తెలంగాణ బిజేపికి!

ఆంద్ర జనసేనకు!!

`బిజేపి, జనసేన రహస్య ఒప్పందం?

`అన్నతో తెలంగాణలో ఆట!

`తమ్ముడుతో ఆంద్రాలో వేట!!

`బిజేపి వెనకుండి రాజకీయం?

`ఇదే అదునుగా మళ్ళీ ఒకసారి చిరు ప్రయత్నం!

`మరోసారి రాజకీయ భవిష్యత్తు కోసం ఆరాటం.

`అటు సినిమాలు..ఇటు రాజకీయాలు.

`ప్రజా రాజ్యానికి కొనసాగింపే జనసేన అన్నారు.

`కాంగ్రెస్‌ కు ఇంత కాలం ఎందుకు రాజీనామా చేయలేదు?

`ప్రజా రాజ్యం ఏర్పాటు తర్వాత ఇక సినిమాలు చేయను అన్నారు!

`జెండా పీకేసిన తర్వాత ఇక సినిమానే నా ప్రపంచం అన్నారు.

`ఇక రాజకీయాల జోలికి వెళ్లే ప్రసక్తే లేదని ప్రకటించారు.

`మళ్ళీ ఆశలు చిగురించినట్లున్నాయి.

`ప్రజా రాజ్యం కలలింకా కదులుతున్నట్లే వున్నాయి.

`జనసేన తో మళ్ళీ తన ప్రయాణం మొదలుపెట్టనున్నారు.

`దక్షణాదిన బిజేపికి వెన్నుదన్నుగా నిలువనున్నారు.

పార్లమెంటు చరిత్రలో 1985 తర్వాత పూర్తి స్దాయి మెజార్టీతో 2014, 2019 ఎన్నికల్లో రెండుసార్లు వరుసగా, మూడోసారి కూడా దాదాపు పూర్తి మెజార్టీకి దగ్గరగా గెలిచిన భారతీయ జనతాపార్టీకి దక్షిణాదిలో బలపడేందుకు ఏదో ఒక ప్రాంతీయ పార్టీ తోడు కావాలా? ఆ పార్టీ దక్షిణాదిలో ఒంటరిగా బలపడే అవకాశమే లేదా? గతంలో సంగతి వదిలేద్దాం..ఇప్పుడు కూడా ఏదో ఒక పార్టీ తోడుగా నిలిస్తే తప్ప ఉనికిని చాటుకోలేదా? ఇలా అయితే ఇంకా ఎంత కాలానికి బిజేపి దేశమంతా విస్తరించగలదు? అనే ప్రశ్నకు సమాదానం ఎవరి వద్దా లేదు. దక్షిణాదిన బిజేపి ఇప్పటికీ ఎందుకు బలపడడం లేదన్నదానిపై నిజానికి ఇప్పటి వరకు ఆ పార్టీలో పూర్తి స్ధాయి అధ్యయనం జరగలేదన్నది ముమ్మాటికీ వాస్తవం. పైగా ఆ పార్టీ పూర్తి స్ధాయిలో ఉత్తరాదినే ఎక్కువగా దృష్టిపెట్టిందనే చెప్పాలి. కనీసం ఈ పదేళ్లలో దక్షిణాది అభివృద్దిపై కేంద్ర ప్రభుత్వం మరింత దృష్టిపెడితే బాగుండేది. ఎంత సేపు ఉత్తరాది రాష్ట్రాలు, ఈశాన్య రాష్ట్రాలలో ఎలా బలపడాలన్నదానిపైనే బిజేపి దృష్టిపెడుతూ వచ్చింది. అందుకే దక్షిణాదిన కొంత వెనుకబాటులోవుంది. కాకపోతే ఉత్తరాధి రాజకీయ పరిస్దితులు వేరు. దక్షిణాది రాజకీయాలు వేరు. ఎవరు ఔనన్నా, ఎవరు కాదన్నా దక్షిణాది ప్రజలు ఎంతో చైతన్య వంతులు. ప్రతి అంశాన్ని శ్రాస్త్రోత్తరంగా కాకుండా శాస్త్రీయంగా ఆలోచిస్తారని చెప్పడంలో కూడా సందేహం లేదు. అందుకే బిజేపి లాంటి పార్టీలకు దక్షిణాదిలో చోటు పూర్తి స్ధాయిలో దక్కకుండా పోయింది. ఇప్పుడిప్పుడే దిక్షిణాదిలో కూడా బిజేపికి అనుకూలమైన పరిస్ధితులు ఏర్పడుతున్నాయి. వాటిని ఆసరాగా చేసుకొని బిజేపి ఎదగాలనుకుంటోంది. అయితే జనసేన లాంటి పార్టీని నమ్ముకొని బిజేపి ఎదగడం అన్నది అంత ఈజీ కాదు. ప్రధానంగా ప్రాంతీయ పార్టీలు తన మనుగడ కోసం ఆలోచిస్తాయే గాని, జాతీయ పార్టీల ఎదుగుదలను ఎక్కడా అంగీకరించిన దాఖలాలు లేవు. ఒక్కసారి జాతీయ పార్టీ పాగా వేస్తే ప్రాంతీయ పార్టీలకు చోటు లేకుండా చేస్తాయన్నది అందరూ అంగీకరించాల్సిన అంశం. కాని ప్రాంతీయ పార్టీలు కూడా ఇటీవల కాలంలో స్వంత బలాన్ని నమ్ముకొని రాజకీయం చేయడం లేదు. ఉభయ కుశలోపరిగా జాతీయ పార్టీలతో కలిసి పోటీ చేస్తున్నాయి. గతంలో ప్రాంతీయపార్టీలు కలిసి రాజకీయం చేసేవి. కాని ఇప్పుడు ప్రాంతీయపార్టీలలో ఏకచ్చత్రాధిపత్యం ఎక్కువైంది. అసలు మరో ప్రాంతీయపార్టీ పుట్టుకనే అంగీకరించలేకపోతున్నాయి. ఇలాంటి సమయంలో ప్రాంతీయ పార్టీలకు, జాతీయపార్టీలకు మధ్య సయోధ్య ఎక్కువైంది. అంత మాత్రాన జాతీయ పార్టీలను పూర్తిగా పాగా వేసేందుకు ఏ ప్రాంతీయ పార్టీ కూడా ఇష్టపడదు. అందులోనూ జనసేన లాంటి పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్‌ను నమ్ముకొని బిజేపి రాజకీయం చేయాలనుకోవడం కూడా అంత కరక్టు కాదు. కాని అవసరం రెండు పార్టీలకు వుంది. పైగా మరో అవకాశం లేని కారణంగా ఇద్దరూ సర్ధుకుపోతున్నారు. బిజేపికి దక్షిణాది రాష్ట్రాలలో కర్నాటకలో తప్ప, తెలంగాణ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌, కేరళ రాష్ట్రాలలో పార్టీని నడిపించేంత శక్తి వున్న నాయకులు ఎవరూ లేరు. గతంలో కూడా అంత బలమైన నాయకత్వాలు ఇక్కడ ఎదగలేదు. పార్టీ పేరు చెప్పుకొని మాత్రమే రాజకీయం చేస్తే తప్ప మనుగడలో వుంటారు. రాష్ట్రంలో గాని, దేశంలో గాని ఆ పార్టీకి అనుకూల పవనాలు వీస్తే బిజేపి నాయకులు గెలుస్తారు. ఏదొ ఒక ప్రాంతీయ పార్టీతో పొత్తు పెట్టుకుంటే సీట్లు సాధిస్తారు. అంతే తప్ప బిజేపి తలరాత మార్చే నాయకులు దక్షిణాదిలో ఎవరూ లేరు. ముఖ్యంగా తెలంగాణ, ఏపి రాష్ట్రాలలో పార్టీని నడిపించి ఓట్లు పొంది, సీట్లు సాధించి, అధికారంలోకి తీసుకొచ్చేంత శక్తి వంతమైన నాయకులు లేకపోవడం మూలంగానే ఇతర పార్టీలపై ఆధారపడి రాజకీయాలు చేస్తున్నారు. ఏపి కన్నా, తెలంగాణ కొంత బెటర్‌. ఇక్కడ కొంత మంది బలమైన నాయకులు వున్నారు. కాని వాళ్లు కూడా జాతీయ స్ధాయిలో వున్న స్దితిగతుల ఆధారం చేసుకొని గెలిచే నాయకులు మాత్రమే. అందుకే ఏపి, తెలంగాణలలో బిజేపి ఇప్పటి వరకు ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాన్‌ను అక్కున చేర్చుకున్నది. ఇప్పుడు ఆయన అన్నయ్య చిరంజీవిని దగ్గరకు తీసుకుంటోంది. జనసేనను తెలంగాణలో విస్తరింపజేసేలా సహకరిస్తే, తమకు లాభం చేకూరుతుందని బిజేపి బావిస్తోంది. అందుకు బిజేపి, జనసేనల మధ్య రహస్య ఒప్పందం జరిగినట్లు ప్రచారం కూడా జరుగుతుంది. కాని అది సాధ్యమా? అన్నది కూడా బిజేపిలో చర్చ జరగాల్సిన అవసరం వుంది. అయితే తమ్ముడు పవన్‌ కల్యాణ్‌ పార్టీ జనసేన గ్రాఫ్‌ బాగా పెరిగినట్లు సంకేతాలు అందుతున్న వేళ, తాను కూడా మళ్లీ ఒకసారి తన రాజకీయ జీవితంపై జాతకం ఎలా వుంటుందో చూసుకోవాలనుకుంటున్నారు. ఆ విషయం ఈ మధ్య ప్రజారాజ్యం కొనసాగింపే జనసేన అంటూ కీలక వ్యాఖ్య చేశారు. అంటే తాను రాజకీయాలకు దూరంగా లేను అని చెప్పకనే చిరంజీవి చెప్పినట్లైంది. కాని ఆయన గతంలో చేసిన వ్యాఖ్యలను కూడా ప్రజలు పరిగణలోకి తీసుకుంటారు. ఉమ్మడి రాష్ట్రంలో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ ఏర్పాటు చేశారు. 180సీట్లు గెల్చుకుంటున్నామని గొప్పలకు పోయారు. 18 సీట్లతో సరిపెట్టుకున్నారు. అయినా చిరంజీవిలో పోరాట పటిమ వుంటుందని అందరూ అనుకున్నారు. కాని ఆయన కనీసం ఓ ఐదేళ్లపాటు కూడా పార్టీని నడపలేకపోయారు. ఎన్టీఆర్‌ చరిత్రను తిరగరాయాలని కలలు గన్నారు. కాని కుదరలేదు. ఉమ్మడి రాష్ట్రంలో ఆయన సామాజిక తెలంగాణ అంటూ తనకు తెలియని రాగం అందుకున్నారు. అసలు సామాజిక న్యాయం అంటే ఏమిటని ఓ రిపోర్టుర్‌ ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేక నీళ్లు నమిలాడు. అయినా కాలం కలిసిరాలేదు. కాని అవకాశాలను సద్వినియోగం చేసుకున్నాడు. జెండా పీకేశాడు. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌ పార్టీలో విలీనం చేశాడు. ప్రతిగా రాష్ట్ర క్యాబినేట్‌లో తన అనుచరుడైన గంటా శ్రీనివాస్‌రావును మంత్రిని చేశారు. తాను రాజ్యసభ సభ్యత్వం స్వీకరించి, కేంద్రంలో స్వతంత్ర హోదాలో మంత్రి పదవి తీసుకున్నారు. తాను సినిమాలు వదిలి, రాజకీయ ప్రవేశం చేసిన సమయంలో ఇక తన జీవితం ప్రజలకే అంకితం. ఇకపై ముఖానికి రంగు వేసుకునేది లేదని ప్రకటించారు. రాజకీయాలకే తన పూర్తి సమయం కేటాయిస్తానని, సినిమాలను వదిలేస్తున్నట్లు చెప్పారు. అయితే పరిస్ధితులు అనుకూలించలేదు. చిరంజీవి చెప్పిన మాట మీద నిలబడలేదు. రాజకీయాలు అచ్చి రాలేదని మళ్లీ సినిమాలు మొదలు పెట్టారు. కాని అక్కడ కూడా అనుకున్నంత సక్సెస్‌ కనిపించడం లేదు. సినిమాలైతే చేస్తున్నాడే గాని, ఒకప్పటి ఆదరణ ఇప్పుడు ఆయన సినిమాలకు లేదు. గతంలో చిరంజీవి సినిమా ముందు ఏ ఇతర హీరోల సినిమాలు నిలిచేవి కాదు. ఇప్పుడు ఆ హీరోల సినిమా ముందు చిరంజీవి సినిమాలు ఆడడం లేదు. ఇతర హీరోల సినిమా రేంజ్‌ను చిరంజీవి సినిమాలు అందుకోవడం లేదు. అటు రాజకీయం లేక, ఇటు సినిమాల్లో విజయాలు లేక కొంత ఇబ్బంది పడుతున్న మాట వాస్తవం. కాకపోతే ఆయనకు వున్న మెగాస్టార్‌ కుర్చీ మాత్రం అలాగేవుంది. ఇలాంటి సమయంలో పవన్‌ కళ్యాణ్‌ రాజకీయ జీవితం ఒక దారిలో పడిరది. ఆయన సినిమాలతోపాటు, రాజకీయం కూడా సక్సెస్‌ బాటలోనే నడుస్తోంది. ఇప్పుడు అన్నకు తమ్ముడి జనసేన బాటలు వేస్తోంది. మొన్నటి వరకు నువ్యు ఒక పార్టీలో ,నేను ఒక పార్టీలో అంటూ ఒకే ఇంటి మీద రెండు జెండాలు ఎగిరే రాజకీయం చేశారు. కాంగ్రెస్‌ పార్టీ నానాటికీ తీసి కట్టు నాగం బొట్టు అన్నట్లు ప్రయాసపడుతోంది. అందవల్ల కాంగ్రెస్‌లోవుండడం కన్నా, జనసేనలో చేరడం ఉత్తమమని చిరంజీవి బావిస్తున్నారు. పైగా బిజేపి కూడా తోడు కోరుతోంది. ఈ సయోధ్య రెండు పార్టీలకు కలిసి వస్తుందన్న నమ్మకం రెండు పార్టీలలో వుంది. కాని తెలంగాణలో చిరంజీవి వల్ల బిజేపికి ప్రయోజనం కలుగుతుందని మాత్రం చెప్పలేం. ఈ తరానికి చిరంజీవి గురించి తెలిసిన యువతరం తక్కువ. వారికి తెలంగాణలో వున్న బిజేపి నాయకుల కన్నా, చిరంజీవి వారి దృష్టిలో పెద్ద నాయకుడు కాదు. పాలల్లో మజ్జిగ చుక్కలా కలిసి ఘనతంతా నాదే అని చెప్పుకునేందుకు చిరంజీవి ఏ మాత్రం వెనుకాడడు. అయినా చిరంజీవి ఎప్పుడో సమైక్య వాదిగా తనుకుతానుగానే ముద్రవేసుకున్నారు. తెలంగాణను ఆయనే కాదనుకున్నారు. జై తెలంగాణ అనలేదు. తెలంగాణ ఏర్పాటును స్వాగతించలేదు. సమైక్యాంద్ర కోసం రాజీనామా చేసి, తెలంగాణ ప్రజా రాజ్యం నాయకుల ఆత్మగౌరవం దెబ్బ తీశాడు. అలాంటి నాయకుడిని పొరపాటును బిజేపి తెలంగాణ మీద రద్దితే మొదటికే మోసం వస్తుందని చెప్పడంలో సందేహం లేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!