Demand for 42% BC Reservation Gains Momentum
డీలిమినేషన్ లాగానే..బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం పోరాడండి
-జనగణనలో బీసీ కులగణన జరిగేలా ప్రధాని మోడీపై ఒత్తిడి పెంచాలి
మొగుళ్లపల్లి నేటి దాత్రి
డీలిమిటేషన్ పై ఇండియా కూటమిని ఏకం చేసి పార్లమెంట్ లో ఏ విధంగా పోరాడారో..బీసీ డిమాండ్లపై కూడా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి బీసీ సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని బీసీ సంక్షేమ సంఘం జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు వేముల మహేందర్ గౌడ్ సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. సోమవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానం చేసి కేంద్రానికి పంపించిన 42 శాతం బీసీ రిజర్వేషన్ల పెంపు..ప్రస్తుతం దేశవ్యాప్తంగా జరుగుతున్న జనగణనలో బీసీ కులగణన చేపట్టేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరారు. 2026 జనాభా లెక్కలు పూర్తికాకుండానే..131వ రాజ్యాంగ సవరణ పేరుతో మహిళా రిజర్వేషన్ల అమలు, డీలిమిటేషన్ చేయాలన్న కేంద్ర ప్రభుత్వ ఆలోచనను అడ్డుకోవడం శుభ పరిణామం అన్నారు. ఇదే స్ఫూర్తితో..సామాజిక రిజర్వేషన్లపై విధించిన 50 శాతం పరిమితిని ఎత్తివేసేలా, తెలంగాణలో చేసిన 42 శాతం బీసీ రిజర్వేషన్ల బిల్లును పార్లమెంట్ లో ఆమోదించే విధంగా, దేశవ్యాప్తంగా జరిగే జనగణనలో బీసీ కులాలను లెక్కించే విధంగా కేంద్రంతో పోరాడాలన్నారు. ఈ విషయంలో మొత్తం బీసీ సమాజం కాంగ్రెస్ వెంట నడుస్తుందన్నారు.
