Collector Reviews Development Works in Mancherial
అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి
జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
మంచిర్యాల,నేటి ధాత్రి:
జిల్లాలో చేపట్టిన అభివృద్ధి పనులను వేగవంతం చేసి త్వరగా పూర్తి చేసే విధంగా అధికారులు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు.గురువారం జిల్లాలోని మంచిర్యాల పట్టణంలో గల సాయికుంట ప్రాంతంలో చేపట్టిన ప్రభుత్వ నర్సింగ్ కళాశాల నిర్మాణ పనులను పరిశీలించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా సంక్షేమం దిశగా ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులను వేగవంతం చేసి త్వరగా పూర్తి చేసే విధంగా అధికారులు సమన్వయంతో కృషి చేయాలని తెలిపారు.కాలేజ్ రోడ్డులో నిర్మితమవుతున్న ప్రభుత్వ ఆసుపత్రి,క్రిటికల్ కేర్ విభాగాల నిర్మాణ పనులను పరిశీలించారు.ప్రజలకు మరింత వేగవంతమైన,మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం 129.25 కోట్ల రూపాయల వ్యయంతో ప్రభుత్వ ఆసుపత్రి, 23.75 కోట్ల రూపాయల వ్యయంతో క్రిటికల్ కేర్ విభాగాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు.అధికారులు గుత్తేదారుల సమన్వయంతో పనులు వేగవంతం చేసి త్వరగా పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు.అనంతరం మంచిర్యాల పట్టణంలోని రాజస్వ మండల అధికారి కార్యాలయాన్ని సందర్శించి రాజస్వ మండల అధికారి శ్రీనివాస్ రావు తో కలిసి దరఖాస్తుల పరిష్కారం వివరాలను పరిశీలించారు.భారత జాతీయ రహదారుల సంస్థ ఆధ్వర్యంలో జిల్లాలో చేపట్టిన జాతీయ రహదారి 63, 163 జి రహదారుల ఏర్పాటులో భాగంగా జిల్లాలోని ప్రాంతాలకు సంబంధించిన దరఖాస్తుల పరిష్కార చర్యలను వేగవంతం చేయాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
