నవరాత్రి ఉత్సవాలకు పటిష్ట భద్రత ఏర్పాటు చేయాలి
జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ
భూపాలపల్లి నేటిధాత్రి
వినాయక చవితి వేడుకల సందర్భంగా విగ్రహాల ప్రతిష్ఠాపన నుండి నవరాత్రుల అనంతరం నిమజ్జనాల వరకు ఎటువంటి అంతరాయం కలగకుండా పటిష్ఠమైన భద్రతా చర్యలు చేపట్టాలని
జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ
అధికారులను ఆదేశించారు.
ఈ నెల 27వ తేదీ వినాయక చవితి పండుగను పురస్కరించుకుని విగ్రహాలు ఏర్పాటు, నిమజ్జన కార్యక్రమాలపై ఐడిఓసి కార్యాలయంలో
రెవెన్యూ, పోలీస్, పంచాయతీ రాజ్, ఆర్ అండ్ బి, వైద్య, దేవాదాయ, అగ్నిమాపక, విద్యుత్, ఎక్సైజ్ తదితర శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రతి విభాగం సమన్వయంతో పనిచేసి పండుగ వేడుకలు ఎటువంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించడానికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు. మండపాలకు విద్యుత్తు సరఫరాకు, మైకు ఏర్పాట్లుకు తప్పనిసరి అనుమతి తీసుకోవాలని సూచించారు. లూజు విద్యుత్తు వైర్లు వాడరాదని, ఎంసిబి వేయాలని, వేలాడే విద్యుత్తు తీగల నుండి వైర్లు ఏర్పాటు ద్వారా ప్రమాదం వాటిల్లే అవకాశం ఉందని తెలిపారు. మండపాల వద్ద వ్యర్థాలు వేసేందుకు అనువుగా డస్ట్ బిన్స్ ఏర్పాటు చేయాలని తెలిపారు. విద్యుత్తు తీగల క్రింద విగ్రహాలు ఏర్పాటు వల్ల విద్యుత్తు ప్రమాదం వాటిల్లే అవకాశం ఉందని జాగ్రత్తలు పాటించాలని స్పష్టం చేశారు. శాంతియుత వాతావరణంలో గణేష్ విగ్రహాలు ఏర్పాటు, నిమజ్జన ఉత్సవాలు జరగాలని అన్నారు. నిమజ్జన రోజున అత్యవసర వైద్య కేంద్రాలు ఏర్పాటుతో. పాటు మహాదేవపూర్, జిల్లా ప్రధాన ఆసుపత్రిలో వైద్యులు, సిబ్బంది అందుబా ఉండాలని తెలిపారు. అత్యవసర సేవలకు అంబులెన్స్ సేవలు వినియోగించడానికి సిద్ధంగా ఉంచాలన్నారు. ముఖ్యంగా కాళేశ్వరం వద్ద విగ్రహాలు నిమజ్జనం జరుగుతుందని తెలిపారు. అన్ని మండలాలలో నిమజ్జనానికి నీటి వనరులను గుర్తించాలని, నిమజ్జనం చేయడానికి అనుమతి ఉన్న ప్రదేశంలో నిమజ్జనం చేయాలని తెలిపారు. గణేష్ శోభా యాత్ర సందర్భంగా క్రమ సంఖ్యలో వెళ్ళడానికి అనువుగా నంబర్లు కేటాయించాలన్నారు. మండపాల ఏర్పాటును పోలీస్ రిజిస్టర్ చేసుకోవాలని తెలిపారు.
ఉత్సవాల నిర్వహణకు జిల్లా యంత్రాంగం తరపున పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. శోభాయాత్ర సందర్భంగా రహదారుల పై గుంతలకు మరమ్మతులు చేపట్టాలని తెలిపారు.
జిల్లాలో గతంలో కూడా సహృద్భావ వాతావరణంలో ఈ వేడుకలు జరుగాయని, ఈ దఫా అదే స్ఫూర్తితో మత సామరస్యంతో గణేష్ ఉత్సవాలు జరుపుకోవాలని ఆయన సూచించారు.
నిమజ్జన ప్రాంతాల్లో విద్యుత్తు, క్రేన్లు, మంచినీరు ఏర్పాటు చేయాలని, పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలని తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వేడుకల నిర్వహణ సజావుగా జరిగేలా అధికారులు పర్యవేక్షణ చేయాలని స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, డిపిఓ శ్రీలత, అగ్నిమాపక అధికారి శ్రీనివాస్, ఆర్డిఓ రవి, అన్ని శాఖల అధికారు లు తదితరులు పాల్గొన్నారు.