ఎక్కడున్నావమ్మా తెల్ల బంగార మా….?
◆-: పత్తి రైతుల కష్టాన్ని ఉడ్చేసిన అధిక వర్షాలు…
◆-: తెల్ల బంగారంపై పెట్టుకున్న ఆశలు అడి ఆశలయ్యాయి
◆-: తీవ్ర నిరాశకు గురవుతున్న పత్తి రైతులు
◆-: కనీసం పెట్టుబడి రాని వైనం
◆-: ప్రభుత్వ సహాయం కోసం ఎదురుచూస్తున్న రైతన్నలు
జహీరాబాద్ నేటి ధాత్రి:
ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా జహీరాబాద్ న్యాల్కల్ మోగుడంపల్లి కోహిర్ ఝరాసంగం ఉమ్మడి మండలంలో పెద్ద ఎత్తున పత్తి పంటలు దెబ్బతిన్నాయి వ్యయ ప్రయాసలకు ఓర్చి వేలకు వేలు పెట్టుబడులు పెట్టిన రైతు లకు పంటలు చేతికి వచ్చే దశలో ప్రకృతి వికృత రూపం దాల్చి కాయ కష్టం మొత్తాన్ని ఉడ్చేసింది. దీంతో ఉమ్మడి మండలంలో సుమారు 50 కోట్ల కు పైగా నష్టం వాటిల్లింది ఉమ్మడి మండలంలో ప్రధాన పంటలైన వారి పత్తి
ఈ రెండు పంటలే ప్రధాన పంటలు కావడంతో రైతన్నలు పంట సాగు కోసం వడ్డీ వ్యాపారుల వద్ద అధిక వడ్డీలకు రుణాలు తెచ్చి భూములను కౌలుకు తీసుకొని అందులో పంటలను సాగు చేసినప్పటికీ పంటలు చేతికి వచ్చే సమయంలో ఒక్కసారిగా వరుణుడు తమ ప్రతాపం చూపడంతో చేతికి వచ్చిన పంటలు పూర్తిగా నీటిలో మునిగి పోవడంతో రైతన్నలు కన్నీరు మున్నీరు అవుతున్నారు అటు పంట సాగు కోసం తెచ్చిన అప్పులు ఎలా తీర్చాలో అర్థం కాక రైతులకు కంటినిండా నిద్రలేక రైతులు తీవ్ర అస్తవ్యస్తాల కు గురవుతున్నారు. పత్తి చేలల్లో భారీగా వర్షపు నీరు నిలవడంతో పత్తి పంట రంగు మారిపోయింది అంతేకాకుండా పత్తి చెట్టుకు కాసిన కాయల్లో నుంచి సగం కాయలు పూర్తిగా కుళ్ళి పోయాయి ఉన్న అరకొర కాయలు కూడా తెలుపు రంగులో ఉండే పత్తి నలుపు రంగులోకి మారిపోయింది.
రంగు మారిన పత్తిని కొనేందుకు వ్యాపారస్తులు ముందుకు రావడం లేదు దీంతో రైతన్నలు ఏమి చేయాలో అర్థం కాక పోవడం ఒక ఎత్తు అయితే పంట సాగు కోసం తెచ్చిన అప్పులు రెట్టింపు కావడంతో ఆ అప్పులను ఎలా తీర్చాలో రైతులకు ప్రశ్నార్థకంగా మారింది. కావున ప్రభుత్వం వెంటనే స్పందించి నష్టపోయిన రైతులను గుర్తించి ప్రభుత్వం ద్వారా వారికి ఆర్థిక సాయం అందించి ఆదుకునే అవసరం ఎంతైనా ఉంది లేనియెడల తమకు మరణమే శరణ్యమని పలు గ్రామాల రైతులు కన్నీరు మున్నీరు అవుతున్నారు.
మరోవైపు కాస్తో కూస్తో కొద్దిపాటి వరి పొలం ఉండడంతో ఆ వరి పంట కూడా రేపో మాపో చేతికి వస్తుందనుకున్న సమయంలో అధిక వర్షాల వల్ల అట్టి వరి పంట గింజలు నేలరాలిపోయాయి, మరికొంతమంది వరి పొలాలు పూర్తిగా నీడ మునిగిపోయి, అట్టి నీటిలోనే వరి పంట కుళ్ళిపోయింది దీంతో ఆయా గ్రామాల రైతులు తమ కళ్ళముందే తమ పంటలు ఇలా చెడిపోవడంతో ఏమి చేయాలో అర్థం కాక తమ బాధలను ఎవరికీ చెప్పుకోవాలో తెలియక దిక్కుతోచని స్థితిలో రైతన్నలు పడ్డారు.
ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించి నష్టపోయిన పంటలను గుర్తించి రైతులకు నష్టపరిహారం అందించి ఆదుకోవాలని పలు గ్రామాల రైతులు కోరుతున్నారు లేనియెడల పురుగుల మందులే పాయాసం అనుకోని ఆత్మహత్యలకు పాల్పడడం ఖాయమని పలు గ్రామాల రైతులు అంటున్నారు. ఇప్పటికైనా వ్యవసాయ శాఖ అధికారులు అన్ని గ్రామాల్లో తిరిగి నష్టపోయిన పంటలను గుర్తించి అట్టి రైతులకు నష్టపరిహారం అందించే విధంగా చూడాలని పలు గ్రామాల రైతులు కోరుతున్నారు.