Summer Diet Tips for Better Health
ఎండాకాలంలో ఆరోగ్యాన్ని కాపాడే ఆహారపు అలవాట్లు
డాక్టర్ రోహిత్ సాదు సూచనలు
పరకాల,నేటిధాత్రి
వేసవి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో శరీరాన్ని చల్లగా ఉంచే ఆహారం తీసుకోవడం అత్యంత అవసరమని డాక్టర్ రోహిత్ సాదు తెలిపారు. అధిక ఉష్ణోగ్రతల కారణంగా డీహైడ్రేషన్,అలసట వంటి సమస్యలు తలెత్తే అవకాశముండటంతో ప్రజలు ఆహార విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు.ఎండాకాలంలో ముఖ్యంగా నీటి శాతం అధికంగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవాలని డాక్టర్ రోహిత్ సాదు తెలిపారు.పుచ్చకాయ,ఖర్బూజ, దోసకాయ వంటి పండ్లు శరీరానికి తేమను అందించడంతో పాటు చల్లదనాన్ని కలిగిస్తాయని చెప్పారు.అలాగే కొబ్బరి నీరు,మజ్జిగ,నిమ్మరసం వంటి సహజ పానీయాలు శరీరానికి తక్షణ శక్తిని అందించడంలో సహాయపడతాయని వివరించారు.భారీగా వేయించిన,మసాలా ఎక్కువగా ఉన్న ఆహారాలను తగ్గించడం అవసరమని ఆయన పేర్కొన్నారు.బదులుగా తేలికపాటి ఆహరం,పప్పు,కూరగాయలతో కూడిన భోజనం తీసుకోవడం మంచిదని సూచించారు.పెరుగు ఆహారంలో చేర్చడం వల్ల శరీరానికి చల్లదనం లభిస్తుందని తెలిపారు.రోజుకు కనీసం 3 నుంచి 4 లీటర్ల వరకు నీరు తాగడం ద్వారా డీహైడ్రేషన్‌ను నివారించవచ్చని డాక్టర్ రోహిత్ సాదు చెప్పారు.తరచూ కొద్దికొద్దిగా నీరు తాగడం శరీరానికి మేలు చేస్తుందని ఆయన స్పష్టం చేశారు.కాఫీ,టీ,కార్బొనేటెడ్ పానీయాల వినియోగాన్ని తగ్గించడం ఆరోగ్యానికి ప్రయోజనకరమని సూచించారు.మొత్తంగా,వేసవిలో సరైన ఆహారపు అలవాట్లు పాటించడం ద్వారా శరీరాన్ని చల్లగా ఉంచడమే కాకుండా అనేక ఆరోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చని డాక్టర్ రోహిత్ సాదు పేర్కొన్నారు.
