౌర్భాగ్యం మరోలా వుంది. మనం బాధ్యత లేని సమాజంలో బతుకుతున్నామన్న సోయి తల్లిదండ్రుల్లో కూడా కరువౌతోంది. పేరున్న కాలేజీ, కార్పోరేట్‌ కాలేజీల పేరుతో సాగుతున్న దందాలను తల్లిదండ్రులే పెంచి పోషిస్తున్నారు. కాలేజీలు ఇష్టాను సారం నిర్ణయించిన లక్షలకు లక్షలు ఫీజులు చెల్లించి, ఆ కాలేజీలలో చదవించడం కూడా స్టేటస్‌ సింబల్‌ అన్నట్లుగా మారిపోతున్నారు. ఉన్నత విద్య చదువుతున్న పిల్లల తల్లిదండ్రులు మా పిల్లలు మల్లారెడ్డి కాలేజీలో చదువుతున్నారంటూ గొప్పలు చెప్పుకోవడం అలవాటు చేసుకున్నారు. కాని అందులో చదివినంత మాత్రానే ఉద్యోగాలొస్తాయని, ఉజ్వలమైన భవిష్యత్తు వుంటుందన్న అపోహలు పెంచుకుంటున్నారు. గొర్రెల్లా ఒకరిని చూసి ఒకరు తమ పిల్లలను ఆ కాలేజీలలో చేర్పిస్తున్నారు. అందుకే చామకూర మల్లారెడ్డి కాలేజీల మీద కాలేజీలు ఏర్పాటు చేస్తున్నాడు. తమ పిల్లల చదవు పేరుతో మల్లారెడ్డి కాలేజీల లాంటి నరకకూపంలోకి పంపిస్తున్నామని తెలుసుకోవడం లేదు. ఆ కాలేజీలో చదివితే ర్యాంకులోస్తాయని, మంచి ఉద్యోగాలొస్తాయన్న భ్రమల్లో తల్లిదండ్రులు వుంటున్నారు. అందులో చదివినా, ఎందులో చదవినా మార్కులను చూసి ఉద్యోగాలు ఇవ్వరు. విద్యార్ధుల నాలెజ్డ్‌, స్కిల్స్‌తోనే ఉద్యోగాలు వస్తాయి. అంతే తప్ప మల్లారెడ్డి కాలేజీలో చదినంత మాత్రాగా ఉద్యోగాలు ఇచ్చే కంపనీలు గుడ్డిగా సెలెక్ట్‌ చేయరు. లక్షలకు లక్షలు జీతాలు ఇవ్వరు. ఎవరో ఒకరికి మంచి మంచి ప్యాకేజీలు వచ్చాయని, ఆ కాలేజీలో చదితేనే వెంటనే ఉద్యోగాలు వస్తాయన్న ప్రచారాన్ని తల్లిదండ్రులు నమ్మడం ఒక వ్యసనంగా మార్చుకున్నారు. పేరున్న విద్యా సంస్ధలంటూ లక్షలకు లక్షలు పోసి తమ పిల్లలను అందులో చేర్చుతున్నారు.

మంచి భవిష్యత్తు కోసమంటూ తమ పిల్లలను అలాంటి కాలేజీల్లో చేర్పిస్తే ఎంతో మంది అమ్మాయిల జీవితాలు ఆగమౌతున్నాయి. అవి మాత్రం ఏ తల్లిదండ్రులకు కనిపించవు. తమ పిల్లలు మాత్రమే మంచి వాళ్లు. ఇతరుల పిల్లలు చెడ్డవారన్న అభిప్రాయం కూడా ప్రతి తల్లిదండ్రులలోనూ నాటుకుపోతోంది. తమదాకా వస్తే గాని గుండెలు పగిలే నిజాలు వినపడవు. మల్లారెడ్డి కాలేజీలో ఇంతటి దారుణం జరిగిందని తెలిసినా తల్లిదండ్రులు ఎందుకు మౌనంగా వుంటున్నారు? కాలేజీలో ఆందోళన చేస్తున్న వారికి ఎందుకు సంఫీుభావం ప్రకటించడం లేదు. తమ పిల్ల ల జీవితాలను ఎలా ఆగం చేస్తారని నిలదీసేందుకు ఎవరూ వెళ్లడం లేదు. ఇది తల్లిదండ్రుల నిర్లక్ష్యం కాదా? చేతగాని తనం కాదా? చేష్టలుడిగి చూసే తనం కాదా? విద్యార్థులతోపాటు, వివిధ పార్టీల విద్యార్ధి నాయకులు మల్లారెడ్డి కాలేజీ ముందు ఆందోళనలు చేస్తుంటే , తల్లిదండ్రులు ఎందుకు మేలుకోవడం లేదు. తమ పిల్లలు గొప్ప చదువులు చదవాలన్న ఆరాటం వుంటే సరిపోదు. లక్షలు పోసి పిల్లలను చదవిస్తున్నాం..ఫీజులు చెల్లిస్తున్నామని గొప్పలుచెప్పుకుంటే గెలిచినట్లు కాదు. పిల్లల జీవితాలను ఆగం చేస్తున్నవారిని ప్రశ్నించడంలో తల్లిదండ్రులు చొరవ చూపించకపోవడం కూడా తప్పే. అన్యాయం జరిగిన అమ్మాయిల తల్లిదండ్రులకు సంఫీుభావంగా మిగతా పిల్లల తల్లిదండ్రులు కలిసి వచ్చిన సందర్భాలే కనిపించవు. అందుకే కాలేజీల యాజమాన్యాలు చెలరేగిపోతున్నాయి. తప్పులు చేసిన ఎవరూ పట్టించుకోరనుకుంటున్నాయి. తప్పుల మీద తప్పులు జరుగుతున్నా పట్టింపు లేని తనాన్ని ప్రదర్శిస్తున్నాయి.

జిసిసి హమాలీ కార్మికుల మెరుపు సమ్మె

* భద్రాచలం ఒప్పందం ప్రకారం పెరిగిన రేట్లు అమలు చేయాలి*
భద్రాచలం నేటి ధాత్రి

సమ్మెను ప్రారంభించిన సిఐటియు పట్టణ ఇన్చార్జి నాయకులు గడ్డం స్వామి*
అక్టోబర్ 2024 లో జరిగిన జిసిసి సివిల్ సప్లై రేట్ల ఒప్పందాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ తలపెట్టిన సమ్మెను సిఐటియు పట్టణ ఇంచార్జ్ నాయకులు గడ్డం స్వామి ప్రారంభించారు. ఈ సందర్భంగా సిఐటియు పట్టణ నాయకులు నకిరికంటి నాగరాజు అధ్యక్షతన జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సివిల్ సప్లై మరియు జీ సి సి హమాలీ కార్మికుల ఎగుమతి దిగుమతి రేట్ల విషయమై గత మూడు నెలల క్రితం 20 24 అక్టోబర్ 3 న అన్ని కార్మిక సంఘాల సమక్షంలో సివిల్ సప్లై కమిషనర్ మరియు అధికారులు చర్చలు జరిపి పాత రేట్ల కంటే అదనంగా మూడు రూపాయలు దిగుమతి, ఎగుమతి రేట్లు పెంచడం జరిగిందని, పెంచిన రేట్లను 20 24 జనవరి నుండి అమలు చేస్తామని ఏరియల్స్ తో కలిపి చెల్లిస్తామని సివిల్ సప్లై అధికారులు హామీ ఇచ్చారు. కానీ నేటికి ఒప్పందం అమలు కాకపోవడంతో తప్పని పరిస్థితుల్లో సమ్మె చేయవలసిన పరిస్థితి వచ్చిందని ఆయన అన్నారు. ఒప్పందం జరిగి మూడు నెలలు కావస్తున్న నేటికీ పెరిగిన రేట్లకు సంబంధించిన జీవోను అధికారులు విడుదల చేయకపోవడం దారుణమని అన్నారు. గతంలో అనేక సందర్భాల్లో ఒప్పందాలు జరిగిన వెంటనే జీవో విడుదల చేసే వారని, కానీ ఒప్పందం జరిగి మూడు నెలల గడుస్తున్న జీవో విడుదల చేయకపోవడం సరైనది కాదని అన్నారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం హమాలీల రేట్ల పెంపు జీవోను విడుదల చేసి 20 24 జనవరి నుండి ఏరియర్స్ కు బడ్జెట్ కేటాయించాలని, ప్రభుత్వం స్పందించకుంటే సమ్మె ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు పట్టణ నాయకులు ఎస్ అజయ్ కుమార్ ,ఆర్ రాములు, పాల్గొనగా ఈరోజు సమ్మెలో జిసిసి హమాలీలు సుబ్రహ్మణ్యం, ప్రసాదు, శేషు, లోకేష్, రామారావు, ముత్తయ్య తదితరులు పాల్గొన్నారు.

భారత కమ్యూనిస్టు పార్టీ కామ్రేడ్ ఏ బి బర్ధన్ తొమ్మిదవ వర్ధంతి.

బెల్లంపల్లి నేటిధాత్రి :

బెల్లంపల్లి నియోజకవర్గం భారత కమ్యూనిస్టు పార్టీ బెల్లంపల్లి కార్యాలయం కామ్రేడ్ ఏ బి బర్ధన్ తొమ్మిదవ వర్ధంతిని జరిపినాము. ఈ సందర్భంగా పట్టణ కార్యదర్శి రాజమౌళి సీనియర్ నాయకులు కామ్రేడ్ చిప్ప నరసయ్య మాట్లాడుతూ అమరజీవి కామ్రేడ్ ఏ బి బర్ధన్ 1924 సెప్టెంబర్ 25న బెంగాల్ రెసిడెన్సి చెందిన బరిసాల్ ప్రస్తుత బంగ్లాదేశ్ లో జన్మించినారు.ఆయన 15 వ వయసులో సిపిఐ సిద్ధాంతాలకు ఆకర్షితులై ఆయన నాగపూర్ లో యూనివర్సిటీలో స్టూడెంట్స్ ఫెడరేషన్ లో చేరి యూనివర్సిటీకి ప్రెసిడెంట్గా పని చేస్తూ పార్టీ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొంటూ 1957లో నాగపూర్ అసెంబ్లీ స్థానానికి పోటీ చేసిగెలిచినారు.ఆయన ఏ ఐ టి యు సి యూనియన్ ద్వారా అనేక ఉద్యమాలు చేసినారు అనేక అరెస్టయినారు. నాలుగేళ్లకు పైబడి జైలు జీవితం గడిపినారు ఏ ఐ టి యు సి కి అధ్యక్షుడిగా పని చేసినారు.పార్టీ పిలుపు మేరకు కేంద్రంలో 1990లో పార్టీ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొంటూ 1996 లో అప్పటివరకు జాతీయ కార్యదర్శిగా ఉన్న ఇంద్రజిత్ గుప్త హోం మినిస్టర్ గా బాధ్యతలు చేపట్టినప్పుడు భారత కమ్యూనిస్టు పార్టీ జాతీయ కార్యదర్శిగా ఎన్నికైనారు నాలుగు పర్యాయాలు 16 సంవత్సరములు పార్టీ కార్యదర్శి గా పని చేసినారు పార్టీకి పలు సూచనలు ఇస్తూ చనిపోయే వరకు పని చేసినారు.పార్టీ కార్యకర్తలు కామ్రేడ్ బర్దన్ గారి అంకుటిత దీక్ష వారు చేసిన సేవలను పునికి పుచ్చుకొని పార్టీ విస్తరించడానికి ఉపయోగపడాలని కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం పీడిత ప్రజల సమస్యలు పట్టించుకోకుండా రైతు ఉద్యమాలను అణచివేస్తూ కార్మిక చట్టాలను మారుస్తూ ప్రజా వ్యతిరేక పాలన కొనసాగిస్తుంది.దీనికి వ్యతిరేకంగా పార్టీ ఉద్యమాలను చేయాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి కామ్రేడ్ బొంతల లక్ష్మీనారాయణ బి కే ఎన్ యు జిల్లా కార్యదర్శి కామ్రేడ్ గుండా చంద్రమాణిక్యం జిల్లా సమితి సభ్యులు కామ్రేడ్ మేకల రాజేశం పట్టణ సహాయ కార్యదర్శి కామ్రేడ్ కొంకుల రాజేష్ పట్టణ కార్యవర్గ సభ్యులు కామ్రేడ్ రత్నం రాజo బొంకూర్ రామచందర్ పార్టీ నాయకులు స్వామి దాస్ ఇనుముల రాజమల్లు రాధాకృష్ణ పాల్గొన్నారు.

వరంగల్ ఎంపీ చేతుల మీదుగా టి.ఎస్.యు.టి.ఎఫ్ నూతన సంవత్సర 2025 క్యాలెండర్ ఆవిష్కరణ

నేటిధాత్రి, వరంగల్

తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టి.ఎస్.యు.టి.ఎఫ్) వరంగల్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో వరంగల్ పార్లమెంటు సభ్యురాలు కడియం కావ్య ను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం టి.ఎస్.యు.టి.ఎఫ్ నూతన సంవత్సర (2025) క్యాలెండర్ ను వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు కడియం కావ్యచే ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు తాటికాయల కుమార్, సుజన్ ప్రసాద్, ఉపాధ్యక్షులు మేకిరి దామోదర్, కోశాధికారి, రవూఫ్, కార్యదర్శులు బి.వెంకటేశ్వరరావు, పాక శ్రీనివాస్, నామోజు శ్రీనివాస్, కె. రమేష్, గుండు కరుణాకర్, మండల బాధ్యులు టివి సత్యనారాయణ, వి.నర్సింహరావు, డి. రవీందర్ తదితరులు పాల్గొన్నారు.

సిపిఎం పార్టీ జిల్లా స్థాయి రాజకీయ శిక్షణ తరగతులు

రైతు సంఘం జాతీయ ఉపాధ్యక్షులు
సారంపల్లి మల్లారెడ్డి

భూపాలపల్లి నేటిధాత్రి

సిపిఎం పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సుందరయ్య విజ్ఞాన కేంద్రంలోని దొడ్డి కొమురయ్య హాలులో 2 నుంచి 6వ తేదీ వరకు జరిగే జిల్లా స్థాయి రాజకీయ శిక్షణ తరగతులను ప్రారంభించడం జరిగింది. దీనికి ముఖ్యఅతిథిగా హాజరైనటువంటి సారంపల్లి మల్లారెడ్డి, వెంకటేష్ హాజరయ్యారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా రష్యా ఉక్రెయిన్ ఇజ్రాయిల్ పాలెస్తిన పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధ వాతావరణం ప్రపంచ అశాంతికి ఆర్థిక వ్యవస్థ తిరోగమనానికి కారణం అవుతుందని ఇది ప్రపంచంలోనే అశాంతి నెలకొల్పే విధంగా ప్రజల్ని దుఃఖాన్ని కలిగిస్తూ అంతుచిక్కని స్థాయిలో మరణాలను చూపిస్తూ విషాదాన్ని నింపుతుందని ఇది దేశాలపై ఆర్థిక పరమైనటువంటి భారాన్ని చూపిస్తుందని అంతేకాకుండా ప్రపంచ అశాంతిని ఐక్యతను దెబ్బతీసే విధంగా యుద్ధాలు కారణమవుతున్నాయని అందుకే సిపిఎం పార్టీ ప్రపంచ శాంతిని కోరుకుంటుందని ప్రజల్లో ఐక్యత సమైక్యతలను నెలకొల్పుతూ మానవ ప్రాణాలను కాపాడుకుంటూ దేశాల ఆర్థిక పురోగతిని పెంపొందించే విధంగా ప్రపంచ దేశాల మధ్య ఎగుమతులు దిగుమతులు కానుంచి మానవ సమైక్యతను కోరుకునే విధంగా ప్రపంచం లో శాంతి వర్ధిల్లాలని సిపిఎం కోరుతుందని ఆ స్థాయిలోనే కమ్యూనిస్టు పార్టీలు వాటి పాత్రను కొనసాగిస్తున్నాయని ఆయన అన్నారు
అదేవిధంగా దేశంలో మోడీ విధానాల వల్ల దేశం నష్టపోతుందని ఆర్థిక వ్యవస్థ రోజురోజుకీ క్షీనిస్తుందని రూపాయి విలువ ఇప్పటికే 85% తగ్గిందని దేశంలో 16% నిరుద్యోగం పెరిగిందని ఈ దేశంలో మోడీ వచ్చిన తర్వాత జీఎస్టీ నోట్ల రద్దు ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకాలు దేశంలో ప్రోత్సహిస్తున్నారు
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే ఇచ్చిన హామీలను నెరవేర్చాలని విద్యా విధానంలో మార్పులు తీసుకొచ్చి 96% విద్యాభివృద్ధికి పాటుపడాలని 8 శాతం ఉన్న నిరుద్యోగాన్ని రూపుమాపే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.
ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి బందు సాయిలు జిల్లా కార్యదర్శి సభ్యులు చెన్నూరి రమేష్ గుర్రం దేవేందర్ జిల్లా కమిటీ సభ్యులు సంఘం ప్రీతి ఆత్కూరి శ్రీకాంత్ గడప శేఖర్ ఆకుదారి రమేష్ లతోపాటు 50 మంది ప్రతినిధులు పాల్గొన్నారు.

సిఎం రేవంత్ రెడ్డి కి “నూతన సంవత్సర శుభాకాంక్షలు” తెలిపిన ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య

నేటిధాత్రి, వరంగల్

హైదారాబాద్ లోని సిఎం క్యాంప్ కార్యాలయంలో, నూతన సంవత్సర సంధర్భంగా సిఎం రేవంత్ రెడ్డి ని మర్యాద పూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసిన మాజీ మంత్రి, ఎమ్మేల్సీ బస్వరాజు సారయ్య, ఖమ్మం నియోజకవర్గ పార్లమెంట్ సభ్యులు రామసహాయం రఘురామ్ రెడ్డి

పి.ఆర్.టి.యూ టిఎస్ 2025 క్యాలెండర్ ఆవిష్కరణ

నేటిధాత్రి, కొండూరు, వరంగల్

జిల్లా పరిషత్ హైస్కూల్ కొండూరు ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలు కె పద్మలత చే 2025 నూతన సంవత్సరం పి.ఆర్.టి.యూ టిఎస్ క్యాలెండర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా అసోసియేట్ అధ్యక్షులు కటకం రఘు, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు గంకిడి కరుణాకర్ రెడ్డి, రాయపర్తి మండలం అసోసియేట్ అధ్యక్షులు నేతుల స్వామి, పాఠశాల ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

సైబర్ క్రైమ్ పై విద్యార్థులకు అవగాహన సదస్సు.

చిట్యాల, నేటి ధాత్రి :

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రం లోని మోడల్ స్కూల్ లో గురువారం రోజున విద్యార్థులకు సైబర్ నేరాలపై చిట్యాల జి శ్రావణ్ కుమార్ ఆదేశాల మేరకు హెడ్ కానిస్టేబుల్ రామకృష్ణ, కానిస్టేబుల్స్ లాల్ సింగ్, లింగన్న, సందీప్, నాగరాజు లు సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించి నారు,
చిట్యాల సైబర్ వారియర్ లాల్ సింగ్ మాట్లాడుతూ సైబర్ క్రైమ్ గణనీయంగా పెరిగిందని,వాటిలో ముఖ్యంగా:1.ఫిషింగ్,
2. రాన్సోమ్ వేర్ 3. గుర్తింపు దొంగతనం,4. ఆన్‌లైన్ వేధింపులు,5. సైబర్‌స్టాకింగ్,6. క్రెడిట్ 7. హ్యాకింగ్8. మాల్వేర్*,9. సోషల్ ఇంజనీరింగ్*10. ఆన్‌లైన్ మోసాలు*11. సైబర్ గూఢచర్యం,12. *డిస్ట్రిబ్యూటెడ్ డినియల్ ఆఫ్ సర్వీస్,13. *క్రిప్టోజాకింగ్,
14. ఆన్‌లైన్ పిల్లల దోపిడీ,
15. మేధో సంపత్తి,
ఈ రకమైన సైబర్ నేరాల గురించి తెలుసుకొని మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి బలమైన పాస్‌వర్డ్‌లను ఉపయోగించడం, సాఫ్ట్‌వేర్‌ను తాజాగా ఉంచడం మరియు లింక్‌లపై క్లిక్ చేసేటప్పుడు లేదా ఆన్‌లైన్‌లో వ్యక్తిగత సమాచారాన్ని అందించేటప్పుడు జాగ్రత్తగా ఉండటం వంటి చర్యలు తీసుకోవడం చాలా అవసరం అని వివరించి
సైబర్ క్రైమ్ కి గురాయ్ డబ్బులు పోగొట్టుకుంటే వెంటనే 1930 సైబర్ హెల్ప్ నెంబర్ కి కాల్ చేయాలని, పోగొట్టు కున్న ఒక గంట లోపే చేయడం ద్వారా డబ్బులు హోల్డ్ చేయడానికి అవకాశం ఉంటుందని, దానిని గోల్డెన్ హవర్ అంటరాని చెప్పారు.
కార్యక్రమం లో మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ రమేష్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version