ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో బీఆర్ఎస్ మద్దతు ఎవరికి ?
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఎవరికి మద్దతు ఇస్తుందనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. ఇప్పటికే దేశంలోని దాదాపు అన్ని పార్టీలు ఈ అంశం మీద ఒక నిర్ణయానికి రావడం, తమ మద్దతు ప్రకటించడం జరిగాయి. అయితే,
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఎవరికి మద్దతు ఇస్తుందనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. ఇప్పటికే దేశంలోని దాదాపు అన్ని పార్టీలు ఈ అంశం మీద ఒక నిర్ణయానికి రావడం, తమ మద్దతు ప్రకటించడం జరిగాయి. అయితే, బీఆర్ఎస్ పార్టీ మాత్రం తన స్టాండ్ ఏంటన్నది చెప్పడంలేదు. ఇప్పుడిది తెలంగాణలో చర్చనీయాంశమైంది. ఉప రాష్ట్రపతి అభ్యర్థుల్లో ఎవరికి మద్దతు ఇవ్వాలనే దానిపై బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇటీవల కొన్ని షరతులు పెట్టారు. ఇది రాష్ట్ర రైతుల సమస్యలతో ముడిపడి ఉందన్న కేటీఆర్.. బీఆర్ఎస్ తెలంగాణలో ప్రధాన విపక్ష పార్టీగా ఉన్నప్పటికీ, ఎన్‌డీఏ, ఇండియా కూటమి రెండింటికీ అదే దూరం పాటిస్తోందని చెప్పుకొచ్చారు. ఆగస్టు 20న కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణ రైతులకు 2 లక్ష టన్నుల యూరియా సరఫరా చేస్తామని హామీ ఇచ్చే కూటమికి మాత్రమే తమ మద్దతు ఉంటుందని ప్రకటించిన సంగతి తెలిసిందే.
తెలంగాణ రాష్ట్రంలో యూరియా కొరత తీవ్రంగా ఉందని, ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ‘కృత్రిమంగా’ సృష్టించిన సమస్య అని కేటీఆర్ ఆరోపించారు. సెప్టెంబర్ 9కు ముందు యూరియా రాష్ట్రానికి రావాలి.. మోదీ ప్రభుత్వం ఇస్తే ఎన్‌డీఏ అభ్యర్థికి, రాహుల్ గాంధీ ఇస్తే ఇండియా అభ్యర్థికి తాము మద్దతిస్తామని కూడా కేటీఆర్ చెప్పారు. దీనిపై బీఆర్ఎస్ పార్టీలో చర్చలు జరుగుతున్నాయని, ఈ విషయమై ఇంకా ఎవరూ మాతో సంప్రదించలేదని కేటీఆర్ అన్నారు. తెలంగాణ రైతుల హితమే మాకు ప్రధానమని అదే సమయంలో కేటీఆర్ అంటున్నారు. కాగా, ఇండియా కూటమి అభ్యర్థి సుదర్శన్ రెడ్డి తెలుగు వాసి, మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి కావడంతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ‘తెలుగు గౌరవం’ పేరుతో బీఆర్ఎస్ మద్దతివ్వాలని కోరారు. కానీ, కేటీఆర్ దీన్ని తిరస్కరించి, ‘రేవంత్ రెడ్డి మూడో తరగతి సీఎం. కాంగ్రెస్ మూడో తరగతి పార్టీ అని విమర్శించారు. బీసీల పట్ల కాంగ్రెస్ పార్టీది కపట ప్రేమ అని.. అసలు కాంగ్రెస్ బీసీ అభ్యర్థిని ఎందుకు ఎంపిక చేయలేదని ప్రశ్నించారు.
ఇక, బీఆర్ఎస్ ను ఉపరాష్ట్రపతి ఎన్నిక విషయంలో మద్దతు కోరుతారా అని విలేకర్లు అడిగిన ప్రశ్నకు సీఎం రేవంత్ సూటిగా సమాధానమిచ్చారు. తనను అధిష్టానం ఆదేశిస్తే, తప్పక బీఆర్ఎస్ పార్టీని కోరతానని తేల్చి చెప్పారు. కాగా, బీఆర్ఎస్ పార్టీకి రాజ్యసభలో నలుగురు సభ్యులు ఉన్నారు. ఈ నేపథ్యంలో అసలు బీఆర్ఎస్ పార్టీ ఎవరికైనా మద్దతు ఇస్తుందా.. లేక ఎవరికీ ఇవ్వకుండా మిన్నకుంటుందా అనేది తేలాలి. సెప్టెంబర్ 9న ఉపరాష్ట్రపతి ఎన్నికలు జరుగనున్నాయి.