Palm Toddy Demand Surges in Nagaram Village
నాగారంలో పరుపుతాళ్లకు బలే గిరాకి
పరకాల,నేటిధాత్రి
పరకాల మండలపరిధిలోని నాగారం గ్రామంలో పరుపుతాడు కల్లు(తాటికల్లు)కు గణనీయమైన డిమాండ్ నెలకొంది.వేసవి కాలం తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ఈ సహజ పానీయానికి ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది.గ్రామీణ ప్రాంతాలతో పాటు పట్టణ పరిసరాల నుంచి కూడా వినియోగదారులు పెద్ద సంఖ్యలో పరుపుతాళ్ల వైపు మొగ్గుచూపుతున్నారు.ప్రత్యేకించి ఉదయం,సాయంత్రం వేళల్లో పరుపుతాళ్ల వద్ద సందడినెలకొంటోంది.రైతులు,కూలీలు,యువతతో పాటు వృద్ధులు కూడా ఈ పానీయాన్ని ఆస్వాదించేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు.శరీరానికి చల్లదనం అందించడం,అలసటను తగ్గించడం వంటి లక్షణాల వల్ల ఇది వేసవిలో సహజ శీతల పానీయంగా మంచి గుర్తింపు పొందింది.తాటి చెట్ల నుంచి తాజాగా సేకరించే కల్లు ప్రత్యేక రుచి, సహజత్వం కారణంగా వినియోగదారులను ఆకట్టుకుంటోంది.

మార్కెట్లో లభించే ఇతర పానీయాలతో పోలిస్తే ఇది సహజమైనదిగా భావించడంతో డిమాండ్ మరింత పెరుగుతోంది.దీంతో పరుపుతాళ్ల వద్ద విక్రయాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి.ఈ డిమాండ్ పెరుగుదలతో తాటి తాపీలకు మంచి ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. కల్లు సేకరణ,విక్రయాల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక చైతన్యం పెరుగుతోంది. కొన్ని ప్రాంతాల్లో అయితే రోజువారీగా పెద్ద ఎత్తున విక్రయాలు జరుగుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు.మొత్తంగా,పరకాల పరిధిలో పరుపుతాళ్లకు పెరుగుతున్న గిరాకి గ్రామీణ జీవనశైలిలో భాగమైన ఈ సంప్రదాయ పానీయానికి తిరిగి ప్రాధాన్యం తీసుకువస్తూ,స్థానికులకు ఆదాయం అందించే ముఖ్య వనరుగా మారుతోంది.ఈ సందర్బంగా పలువురు మాట్లాడుతు బీర్,బ్రాందీ లకంటే స్వచ్ఛమైన తాటికల్లే ఆరోగ్యకరమని తెలిపారు.
