లంచగొండులు…జనం పాలిట రాబందులు!

`రోజుకు కనీసం నలుగురు పట్డుబడుతున్నారు.

`పట్టుబడతామన్న భయమే లేదు.

`పట్టుకుంటే మహా అయితే నాలుగు రోజులు జైలు.

`తర్వాత బెయిలు..పైరవీలు. కేసు క్లోజ్‌.

`రెండేళ్ల దాకా విచారణ పూర్తి కాకపోతే మళ్ళీ అదే కొలువు.

`అలాంటి దానికి పట్టుకోవడం ఎందుకు?

`శిక్ష లేనప్పుడు కేసులెందుకు?

`కొలువు మళ్ళీ ఇచ్చేది వున్నప్పుడు దాడులెందుకు?

`రాబందుల్లా దోచుకుంటున్నారని తెలుసు.

`రెడ్‌ హాండెడ్‌గా పట్టుబడ్డారని తెలుసు.

`అయినా కొలువెందుకు పోదు?

`పట్టు బడిన వెంటనే కొలువు పోయేలా చట్టమెందుకు చేయరు!

`అవినీతి నిరోధక శాఖ కష్టం బూడిదలో పన్నీరౌతోంది.

`అవినీతి ఉద్యోగులను పట్టుకునే వ్యవస్థకే పూర్తి అధికారాలు ఎందుకివ్వరు!

`ఉద్యోగుల సర్వీసు రిమూవల్‌ ఏసిబి చేతిలో ఎందుకు పెట్టరు.

`తప్పు చేసిన తర్వాతే ఏ ఉద్యోగి పట్టుబడతాడు!

`దానికి మళ్ళీ విచారణ ఎందుకు?

`దేశ వ్యాప్తంగా ఇదే జరుగుతోంది!

`కేంద్రం ఎందుకు స్పందించదు?

`రాష్ట్రాలన్నీ తీర్మానాలు చేసి ఎందుకు పంపవు?

`పట్టుబడ్డా కొలువులు..వారికే ప్రమోషన్లు!

`అవినీతి అధికారులకే అందలాలు.

`ఇదీ మన వ్యవస్థ దురవస్థకు ఆనవాలు.

హైదరాబాద్‌,నేటిధాత్రి:
లంచగొండులు… ఆ పదం వినాలంటేనే అసహ్యం అనిపిస్తుంది. అలాంటిది లంచాలను విచ్చలవిడిగా తీసుకుంటున్న ఉద్యోగులకు చీమ కుట్టినట్లు కూడా కావడం లేదా? చీ..చీ అనిపించడం లేదా? జనమంతా ఛీ అని ఉమ్ముతున్నా సిగ్గనిపించడం లేదా? ఎందుకురా ఆ బతుకులు అంటూ జనం శాపాలు పెడుతున్నా లంచాలు మానరా? జనం పాలిట రాబంధులై నిత్యం పీక్కుతింటూనే వుంటారా? ఉద్యోగాలు సంపాదించుకున్నది ప్రజలకు సేవ చేయడానికా? లేక లంచాలు మెక్కడానికా? అసలు ప్రభుత్వ పనుల్లో పర్సెంటీజీలేమిటో? అవి ఎవరు నిర్దారించారో? ప్రజలు ఏ పని కోసం వచ్చినా దానికి ఒక రేటు ఫిక్స్‌ చేయడమేమిటో? ఉద్యోగులు అడిగిందానికి నోరు మూసుకొని ప్రజుల చెల్లించడమేమిటో? వ్యాపారులు, కాంట్రాక్టర్లు లక్షలకు లక్షలు లంచాలు ఇవ్వడమేమిటో? ఇలా లంచాలు తీసుకునే అదికారుల మూలంగా వ్యవస్ధకు జరుగుతున్న నష్టాలు ఎవరు పూడ్చాలి. ఒకప్పుడు నిర్మాణం చేసిన ఎన్నో కట్టడాలు ఇంకా చెక్కు చెదరడం లేదు. కాని ఇటీవల ఏ చిన్న పనిచేసినా బిల్లులు కాంట్రాక్టర్లకు బిల్లులు చేతికొచ్చే దాకా కూడా వుండడం లేదు. ఏ పనుల్లో నాణ్యత వుండడంలేదు. ఇక రెవిన్యూ, రిజిస్ట్రేషన్లు, నీటి పారుదల, వ్యవసాయ శాఖ ఇలా చెప్పుకుంటూ పోతే ఏ శాఖను చూసినా ఏమున్నది గర్వకారణం. అన్ని శాఖలు కంపులోదొర్లుతున్న పందులకన్నా హీనం. రోజుకు కనీసం నలుగురు పట్టుబడుతున్నారు. లంచం తీసుకుంటూ పట్టుబడితే పరవు పోతుందన్న భయం లేదు. పట్టుకుంటే మహా అయితే ఓ నాలుగు రోజులు జైలుకు వెళ్తాం అంతకంటే జరిగేందేమీ వుంది. లంచం తీసుకోవడం దొంగతనంతో సమానం కాదా? చిన్న చిన్న దొంగతనం చేసిన వారిని పోలీస్‌ స్టేషన్‌లో చేసే సన్మానం లంచం తీసుకున్న అదికారులకు కూడా చేసే వ్యవస్ధ తయారైతే తప్ప అవినీతి అంతం కాదు. లంచం తీసుకుంటూ పట్టుబడిన ఉద్యోగికి వెంటనే ఉద్యోగం పోయేంత పరిస్దితి రావాలి. పట్టుబడిన ఉద్యోగులకు జైలులో సాదారణ ఖైదీకి వుండే వెసులుబాటైన జీవితమే వుంటుంది. కొంత కాలం తర్వాత బెయిల్‌ వస్తుంది. బైటకు వచ్చిన తర్వాత పాలకపక్షంలో వున్న పెద్దల ఆశీస్సులు, అవసరమైతే లంచాల ద్వారా సంపాదించిన దానిలో కొంత ముట్టజెప్పితే చాలు. మళ్లీ తన కొలువు తనకు వుస్తుంది. ఆ తర్వాత కేస్‌ క్లోజ్‌ అవుతుంది. తనను అన్యాయంగా ఇరికించారన్న సాక్ష్యాలను సృష్టించి తప్పించుకోవడం పరిపాటిగా మారింది. ఒక వేళ ఇలాంటి వెసులుబాటు కాని పక్షంలో రెండేళ్ల కాలం వరకు కేసు వాయిదాల మీద వాయిదాలు పడుతూనే వుంటుంది. అందుకు ఇతర అధికారుల సహాకారంతో ఆ కేసు రెండేళ్లు దాటిందంటే చాలు..వెంటనే మళ్లీ తిరిగి ఉద్యోగం. అవసరమైతే ప్రమోషన్‌. ఇదే మన ఉద్యోగ వ్యవస్ధలో వున్న వెసులుబాటు. అది ఇప్పుడు అందరికీ అర్ధమైపోయింది. దాంతో ఏ ఉద్యోగి భయపడడం లేదు. భయపడి లంచం తీసుకోకుండా వుంటే ఈ వ్యవస్దలో కోటీశ్వరిడిని కాలేదు. రేపటి తన కుటుంబ తరానికి ఆస్దులు కూడగట్టలేనని తెలుసుకున్నారు. ప్రతి పనికి ఒక రేటు పిక్స్‌ చేసుకుంటున్నారు. అది ఏ పైని అయినా సరే..చిన్నా చితక అన్న ఆలోచన లేదు. సామాన్యులనుంచి కాంట్రాక్టర్లు, వ్యాపారుల నుంచి ఉద్యోగుల నోటి నుంచి వచ్చిన మాటే చివరి మాట. అంతే ముట్ట చెప్పాలి మూట. ఇక రైతులను పీడిరచుకు తినడంలో రెవిన్యూ వ్యవస్ద. భూముల కొనుగోలు, అమ్మకాలు, వారికి కాని భూములు రిజిస్ట్రేషన్‌ చేయడం కోసం అదికారులు తీసుకునే సొమ్ముకు లెక్కేలేదు. నిత్యం కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయి. లంచావతరాలు రోజురోజుకూ పెరుగుతున్నారు. తాజాగా సిరిసిల్లలో నీటి పారుదల శాఖకు చెందిన ఓ ఉద్యోగి లంచం తీసుకొని పట్టుబడ్డారు. కాని ఆయన ముఖంలో ఎలాంటి చీకు,చింత లేదు. భయం అసలేలేదు. పట్టుకుంటే మహా అయితే ఏం చేస్తారు? అన్నట్లు చూపులున్నాయి. ఏసిబి పట్టుకుంటే కనీసం కళ్లలోనైనా ఏదో ఒక సానుభూతి కోసం ఎదురుచూస్తున్నట్లు ముఖ కవళికలు మార్చేవారు వుంటారు. కాని ఈ ఉద్యోగి మాత్రం సోఫాలో దర్జాగా కూర్చొని, చిరునవ్వు చిందిస్తున్నాడు. అంటే లంచం తీసుకునే అదికారుల్లో ఎంతో భరోసా వుంటే తప్ప అలాంటి వ్యవహార శైలి కనిపించదు. పట్టుకున్నారు..అయితే ఏంటి? అని ఏసిబినే ప్రశ్నిస్తున్నట్లు అదికారుల వ్యవహార శైలి వుంటోంది. ఓ వైపు ప్రజలను లంచాల కోసం ఏ ఉద్యోగి అయినా వేదిస్తే వెంటనే ఏసిబిని ఆశ్రయించండి. అంతా గోప్యంగా వుంచుతామని ప్రకటనలు చేస్తున్నారు. ఈ మధ్య ఆ శాఖ పనితీరు కూడా ఎంతో బాగుంది. నిత్యం వారు ఎంతో కష్టపడుతున్నారు. ప్రజల పిర్యాదులకు బాగా స్పందిస్తున్నారు. ఎంత పెద్ద ఉద్యోగి అయినా సరే పట్టుకుంటున్నారు. ఎక్కడా వెనుకంజ వేయడంలేదు. పట్టుకోవడంలో ఎలాంటి శషభిషలు ప్రదర్శించడం లేదు. జాప్యం చూపడం లేదు. పిర్యాదు చేసిన ప్రజల చేత పదే పదే పిర్యాధులు కూడా తీసుకునేంత ఆలస్యం కూడాచేయడం లేదు. వెంటనే స్పందిస్తున్నారు. అదును చూసి పట్టుకుంటున్నారు. ఇంత వరకు బాగానే వుంది. అలా దొరికిన ఉద్యోగులను కోర్టులో ప్రవేశపెడుతున్నారు. చేతులు దులుపుకుంటున్నారు. మరి కేసుల విచారణ సమయంలో పట్టుకున్న అదికారులు సాక్ష్యం సరిగ్గా చెప్పడం లేదా? లేక ఆ పని తమది కాదని వదిలేస్తున్నారా? పోలీసులకు అప్పగించి చేతులు దలుపుకుంటున్నారా? ఎక్కడ లోపం జరుగుతోంది. ఎందుకు అవినీతి ఉద్యోగులు మళ్లీ ఉద్యోగాలు పొందుతున్నారు. నిజానికైతే ఒక్కసారి లంచంతో పట్టుబడి ఉద్యోగి మళ్లీ ఉద్యోగానికి అర్హుడు కాదు. ఏదైనా ఒకటి రెండు సందర్భాలలో ఆ అదికారిని టార్గెట్‌ చేసి ఇరించారన్న వార్తలు కూడా వస్తుంటాయి. అయినా అధికారి లంచం అడక్కుండా..ఇవ్వకుండా వున్నప్పుడు నోట్లను ఆ ఉద్యోగి ముట్టుకునే అవకాశం లేదు. అలాంటప్పుడు టార్గెట్‌ చేయడం అన్నది జరిగే ప్రశ్నే ఉత్పన్నం కాదు. కాని లాలో వున్న లొసుగులను ఆదారం చేసుకొని లంచాలతో సంపాదించిన సొమ్మును విసిరేసి, మళ్లీ ఉద్యోగాలు తెచ్చుకుంటున్నారు. అంతకంతకు మళ్లీ మళ్లీ లంచాలతో సంపాదించుకుంటున్నారు. మన సమాజంలో అలాంటి ఉద్యోగులు ఎంతో మంది వున్నారు. అయితే ఇక్కడ ప్రజల నుంచి వస్తున్న ప్రశ్న ఒక్కటే. లంచంతీసుకుంటూ పట్టుబడిన ఉద్యోగి ఉద్యోగం ఎందుకు వెంటనే పోదు? ఏసిబి అధికారులు రెడ్‌ హాండెడ్‌గా పట్టుకున్న తర్వాత కూడా అది ఫేక్‌ ఎలా అవుతుంది. ఏసిబి అదికారులకు , ఇతర ఉద్యోగులకు ఏలాంటి సంబంధాలు వుండవు. ఒక వేళ ఏసిబి వాళ్లు టార్గెట్‌ చేశారనడానికి ఆస్కారమే లేదు. ఏసిబి అధికారులు న్యాయంగా, దర్మంగా పనిచేస్తే తప్ప లంచావతారులైన ఉద్యోగులు పట్టుబడరు. ఒక వేళ ఏసిబి వాళ్లు ఆ అదికారులను తప్పించాలనుకుంటే , పట్టుకోకముందే తప్పించొచ్చు. ఏసిబి అధికారులు పట్టుకున్న తర్వాత ఉద్యోగులు నీతిమంతులెలా అవుతారు? మళ్లీ వాళ్లకు క్లీన్‌ చీట్‌ ఎలా వస్తుంది. అంటే ఏసిబి అధికారులను పనితీరును తప్పు పట్టినట్లా? లేక వ్యవస్ధను ఎగతాళి చేసినట్లా? చాల మంది ఉద్యోగులు, అందులో ఉన్నత ఉద్యోగులు ప్రజలను రాబందుల్లా పీడిరచుకు తింటున్నారని తెలుసు. తమ భూములను తమ పేరు మీద మార్చడానికి కూడా ఎకరానికి లక్షల రూపాయలు వసూలు చేసిన అదికారులు కూడా వున్నారు. అలా తప్పని పరిస్దితుల్లో లంచాలు ఇచ్చి, అప్పులు చేసి మరీ లంచాలు ఇచ్చుకున్న ప్రజలు కోకొల్లలున్నారు. లంచం ఇవ్వడం తప్పే, తీసుకోవడం తప్పే? అని మాత్రం ప్రభుత్వాలు చేతులు దులుపుకుంటే సరిపోతుందా? కేంద్ర ప్రభుత్వం అనేక చట్టాలలో మార్పులు తీసుకొస్తున్నారు. ఏకంగా న్యాయ వ్యవస్దలోనే అనేక మార్పులు తీసుకొచ్చారు. బ్రిటీష్‌ ఇండియానుంచి ఇంత కాలం వారసత్వంగా వస్తున్న అనేక చట్టాలను మార్చి, కొత్త న్యాయ సంహితను తెచ్చారు. మరి అందులో అవినీతి అదికారుల గురించి ఆలోచించలేదు. అసలు అధికారులు సాగిస్తున్న అవినీతి గుర్తించలేదు. కనిపించడ ంలేదా? దేశ వ్యాప్తంగా అవినీతి అనేది ఎలా పెరిగిపోయిందో చూస్తూనే వున్నాం. కేంద్రం ప్రత్యేకచట్టం తీసుకురావడానికి అభ్యంతరం ఏమిటి? అందుకు రాష్ట్రాలు ఏం చేస్తున్నాయి. తెలంగాణలో ఎంత ఉద్యోగ వ్యవస్దలో ఎంత అవినీతి జరగుతుందో చూస్తూనే వున్నాం. అలాంటి అవినీతి అంతానికి రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మాణంచేసి, కేంద్రానికి పంపొచ్చు కదా? అలా అన్ని రాష్ట్రాలు తీర్మాణాలు చేసి, పంపిస్తే బాగుంటుంది. ఉద్యోగి లంచం తీసుకుంటే ఆ క్షణమే ఉద్యోగం కోల్పోతాడన్న కొత్త చట్టం తీసుకురావడానికి ఎందకు కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేయడంలేదు. ఎన్నికల సమయం వచ్చిందంటే చాలు. అవినీతి అంతం చేస్తామంటారు. అవినీతి అదికారులను కాపాడుతుంటారు. ఇదెక్కడి దిక్కుమాలిన రాజకీయాలో ఎవరికీ అర్దం కావు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!