పెత్తందారుల అణిచివేతను ప్రశ్నించిన వీరవనిత చాకలి ఐలమ్మ
జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
మంచిర్యాల నీటి ధాత్రి
తెలంగాణ సాయుధ, భూ పోరాట ఉద్యమంలో కీలకపాత్ర పోషించి పెత్తందారుల అణిచివేతను ప్రశ్నించిన వీరవనిత చాకలి ఐలమ్మ అని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. బుధవారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలో జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలలో జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి పురుషోత్తం నాయక్, వివిధ శాఖల జిల్లా అధికారులు, వివిధ సంఘాల నాయకులతో కలిసి హాజరై ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పెత్తందారుల అణచివేతను ప్రశ్నించిన వీరవనిత చాకలి ఐలమ్మ అందరికీ ఆదర్శంగా నిలిచారని అన్నారు. భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం పోరాడిందని, సాగు చేసే వారికి భూమి కోసం ఉద్యమించిందని తెలిపారు. తెలంగాణ భూ పోరాటానికి నాంది పలికిన మొదటి వ్యక్తి చాకలి ఐలమ్మ అని తెలిపారు. నిరుపేదలకు ప్రభుత్వం అందిస్తున్న ఇందిరమ్మ ఇండ్లు అర్హులైన ప్రతి ఒక్కరికి అందించడం జరుగుతుందని, ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో అన్ని శాఖల అధికారులు తప్పనిసరిగా హాజరవుతారని, ప్రజలు తమ సమస్యలపై దరఖాస్తు చేసుకుంటే సంబంధిత అధికారుల సమన్వయంతో పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకం ద్వారా నిరుపేదలకు 10 లక్షల రూపాయల వరకు విలువైన వైద్య సేవలు అందించడం జరుగుతుందని తెలిపారు. పట్టుదల, ఏకాగ్రతతో పని చేస్తే సామాన్యుడు కూడా సమాజంలో ఉన్నత స్థాయికి ఎదిగి అందరికీ ఆదర్శంగా నిలువచ్చని అన్నారు. మహనీయుల ఆశయాలను కొనసాగిస్తూ ముందుకు సాగుదామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, వివిధ సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.