Mulugu Should Become a Tourism Hub
ములుగు జిల్లాను పర్యాటక హబ్‌గా తీర్చిదిద్దాలి
#వారసత్వ కట్టడాల పరిరక్షణ అందరి బాధ్యత
#పర్యాటక ప్రాంతాలతో ములుగు జిల్లాకు విశిష్ట స్థానం
#చరిత్ర, సంస్కృతి సంప్రదాయాల ప్రాముఖ్యతను ప్రపంచానికి తెలియజేయాలి
#జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు
ములుగు జిల్లా, నేటిధాత్రి:
ములుగు జిల్లాను పూర్తిస్థాయిలో టూరిజం హబ్‌గా తీర్చిదిద్దాలని, వారసత్వ కట్టడాలను పరిరక్షించడం అందరి బాధ్యత అని, పర్యాటక ప్రాంతాలతో ములుగు జిల్లాకు విశిష్ట స్థానం ఉందని, జిల్లా చరిత్ర, సంస్కృతి సంప్రదాయాల ప్రాముఖ్యతను ప్రపంచానికి తెలియజేయాలని జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు పిలుపునిచ్చారు.
99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక “పర్యాటక వారోత్సవాల” వేడుకలలో భాగంగా బుధవారం ములుగు మండలం జాకారం గ్రామంలోని యూత్ ట్రైనింగ్ సెంటర్, నేషనల్ హైవే యు-టర్న్ వద్ద నుంచి గ్రామంలోని చారిత్రక ప్రాధాన్యత కలిగిన కాకతీయుల కాలం నాటి పురాతన శివాలయం వరకు నిర్వహించిన హెరిటేజ్ వాక్‌ను జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు జెండా ఊపి ప్రారంభించారు.
జిల్లా కలెక్టర్ పురాతన శివాలయాన్ని సందర్శించి, ఆలయ చరిత్రను పర్యాటక శాఖ గైడ్‌ను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు మాట్లాడుతూ, ములుగు జిల్లాను పర్యాటక రంగంలో మరింత ప్రగతి పథంలోకి తీసుకెళ్లేందుకు, స్థానిక చారిత్రక సంపదను ప్రపంచానికి పరిచయం చేసేందుకు ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
జిల్లాలో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన రామప్ప దేవాలయంతో పాటు ఇతర అద్భుతమైన పర్యాటక ప్రాంతాలు ఉన్నాయని పేర్కొన్నారు.
జిల్లాలో ప్రసిద్ధి చెందిన బొగత జలపాతం, లక్నవరం సరస్సు, మేడారం సమ్మక్క-సారలమ్మల ఆలయం, తాడ్వాయి హట్స్, ఏటూరునాగారం వైల్డ్‌లైఫ్ శాంక్చురీ, బ్లాక్‌బెర్రీ ఐలాండ్ వంటి వైవిధ్యభరితమైన పర్యాటక ప్రాంతాలతో జిల్లా విరాజిల్లుతోందని కొనియాడారు.
సుమారుగా ఎనిమిది నెలల పాటు పర్యాటక సీజన్ కొనసాగుతుందని,ములుగు జిల్లాకు హైదరాబాద్ నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో పర్యాటకులు వస్తున్నారని తెలిపారు.
కేరళ, రాజస్థాన్ రాష్ట్రాల తరహాలో జిల్లా పర్యాటక రంగాన్ని మరింత పటిష్టంగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. పర్యాటక రంగం అభివృద్ధి చెందడం ద్వారా స్థానిక యువతకు, ప్రజలకు స్టాల్స్, పార్కింగ్, గైడ్ల రూపంలో ఉపాధి అవకాశాలు లభిస్తాయని, జిల్లా ఆర్థిక వ్యవస్థ స్వయంసమృద్ధి సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
జిల్లా పర్యాటక రంగాన్ని మరింత విస్తృతంగా ప్రచారంలోకి తీసుకురావడానికి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల తో ప్రత్యేక పోటీలను కూడా నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ పర్యాటక అభివృద్ధిలో భాగస్వామ్యమవడానికి, జిల్లాను మరింత మెరుగుపరచడానికి ప్రజలు, పర్యాటక ప్రేమికులు తమ విలువైన సలహాలు, సూచనలను అందించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్, స్థానిక సంస్థలు సంపత్ రెడ్డి, జిల్లా పర్యాటక శాఖ అధికారి శివాజీ, పురావస్తు శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ బుజ్జి, ఇరిగేషన్ అధికారి అప్పలనాయుడు, విద్యా శాఖ అధికారి సిద్ధార్థ్ రెడ్డి, బిసిడబ్ల్యుఓ ప్రేమలత, డిపిఓ వెంకయ్య, డిపిఆర్ఓ రఫీక్, తహసీల్దార్ విజయ భాస్కర్, ఎంపిడిఓ రహీమ్, జాకారం సర్పంచ్ దాసరి సమత, టూరిజం శాఖ సిబ్బంది, గైడ్స్, టూరిస్ట్ పోలీసులు తదితరులు పాల్గొన్నారు.
