అరుణోదయ సాంస్కృతిక సమైక్య వరంగల్ జిల్లా ఉమ్మడి కమిటీ ఎన్నిక…

అరుణోదయ సాంస్కృతిక సమైక్య వరంగల్ జిల్లా ఉమ్మడి కమిటీ ఎన్నిక

అధ్యక్షుడిగా ఇట్టబోయిన రవి, కార్యదర్శిగా గుర్రం అజయ్

నర్సంపేట,నేటిధాత్రి:

 

అరుణోదయ సాంస్కృతిక సమైక్య ఉమ్మడి వరంగల్ జిల్లా 7వ మహాసభ సోమవారం సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ పార్టీ కార్యాలయంలో జరిగింది. ఈ సందర్భంగా అరుణోదయ ఉమ్మడి వరంగల్ జిల్లా నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా ఇట్టబోయిన రవి, జిల్లా ప్రధాన కార్యదర్శిగా గుర్రం అజయ్ ఎన్నికయ్యారు. సభకు ముందు ఇట్టబోయిన రవి అరుణోదయ జెండాను ఆవిష్కరించారు.
సభలో ముఖ్య వక్తలుగా యోచన, ప్రజాకవి వాగ్గేయకారుడు, అరుణోదయ సహాయ కార్యదర్శి చిరంజీవి, ఇడంపాక శ్రీశైలం మాట్లాడారు. హైదరాబాద్‌లో ఏప్రిల్ 10, 11 తేదీల్లో నిర్వహించనున్న అరుణోదయ రాష్ట్ర 7వ మహాసభలను జయప్రదం చేయాలని వారు పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా గుర్రం అజయ్ మాట్లాడుతూ, దోపిడీ, పీడన, అణచివేతలకు వ్యతిరేకంగా శ్రామిక వర్గాల తరఫున పోరాడుతున్న సాంస్కృతిక సంస్థగా అరుణోదయ పనిచేస్తోందన్నారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట స్ఫూర్తితో 1974లో అరుణోదయ ఆవిర్భవించిందని తెలిపారు. ఒగ్గుకథ, బుర్రకథ, హరికథ, నృత్యం వంటి జానపద కళారూపాల ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చిందన్నారు. సారా, కరువు, డ్రగ్స్, గంజాయి, వరకట్నం, మూఢనమ్మకాలపై పాటల ద్వారా ఉద్యమాలు నిర్వహించిందని చెప్పారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో కూడా కళారూపాలతో ప్రజలను ఉద్యమం వైపు నడిపించిందన్నారు.

గిరిజన, దళిత, ముస్లిం మైనారిటీ, బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం జరిగిన ఉద్యమాల్లో అరుణోదయ కీలక పాత్ర పోషించిందన్నారు. అమరులైన కళాకారులను స్మరించుకుంటూ గతాన్ని సమీక్షించి భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకునేందుకు హైదరాబాద్‌లో రాష్ట్ర మహాసభలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.అలాగే జిల్లా కమిటీ సభ్యులుగా జన్ను కార్తీక్, మల్లయ్య చారి, సౌందర్య, గద్దల వసంత, గద్దల శ్యాంసుందర్, నంబియార్ తదితరులను సభ్యులుగా ఎన్నుకున్నారు.ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఎలకంటి రాజేందర్, నాయకులు బండి కోటేశ్వర్లు, గట్టి కృష్ణ, గంగుల దయాకర్, జక్కుల తిరుపతి, పూలక్క, మల్లన్న, పాణి, ఆకుల వెంకటస్వామి, ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు.

నర్సంపేటలో తూనికలు–కొలతల చట్టం ఉల్లంఘన…

నర్సంపేటలో తూనికలు–కొలతల చట్టం ఉల్లంఘన

10 షాపులపై కేసులు నమోదు

నర్సంపేట పట్టణంలో ఆకస్మిక తనిఖీలు

నెలకోసారి తనిఖీలు చేస్తే కొనుగోలుదారులకు మేలు..

నర్సంపేట, నేటిధాత్రి:

నర్సంపేట పట్టణంలో తూనికలు–కొలతల చట్టం ఉల్లంఘన చేపట్టడంతో సంబంధిత అధికారులు ఫైర్ అయ్యారు.తూనికలు–కొలతలల్లో అవకతవకలకు పాల్పడుతున్న వివిధ రకాల 10 దుకాణాలపై కేసులు నమోదు చేశారు.

తూనికలు–కొలతల చట్టం అమలుపై జిల్లా లీగల్ మెట్రాలజీ అధికారి వరంగల్ మనోహర్ ఆధ్వర్యంలో ఆదివారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.ఈ సందర్భంగా గ్యాస్ డెలివరీ ఆటోల్లో బరువు, పెట్రోల్ పంపులు, బంగారు దుకాణాలు, కిరాణా షాపులు, చికెన్, మటన్ మరియు చేపల దుకాణాలను పరిశీలించి తూనికలు, కొలతలు సక్రమంగా వినియోగిస్తున్నారో లేదో తనిఖీ చేశారు.
తనిఖీలలో తూనికలు–కొలతల చట్టం నిబంధనలు ఉల్లంఘించిన కిరాణా, చికెన్, మటన్, చేపల దుకాణాలపై మొత్తం 10 కేసులు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.

ఈ సందర్భంగా జిల్లా లీగల్ మెట్రాలజీ అధికారి మనోహర్ మాట్లాడుతూ వ్యాపారులు తూనికలు–కొలతల చట్టం నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, వినియోగదారులకు న్యాయం జరిగేలా సరైన కొలతలతో వస్తువులు విక్రయించాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

నెలకోసారి తనిఖీలు చేస్తే కొనుగోలుదారులకు మేలు..

నర్సంపేట పట్టణంలోనే కాకుండా డివిజన్ వ్యాప్తంగా తూనికలు–కొలతల శాఖ ఆధ్వర్యంలో ప్రతినెల తనిఖీలు చేపడితే కొనుగోలుదారులకు పూర్తిస్థాయిలో మేలు జరుగుతుందని ప్రజల కోరుతున్నారు. ఏడాదికోసారి మంత్రంగా తనిఖీలు నిర్వహించి అరకొర గా కేసులు నమోదు చేయడం సంబంధిత అధికారులు చేతులు దులుపుకున్నట్లే అని ప్రజల విమర్శిస్తున్నారు.

గ్రామాల అభివృద్ధికి బాధ్యతాయుత పాలన అవసరం

గ్రామాల సమగ్రాభివృద్ధికి బాధ్యతాయుతంగా పనిచేయాలి:

ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక విజయవంతానికి అందరూ భాగస్వాములు కావాలి

రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ

నర్సంపేట/గీసుగొండ::

గ్రామాల అభివృద్ధే రాష్ట్ర ప్రగతికి పునాదని, గ్రామాల సమగ్రాభివృద్ధికి ప్రజాప్రతినిధులు బాధ్యతాయుతంగా పనిచేయాలని
రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పిలుపునిచ్చారు.గురువారం వరంగల్ జిల్లాలోని గీసుగొండ మండలం మరియాపురం గ్రామంలోని ఎస్‌.ఎస్‌. ఫంక్షన్ హాల్‌లో ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికపై జిల్లాలోని ప్రజాప్రతినిధులకు నిర్వహించిన ఒకరోజు శిక్షణ కార్యక్రమంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని,నగర మేయర్ గుండు సుధారాణి, జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద లతో కలసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా కలెక్టర్ డాక్టర్ సత్య శారద అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం మార్చి 6 నుండి జూన్ 12 వరకు అమలు చేస్తున్న 99 రోజుల కార్యక్రమంలో ప్రతీ ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. సర్పంచ్ నుంచి మంత్రి వరకు ప్రతి ఒక్కరూ స్థానిక అధికారులతో సమన్వయం చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలిపారు.సీఎం రేవంత్ రెడ్డి దార్శనికతకు అనుగుణంగా అధికారులు పనిచేయాలని, సంక్షేమ పథకాలు, ప్రజా సేవలను ప్రజల్లోకి వేగంగా తీసుకెళ్లాలని ఆదేశించారు. 

ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించడం, పెండింగ్‌లో ఉన్న ఫైళ్లను క్లియర్ చేయడం, గ్రామాలు మరియు పట్టణాల్లో పరిశుభ్రత కార్యక్రమాలను ప్రత్యేకంగా చేపట్టడం, ప్రభుత్వ సేవలను ప్రజలకు సులభతరం చేయడం
ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు. ప్రజల సమస్యల పరిష్కారమే మన పనితీరుకు ప్రధాన ధ్యేయంగా ఉండాలని అన్నారు.ఈ 99 రోజుల ప్రణాళిక ద్వారా పాలనలో పారదర్శకత, జవాబుదారీతనం పెంచడం ప్రభుత్వ ప్రధాన ఉద్దేశ్యమని అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని అనేక కార్యక్రమాలను అమలు చేస్తోందని తెలిపారు.గత రెండు సంవత్సరాల్లో రైతు రుణమాఫీ, రైతు భరోసా, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఇందిరమ్మ ఇండ్లు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, నూతన రేషన్ కార్డులు, సన్న బియ్యం సరఫరా వంటి అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు.ప్రభుత్వం అందించిన అవకాశాన్ని వినియోగించుకుని ప్రజాప్రతినిధులు క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించుకోవాలని మంత్రి సూచించారు. గ్రామాలు, పట్టణాల అభివృద్ధికి ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని తెలిపారు.గ్రామాలు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని,

ప్రజల భాగస్వామ్యంతో గ్రామాలను ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దాలని అన్నారు.గ్రామాలు, పట్టణాల అభివృద్ధిలో పారిశుధ్యం అత్యంత కీలకమని తెలిపారు. పారిశుధ్య కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తూ పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అన్నారు. పరిశుభ్రతను పాటించడం ద్వారా అనేక వ్యాధులను నివారించవచ్చని, ప్రజల ఆరోగ్యం కాపాడటంలో శానిటేషన్ ముఖ్య పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించేందుకు గ్రామాలు, పట్టణాల్లో ప్లాస్టిక్ వ్యర్థాలను నియంత్రిస్తూ పర్యావరణానికి హాని కలిగించని ప్రత్యామ్నాయాలను ఉపయోగించేలా ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ఈ విధంగా పారిశుధ్యం, పర్యావరణ పరిరక్షణపై ప్రత్యేక దృష్టి పెట్టి పనిచేస్తే గ్రామాలు, పట్టణాలు మరింత శుభ్రంగా, ఆరోగ్యకరంగా మారుతాయని మంత్రి తెలిపారు.గ్రామాల్లో పర్యావరణ పరిరక్షణ కోసం విస్తృతంగా మొక్కలను నాటి వాటిని సంరక్షించడం అత్యంత అవసరమని తెలిపారు. మొక్కలు పర్యావరణ సమతుల్యతను కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తాయని, పెరుగుతున్న ఉష్ణోగ్రతలు మరియు ప్రకృతి విపత్తులను తగ్గించడంలో చెట్లు ఎంతో ఉపయోగపడతాయని అన్నారు. గ్రామపంచాయతీలు అవసరమైన మొక్కల కోసం ఇండెంట్ పంపితే సంబంధిత శాఖ ద్వారా సరఫరా చేస్తామని పేర్కొన్నారు. ప్రతి గ్రామంలో పచ్చదనం పెంపొందించేందుకు ప్రజాప్రతినిధులు ముందడుగు వేయాలని మంత్రి పిలుపునిచ్చారు.గ్రామాల అభివృద్ధికి కృషి చేసిన మహానుభావుల సేవలు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాయని తెలిపారు.అభివృద్ధికి ఆదర్శంగా నిలిచిన గ్రామాలను సందర్శించి అక్కడ అమలు చేసిన విధానాలను తెలుసుకుంటే ప్రజాప్రతినిధులకు పరిపాలనలో ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు. శిక్షణ కార్యక్రమాల్లో నేర్చుకున్న విషయాలను ఆచరణలో పెట్టి ప్రజల సమస్యలను పరిష్కరిస్తూ వారి విశ్వాసాన్ని పొందాలని సూచించారు.పదవులు శాశ్వతం కావని, కానీ ప్రజలకు చేసిన సేవలు మాత్రం చిరస్థాయిగా నిలుస్తాయని పేర్కొంటూ ప్రజాప్రతినిధులు బాధ్యతాయుతంగా పనిచేసి ప్రజల మనసులను గెలుచుకోవాలని మంత్రి పిలుపునిచ్చారు.నగర మేయర్ గుండు సుధారాణి మాట్లాడుతూ..ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం ప్రజల సంక్షేమం, సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా వినూత్న సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీ పథకాలు ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తున్నాయని పేర్కొన్నారు. ప్రగతి బాటలో సకల జన హితం లక్ష్యంగా ప్రభుత్వం చేపట్టిన ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా 10 థీమ్లపై 99 రోజులపాటు ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తున్నట్లు చెప్పారు.ప్రజాప్రతినిధులుగా ప్రభుత్వ పథకాలు అర్హులైన ప్రతి కుటుంబానికి చేరేలా చూడటం, ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించడం మన బాధ్యత అని మేయర్ తెలిపారు. ఈ శిక్షణ ద్వారా పొందిన అవగాహనను తమ ప్రాంతాల్లో అమలు చేసి అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయాలని ప్రజాప్రతినిధులకు సూచించారు.

ప్రజల సంక్షేమం, అభివృద్ధి లక్ష్యాలు సాధించేందుకు అందరూ సమన్వయంతో పనిచేయాలని మేయర్ తెలిపారు.జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద* ప్రభుత్వం చేపట్టిన “ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక”లో భాగంగా జిల్లాలో అమలు చేస్తున్న 99 రోజుల కార్యాచరణపై పవర్ పాయింట్ ప్రెసెంటిషన్ ద్వారా ప్రజాప్రతినిధులకు సమగ్రంగా వివరించారు. గ్రామాలు, పట్టణాల సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం గుర్తించిన 10 కీలక అంశాలపై ప్రత్యేక కార్యాచరణను అమలు చేయనున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమాన్ని ఐదు దశల్లో నిర్వహించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఏప్రిల్ 2న గ్రామ స్థాయిలో గ్రామ సభలు, ఏప్రిల్ 16న మండల స్థాయి కార్యక్రమాలు, మే 2న నియోజకవర్గ స్థాయి కార్యక్రమాలు, మే 22న జిల్లా స్థాయి కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు చెప్పారు. జూన్ 2న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కార్యక్రమాలు ముగుస్తాయని తెలిపారు.99 రోజుల కార్యాచరణలో భాగంగా పరిసరాల పరిశుభ్రత, ప్రభుత్వ కార్యాలయాల్లో పెండింగ్ ఫైళ్ల క్లియరెన్స్, ప్రజల ఆరోగ్యం, రోడ్డు భద్రత (అరైవ్-అలైవ్), సంక్షేమ పథకాల అమలు, పిల్లల భద్రత మరియు డ్రగ్స్‌కు అడ్డుకట్ట, రైతు సంక్షేమం మరియు వ్యవసాయం అభివృద్ధి, విద్యా రంగం, యువత మరియు క్రీడలు, మహిళల సాధికారత, పర్యావరణ పరిరక్షణ వంటి 10 ముఖ్య అంశాలపై దృష్టి సారిసస్తున్నట్లు తెలిపారు.ప్రజల సమస్యలను గుర్తించి త్వరితగతిన పరిష్కరించడం, పెండింగ్ సమస్యలను పరిష్కరించడం, పారిశుధ్యం మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధి ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యాలని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన ప్రణాళిక ప్రకారం ప్రతి నియోజకవర్గం, మండలం, గ్రామ స్థాయిలో ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసి పనిచేసి ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికను విజయవంతం చేయాలని కలెక్టర్ కోరారు. ఈ కార్యక్రమానికి ముందు ఇటీవల మరణించిన గంగదేవిపల్లి మాజీ సర్పంచ్ కూసం రాజమౌళికి సంతాపం తెలిపారు.కార్యక్రమంలో భాగంగా మంత్రి చేతుల మీదుగా నూతనంగా ఎన్నికైన సర్పంచులు, కౌన్సిలర్లకు, ప్రజాప్రతినిధులకు ఐడెంటిటీ కార్డులు అందజేశారు.అనంతరం డీఆర్‌డీఏ, ఉద్యానవన శాఖ, స్వయం సహాయక సంఘాలు, పునరుత్పాదక ఇంధన
తదితర శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను మంత్రి ప్రారంభించి, ప్రదర్శించిన ఉత్పత్తులను పరిశీలించారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలోని
అంశాలపై వివిధ శాఖల ద్వారా ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ను మంత్రి , మేయర్, కలెక్టర్ లు తిలకించారు.ఈ కార్యక్రమంలో వర్ధన్నపేట, నర్సంపేట చైర్పర్సన్ లు సారంగపాణి, పెండెం లక్ష్మీ రామానంద్, డిసిపి అంకిత్ కుమార్ , డిఎఫ్ ఓ అనుజ్ అగర్వాల్, ఆదనవు కలెక్టర్లు సంధ్యారాణి, వై వి గణేష్, జెడ్పి సీఈఓ రామ్ రెడ్డి, డిపిఓ కల్పన, జిల్లాలోని సర్పంచులు, కౌన్సిలర్లు మరియు జి.డబ్ల్యూ.ఎం.సి పరిధిలోని కార్పొరేటర్లు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

పరకాల వైద్యుడికి అరుదైన గౌరవం…

పరకాల వైద్యుడికి అరుదైన గౌరవం

భారతీయ నంది అవార్డు అందుకున్న డాక్టర్ రోహిత్ సాదు

పరకాల,నేటిధాత్రి

 

పట్టణానికి చెందిన ప్రముఖ ఫిజియోథెరపీ వైద్యుడు డా.సాదు రోహిత్‌కు అరుదైన గౌరవందక్కింది.హైదరాబాద్‌లోని స్ఫూర్తి సొసైటీ ఆధ్వర్యంలో ప్రదానం చేసే “భారతీయ నంది అవార్డు”ను ఆయన అందుకున్నారు.కరోనా సమయంలో ప్రజలకు అందించిన విశిష్ట సేవలను గుర్తిస్తూ ఈ అవార్డును అందజేసినట్లు సొసైటీ ప్రతినిధులు తెలిపారు.పరకాల పట్టణంతో పాటు శాయంపేట,రేగొండ, నడికూడ,మొగుళ్లపల్లి మండలాల్లో ప్రజలకు ఫిజియోథెరపీ సేవలు అందిస్తూ మంచి గుర్తింపు పొందిన డా.రోహిత్ సాదుకు ఈ అవార్డు రావడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.ప్రజలకు నిరంతరం సేవలు అందిస్తున్న ఆయనకు ఈ గౌరవం దక్కడం గర్వకారణమని పలువురు అభినందించారు.

కరోనా సమయంలో విశేష సేవలు

కరోనా మహమ్మారి సమయంలో అనేక మంది రోగులకు ఫిజియోథెరపీ సేవలు అందిస్తూ వారి ఆరోగ్య పునరుద్ధరణకు డా.రోహిత్ సాదు కృషి చేశారు.ఈ సేవలను గుర్తించిన స్ఫూర్తి సొసైటీ ఆయనకు భారతీయ నంది అవార్డు ప్రదానం చేసింది.

తెలంగాణ ఉద్యమకారుల ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా లింగాల తిరుపతి…

తెలంగాణ ఉద్యమకారుల ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా లింగాల తిరుపతి

నడికూడ,నేటిధాత్రి:

 

తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా నడికూడ మండలం కౌకొండ గ్రామానికి చెందిన లింగాల తిరుపతిని నియమించినట్లు తెలంగాణ ఉద్యమకారుల ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు భాష బోయిన రవీందర్ యాదవ్ తెలిపారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంఘం యొక్క నిబంధనలకు లోబడి సంఘ సభ్యులను విస్తరించుకుంటూ తెలంగాణ ప్రజల,అలాగే ఉద్యమకారుల ఆకాంక్షలను నెరవేర్చుటకు రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం కొరకు ఆత్మగౌరవం సంక్షేమం కొరకు కృషి చేయాలని తెలిపారు. ఈ సందర్భంగా తిరుపతి మాట్లాడుతూ నాపై నమ్మకంతో నాకీ బాధ్యతను అప్పగించిన జిల్లా అధ్యక్షులు రవీందర్ యాదవ్ కు అలాగే నా నియమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

వరంగల్ జిల్లా భూకొలతదారుల సంఘం నూతన కార్యవర్గ ఎన్నిక..

వరంగల్ జిల్లా భూకొలతదారుల సంఘం నూతన కార్యవర్గ ఎన్నిక

వరంగల్, నేటిధాత్రి

 

వరంగల్ జిల్లా అనుమతి పొందిన భూకొలతదారుల సంఘం–2025 నూతన కార్యవర్గ ఎన్నికలు రంగశాయిపేటలోని ఓ కార్యాలయంలో జనవరి 4వ తేదీ రాత్రి ఘనంగా నిర్వహించారు. ఈ ఎన్నికలను న్యాయ సలహాదారులు గోనె విజయ్ రెడ్డి, బర్ల పూర్ణచందర్ పర్యవేక్షించారు.
ఈ ఎన్నికల్లో నూతన కార్యవర్గ అధ్యక్షుడిగా దేవునూరి రాజు ఎన్నికయ్యారు. కార్యనిర్వాహక అధ్యక్షుడిగా రంగు శివ, ఉపాధ్యక్షుడిగా జినికిరి రాజ్‌కుమార్, ప్రధాన కార్యదర్శిగా గజవెల్లి ప్రదీప్, వరంగల్ విభాగ సమన్వయకర్తగా మామిడాల సాయిరామ్ ఎన్నికయ్యారు. కార్యదర్శులుగా బొమ్మెర రమ, మరుపట్ల ఏకాంబరం, కోశాధికారిగా ధర్మసోత్ కిరణ్, సలహాదారుగా ఆవునూరి శివకుమార్‌ను నియమించారు.
మహిళా విభాగం సమన్వయకర్తగా బలుగురి దీపిక, నర్సంపేట విభాగం సమన్వయకర్తగా పెంతల విష్ణు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అలాగే జిల్లాలోని పదమూడు మండలాలకు పదమూడు మంది సమన్వయకర్తలు బాధ్యతలు స్వీకరించారు.
ఎన్నికల అనంతరం అధ్యక్షుడు దేవునూరి రాజు మాట్లాడుతూ, త్వరలోనే డెబ్బై గ్రామాల్లో పునః భూకొలతలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రభుత్వం తమపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా బాధ్యతాయుతంగా పనిచేస్తామని, భూకొలతదారులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి సభ్యులందరూ ఐకమత్యంతో నిరంతరం కృషి చేస్తామని ఆయన భరోసా ఇచ్చారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version