*మైనర్ బాలికపై అత్యాచారం కేసులో నిందితున్ని అరెస్టు చేయాలి:
సీనియర్ అడ్వకేట్ టిజెఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అంబటి శ్రీనివాస్
నర్సంపేట, నేటిధాత్రి:
మైనర్ బాలికపై అత్యాచారం ఆరోపణలు ఎదుర్కొంటున్న బండి సాయి భగీరథను తక్షణమే అరెస్టు చేయాలని తెలంగాణ జన సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు అంబటి శ్రీనివాస్ డిమాండ్ చేశారు.శనివారం నర్సంపేటలో జరిగిన ప్రెస్ మీట్‌లో ఆయన మాట్లాడుతూ, దేశభక్తి, దైవభక్తి, మహిళలపై గౌరవం గురించి బహిరంగ సభలు, ప్రెస్ మీట్‌లలో గొప్పగా చెప్పుకునే బీజేపీ నాయకులకు బండి సాయి భగీరథ దుర్మార్గం కనిపించడం లేదా అని ప్రశ్నించారు. తండ్రి అధికార బలాన్ని అడ్డుపెట్టుకుని మైనర్ బాలికలను వేధించే క్రూర మనస్తత్వం ఉన్న వ్యక్తిని వెంటనే అరెస్టు చేయాలన్నారు.మహిళలపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి గౌరవం ఉంటే కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్‌ను మంత్రివర్గం నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఆయన చేతిలో అధికారం ఉన్నంతవరకు బాధిత బాలికకు న్యాయం జరగదని అన్నారు. బాధితురాలు అత్యాచారానికి గురైన రోజు మైనర్ కాబట్టి ఇది సెక్షన్ 65(2) బీఎన్ఎస్, సెక్షన్ 6 పోక్సో చట్టం కింద నేరం అవుతుందని స్పష్టం చేశారు.బాధితురాలి ప్రస్తుత వయస్సు కాకుండా నేరం జరిగిన రోజు వయస్సును పరిగణనలోకి తీసుకోవాలని, వెంటనే అరెస్టు చేసి జైలుకు పంపాలని కోరారు. ఈ కేసులో కోర్టు, రాష్ట్ర పోలీసుల తీరు సరిగా లేదని విమర్శించారు. సాధారణ ప్రజలపై ఇలాంటి కేసులు ఉంటే ఎన్‌కౌంటర్ పేరుతో హత్యలు చేసే ప్రభుత్వం బండి సాయి భగీరథ కేసులో మాత్రం అరెస్టు చేయడం లేదని ఆరోపించారు.బండి సంజయ్ కుమార్‌కు మహిళలపై గౌరవం ఉంటే తక్షణమే కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయాలని అంబటి శ్రీనివాస్ డిమాండ్ చేశారు.ఈప్రెస్ మీట్‌లో టీజేఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు షేక్ జావిద్, రాష్ట్ర నాయకులు గుంటి రామచందర్, బోనగాని రవీందర్, మహమ్మద్ సందాని తదితరులు పాల్గొన్నారు.
