తెలంగాణ ప్రజల గుండెల నిండా కేసిఆరే: ఎంపి. వద్దిరాజు రవిచంద్ర.

https://epaper.netidhatri.com/

` గులాబీ జెండానే తెలంగాణ ప్రజలకు అండా దండ!

`కొత్తగూడెం, ఇల్లందు బిఆర్‌ఎస్‌ ఇన్‌ చార్జ్‌, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, ఎడిటర్‌ కట్టా రాఘవేంద్రరావు కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వూ…

`ఉమ్మడి ఖమ్మం మొత్తం గెలుస్తాం.

` కొత్త గూడెం, ఇల్లందులలో విజయ దుంధుబి మోగిస్తాం.

` దేశమంతా కరంటు కోతలు..

`ఒక్క తెలంగాణ లోనే కరంటు వెలుగులు.

`తెలంగాణ లో కనిపించే ప్రగతి దేశంలో ఎక్కడా లేదు.

`సంక్షేమ పథకాలలో నెంబర్‌ వన్‌.

`ఆదర్శవంతమైన పాలనలో నెంబర్‌ వన్‌.

`ఇలా చెప్పుకుంటూ పోతే అన్నట్లో తెలంగాణ నెంబర్‌ వన్‌.

`దేశమంతా తెలంగాణ వైపు చూస్తోంది.

` కాంగ్రెస్‌ కల గనని, బిజేపి ఊహించని పథకాలు తెలంగాణలో అమలౌతున్నాయి.

` తెలంగాణ లో వుండేది, వున్నది ఒక్కటే బిఆర్‌ఎస్‌.

`తెలంగాణ లో ఇతర పార్టీలకు చోటు లేదు.

`ప్రజల్లో వున్నది బిఆర్‌ఎస్సే.

`ప్రజల కోసం పని చేసేది బిఆర్‌ఎస్సే.

` కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాలలో కానరాని సంక్షేమం.

` డిల్లీ పెత్తనంతో తెలంగాణను మళ్ళీ ఆగం చేస్తారు.

` తెలంగాణ ను గోస పెడతారు.

` తలెత్తుకొని ఆత్మ గౌరవం నిండిన తెలంగాణను డిల్లీలో తాకట్టు పెడతారు.

`తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా వుండాలి.

`కాంగ్రెస్‌, బిజేపిలను దూరం పెట్టాలి.

`తెలంగాణ ప్రజల సంక్షేమం కేసిఆర్‌ మాత్రమే చూస్తాడు.

హైదరబాద్‌,నేటిధాత్రి:

కట్టా రాఘవేంద్రరావు: ప్రచారం మొదలు పెట్టినట్లున్నారు?
వద్దిరాజు రవిచంద్ర: కారు ఎప్పుడూ స్పీడే…అందులోనూ ప్రజల గుండెల్లో వున్నదే. అందుకే తెలంగాణ గడ్డమీద వుండాల్సింది, వుండేది గులాబీ జెండానే..ఆ జెండా తెలంగాణ తెచ్చింది. తెలంగాణకు ఆత్మ గౌరవం తెచ్చింది. స్వయం పాలన ఇచ్చింది. కేసిఆర్‌ నాయకత్వంతో తెలంగాణ లో ఆ జెండా రెపరెపలాడుతోంది. ఒకనాడు తెలంగాణ ప్రజల్లో చైతన్యం నింపింది. ఇప్పుడు విజయ పతాకగా తెలంగాణను చల్లగా చూస్తోంది. ముచ్చటగా మూడో సారి గులాబీ జెండా ప్రభంజనం సృష్టించనుంది. హాట్రిక్‌ తో గులాబీ జెండా కు, కారు గుర్తుకు ఎదురులేదని రుజువుకాబోతోంది. ఈసారి ఉమ్మడి ఖమ్మం మొత్తం గెలుస్తాం. కొత్త గూడెం, ఇల్లందులలో విజయ దుంధుబి మోగిస్తాం. నాకు ఇన్‌ చార్జిగా ప్రత్యక్ష పర్యవేక్ష బాధ్యతలు అప్పగించిన ముఖ్యమంత్రి కేసిఆర్‌ నమ్మకాన్ని నిలబెడతా!

కట్టా: తెలంగాణ అభివృద్ధి గురించి చెప్పమంటే ఏం చెబుతారు?
రవిచంద్ర: ఎక్కడి నుంచి మొదలు పెట్టి చెప్పమంటారు. సాగు నుంచి మొదలు పెడితే అంతులేని అభివృద్ధి తెలంగాణ లో జరిగింది. పాలమూరు-రంగారెడ్డితో పరిపూర్ణమౌతోంది. సాగు నీటి కష్టం తీరింది. మంచి నీటి కటకట పోయింది. కరంటు కష్టాలు తీరాయి. రోజంతా కరంటు కోత చూసిన తెలంగాణ, నిరంతర కరంటు చూస్తోంది. ఇప్పటికిప్పుడున్న పరిస్థితి. దేశమంతా కరంటు కోతలు..ఒక్క తెలంగాణ లోనే కరంటు వెలుగులు. ఇది మేం చెబుతున్న మాటే కాదు, సెంట్రల్‌ పవర్‌ గ్రిడ్‌ చెబుతున్న మాట. బిజేపి పాలిత, కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాలలో ఎక్కడా సాధ్యం కాలేదు. ఎందుకంటే అక్కడ కేసిఆర్‌ నాయకత్వం లేదు. తెలంగాణ లో సంక్షేమ నాయకత్వం వుంది. కేసిఆర్‌ పాలన సాగుతోంది. అందుకే తెలంగాణ లో ప్రజలకు ఏ కష్టం లేదు. సాగు కష్టం లేదు. కరంటు కష్టం లేదు. పండిన పంట ఎవరు కొంటారా? అన్న దిగులు లేదు. దళారుల మోసం లేదు. అంతా ప్రభుత్వమే ఇస్తోంది. సాగువాటుకు ముందే రైతు బంధు అందుతోంది. ప్రపంచంలోనే ఇంతటి రైతు క్షేమ పాలన ఎక్కడా కనిపించదు. రైతుకు పెట్టుబడి సాయమందిస్తే బంగారు పంటలు పండిస్తాడని గతంలో ఎప్పుడైనా , ఏ పాలకుడైనా ఆలోచించాడా? అదే కేసిఆర్‌ గొప్పతనం. గొప్ప గుణం. రైతు సంక్షేమం కాంక్షే ఏకైక నాయకుడు కేసిఆర్‌. తెలంగాణ లో కనిపించే ప్రగతి దేశంలో ఎక్కడా లేదు.
సంక్షేమ పథకాలలో నెంబర్‌ వన్‌. ఆదర్శవంతమైన పాలనలో నెంబర్‌ వన్‌. ఇలా చెప్పుకుంటూ పోతే అన్నట్లో తెలంగాణ నెంబర్‌ వన్‌. అందుకే దేశమంతా తెలంగాణ వైపు చూస్తోంది. కాంగ్రెస్‌ కల గనని, బిజేపి ఊహించని పథకాలు తెలంగాణలో అమలౌతున్నాయి.

కట్టా: తెలంగాణ లో ప్రతిపక్షాల పరిస్థితి ఏమిటి?
రవిచంద్ర: తెలంగాణ లో ప్రతిపక్షాలు కూడా వున్నాయా? ఉనికి కోసం మాత్రమే కొట్లాడుకుంటున్నాయి. అసలు తెలంగాణలో ప్రతిపక్షాలకు చోటే లేదు. తెలంగాణ లో వుండేది, వున్నది ఒక్కటే బిఆర్‌ఎస్‌. ప్రజల్లో వున్నది బిఆర్‌ఎస్సే. ప్రజల కోసం పని చేసేది బిఆర్‌ఎస్సే. అసలు తెలంగాణకు కాంగ్రెస్‌ చేసిన మోసం అంతా ఇంతా కాదు. కాంగ్రెస్‌ తెలంగాణ ఇవ్వలేదు. కేసిఆర్‌ పద్నాలుగు సంవత్సరాలు నిర్విరామంగా పోరాటం చేసి సాధించారు. అంతే తప్ప కాంగ్రెస్‌ ఇచ్చిందేమీ లేదు. తెలంగాణను నిండా ముంచిందే కాంగ్రెస్‌ పార్టీ. తెలంగాణ ను ఆంధ్రతో కలిపి, ఎప్పుడో అన్యాయం చేసింది. ఆ తర్వాత అడుగడుగునా అన్యాయం చేస్తూనే వచ్చింది. తెలంగాణ కోసం కొట్లాటను అడుగడుగునా అణచివేసింది. తెలంగాణ నోరెత్తకుండా చేసింది. సీమాంధ్ర నేతల మాట విని తెలంగాణ కు తీరని ద్రోహం చేసింది. అరవై ఏళ్లలో యాభై ఏళ్ళు పాలించిన కాంగ్రెస్‌ చెరువుల్లో తట్టెడు మట్టి తీయలేదు. బావులు ఎండిపోయి సాగుకు నీళ్లు లేక బోర్లు వేసుకుందామంటే వాల్టా చట్టం తెచ్చింది. తెలంగాణ సాగును సర్వం నాశనం చేసింది. అలాంటి కాంగ్రెస్‌ ఇప్పుడు ఇచ్చింది మేమే అంటే ప్రజలు నమ్ముతారా? తెలంగాణ ను ఆగం చేసిన వాళ్లకు ఒక్కసారి అవకాశం ఇస్తే మళ్ళీ తెలంగాణను వందేళ్ల వెనకకు తీసుకుపోతారు. అయినా తెలంగాణ లో నలుగురు నాయకులు తప్ప కాంగ్రెస్‌ లేదు. దానికి క్యాడర్‌ లేదు. ప్రజల్లో గుర్తింపే లేదు. కాంగ్రెస్‌ అధికారం లో వున్న రాష్ట్రాలలో సంక్షేమమే లేదు. డిల్లీ పెత్తనంతో తెలంగాణను మళ్ళీ ఆగం చేస్తారు. తెలంగాణ ను గోస పెడతారు. తలెత్తుకొని ఆత్మ గౌరవం నిండిన తెలంగాణను డిల్లీలో తాకట్టు పెడతారు. అందుకే తెలంగాణ ప్రజలు కాంగ్రెస్‌ విషయంలో అప్రమత్తంగా వుండాలి. మాటలకేముంది నరం లేని నాలుక ఎన్నో చెబుతుంది. ప్రజల మీద ప్రేమ కన్నా అధికారం మీద యావ వున్న కాంగ్రెస్‌ కట్టుకథలు మస్తు చెబుతుంది. వాటిని ప్రజలు నమ్మే పరిస్థితే లేదు.

కట్టా: ప్రచారం ఎలా సాగుతోంది?
రవిచంద్ర: చూస్తున్నారు కదా! ప్రజలు ఎలా కదిలి వస్తున్నారో..ఎలా స్వాగతం పలుకుతున్నారో…ఏ ఊరికి వెళ్లినా ప్రజలు ఎదురొచ్చి, దీవెనలు అందిస్తున్నారు. కారు గుర్తుకే ఓటేస్తామంటున్నారు. కేసిఆర్‌ ను గుండెల్లో పెట్టుకున్నారు. తెలంగాణ ప్రజల సంక్షేమం కేసిఆర్‌ మాత్రమే చూస్తాడు. ఇది తెలంగాణ ప్రజల బలమైన నమ్మకం. అందుకే ఆయన నాయకత్వం కోరుకుంటున్నారు. ఒకనాడు తెలంగాణ అంటే ఏమిటి? ఇప్పుడు తెలంగాణ ఎలా వున్నది? అనేది మన కళ్ల ముందే వున్నది. సంక్షేమ రాజ్య భావన అనేది పుస్తకాలలో చదివిందే తప్ప గతంలో చూసింది లేదు. కానీ ఇప్పుడు కళ్లారా చూస్తున్నాము. తెలంగాణ ప్రజల యోగ క్షేమాల గురించే కాదు, భవిష్యత్తు తెలంగాణ కోసం కేసిఆర్‌ కష్టపడుతున్నారు. అందుకే తెలంగాణ తొమ్మిదేళ్లలో తొంభై ఏళ్ల అభివృద్ధి జరిగింది. పల్లెల్లో వెలుగొచ్చింది. పల్లెకు సిరి వచ్చింది. చెరువు బాగైంది. చెరువు నిండిరది. చెవుల నీటి పారకం మొదలైంది. చేపల పెంపకం జరుగుతోంది. తెలంగాణ కూడా మత్స్య సంపద చూస్తోంది. సాగు మొదలైంది. సాగు నీరందుతోంది. ఉచిత కరంటు వచ్చింది. ఇరవై నాలుగు గంటల వస్తోంది. రైతుకు రంది లేకుండా పోయింది. ఎన్ని బోర్లు వేసుకున్నా కరంటు ఇస్తోంది. నీళ్లు లేవన్న బాధలేదు. బోరు ఎండిపోయే ప్రసక్తి లేదు. బావుల్లో నీళ్లు అడుగంటింది లేదు. సాగుబడికి ఇబ్బంది లేదు. రైతు బంధుతో అప్పు బాధ లేదు. విత్తనాల కొరత లేదు. ఎరువుల బాధ లేదు. ఇలా చెప్పుకుంటూ పోతే రైతుకు ఎలాంటి దిగులు లేదు. కాలు మీద కాలేసుకొని తెలంగాణ రైతు వ్యవసాయం చేసే రోజులొస్తాయని ఎవరూ కలగనలేదు. అదీ తెలంగాణ అంటే…ఇదీ కేసిఆర్‌ నాయకత్వం అంటే. ఇక సంక్షేమ కార్యక్రమాలు.. పథకాల గురించి ఎంత చెప్పుకున్నా సమయం చాలదు. మరిన్ని తర్వాత చెప్పుకుందాం…ప్రచారానికి బయలుదేరుతున్నాం…
కట్టా: ధన్యవాదాలు.
రవిచంద్ర: నమస్తే

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *