పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెంపును ఉపసంహరించాలి
మోడీ ప్రభుత్వ విధానాలతో ప్రజలపై పెరిగిన భారం
ఎంసిపిఐ(యు) జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్
నర్సంపేట, నేటిధాత్రి:
కేంద్ర మోడీ ప్రభుత్వ వినాశనకర విధానాలతో ప్రజలపై మోయలేని భారాలు పడుతున్నాయని, పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను తక్షణమే ఉపసంహరించుకోవాలని ఎంసిపిఐ(యు) జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్ డిమాండ్ చేశారు. లేకపోతే ప్రజాగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు.మంగళవారం నర్సంపేట పార్టీ కార్యాలయంలో డివిజన్ కార్యదర్శి మహమ్మద్ రాజా సాహెబ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పొదుపు చర్యలు పాటించాలని చెప్తూనే గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలు పెంచడం సమంజసం కాదన్నారు. నల్లధనం వెలికి తీస్తామని, పేదలకు రూ.15 లక్షలు ఇస్తామని, ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని, ధరలు తగ్గిస్తామని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి ఆచరణలో అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.అమెరికా ట్రంప్ విధానాలకు వత్తాసు పలుకుతూ ప్రపంచ అశాంతికి కారణమవుతున్నారని, ఆదాని, అంబానీ లాంటి కార్పొరేట్ శక్తుల ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇస్తున్నారని ఆరోపించారు. ధరల పెంపుతో నిత్యవసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగి 70 శాతం మంది ప్రజలు కనీస అవసరాలు తీర్చుకోలేని స్థితికి చేరుకుంటారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా పెంచిన ధరలను ఉపసంహరించుకోవాలని, లేకపోతే ప్రజా ఉద్యమాలు తప్పవని హెచ్చరించారు.
పెరిగిన ధరలను నిరసిస్తూ ఎక్కడికక్కడ నిరసనలు తెలియజేయాలని పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కన్నం వెంకన్న, రాష్ట్ర కమిటీ సభ్యులు కుసుంబ బాబూరావు, వంగల రాగసుధ, కొత్తకొండ రాజమౌళి, సింగతి మల్లికార్జున్, కేశెట్టి సదానందం, కలగొట్ల యాదగిరి తదితరులు పాల్గొన్నారు.
