BRS Digital Membership Drive
డిజిటల్ పద్ధతిలో బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు
నర్సంపేట నియోజకవర్గ పరిశీలకులుగా మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి
283 బూత్‌లకు ఇద్దరి చొప్పున ఇన్చార్జిల నియామకం
నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి
నర్సంపేట, నేటిధాత్రి:
తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టనున్నట్లు నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి తెలిపారు.అందులో భాగంగా నర్సంపేట నియోజకవర్గంలో డిజిటల్ ఆన్లైన్ పద్ధతిలో సభ్యత్వ నమోదు కార్యక్రమం త్వరలో చేపట్టనున్నామన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న 283 బూత్‌లకు గాను ప్రతి బూత్‌కు ఇద్దరి చొప్పున ఇన్చార్జిలను నియమించి త్వరలో వారికి శిక్షణ తరగతులు నిర్వహిస్తామని వెల్లడించారు.సభ్యత్వ నమోదు కార్యక్రమ పరిశీలకులుగా మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డిని నియమించినట్లు తెలిపారు. నమోదు కార్యక్రమాన్ని పర్యవేక్షించేందుకు అన్ని మండలాల్లో మండల స్థాయి కోఆర్డినేషన్, సమన్వయ కమిటీలను ఏర్పాటు చేస్తున్నామన్నారు.సభ్యత్వ నమోదులో ప్రతి కార్యకర్త క్రియాశీలకంగా పాల్గొని విజయవంతం చేయాలని పెద్ది సుదర్శన్‌రెడ్డి సూచించారు. నమోదు అనంతరం అన్ని గ్రామాల్లో గ్రామ కమిటీలు, మండల కమిటీలు, జిల్లా కమిటీలను రాష్ట్ర పార్టీ ఏర్పాటు చేయనుందని, నూతన కమిటీల్లో క్రియాశీలకంగా పనిచేసే కార్యకర్తలు, యువతకు పెద్దపీట వేయనున్నట్లు మాజీ ఎమ్మెల్యే బిఆర్ఎస్ రాష్ట్ర నేత పెద్ది సుదర్శన్ రెడ్డి తెలిపారు.
