ఘనంగా పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ జయంతి వేడుకలు
ఏడునూతుల నిషిధర్ రెడ్డి
బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షుడు
భూపాలపల్లి నేటిధాత్రి
జిల్లా కేంద్రంలోని మంజు నగర్ లో భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు ఏడునూతుల నిషిధర్ రెడ్డి ఆధ్వర్యంలో “పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ” జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ఉపాధ్యక్షులు వీరబెల్లి రఘునాథ్ హాజరయ్యారు.ముందుగా పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు.అనంతరం రఘునాథ్ మాట్లాడుతూ..పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ సాధారణ ప్రజల కోసం, సమాజంలో చివరి అంచున ఉన్నవారి కోసం ఆలోచించిన మహానుభావుడు,ఆయన అంత్యోదయ తత్వం ‘చివరి వ్యక్తి అభ్యున్నతి’ అనే ఆలోచన నేటికీ దేశానికి మార్గదర్శనం చేస్తోంది. ప్రతి కార్యకర్త ఆయన బాటలో నడవాలి.ఆయన ఆలోచనలే మన బీజేపీకి బలమైన పునాది” అని పేర్కొన్నారు.
తరువాత జరిగిన మేధావుల సదస్సులో ఆయన మాట్లాడుతూ…
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గత 11 ఏళ్లుగా నిరంతరం ప్రజాసేవలో నిమగ్నమై ఉన్నారని,ఆయన నాయకత్వంలో భారత్ ప్రపంచ వేదికపై మరింత గౌరవాన్ని సంపాదించిందని, పేదలకు సంక్షేమ పథకాల రూపంలో మోదీ చేస్తున్న సహాయం కోట్లాది కుటుంబాలకు ఆశాకిరణంగా నిలుస్తోందని,ఉజ్వల యోజన,జనధన్ ఖాతాలు, ఆయుష్మాన్ భారత్, హర ఘర్ విద్యుత్, స్వచ్ఛ భారత్ వంటి పథకాలతో దేశం అభివృద్ధి దిశగా దూసుకుపోతోంది. మోదీ 11 ఏళ్ల పాలనలో పారదర్శకత, అవినీతి రహితత, సమగ్రాభివృద్ధి, సామాజిక న్యాయం ప్రధానంగా నిలిచాయి అని వివరించారు.సింగరేణి కార్మికులు రాత్రి పగలు కష్టపడి దేశానికి “బొగ్గు సరఫరా చేస్తున్నారు.వారి శ్రమ వల్ల పరిశ్రమలు, విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. ఈ పరిస్థితిలో కేంద్ర ప్రభుత్వం సింగరేణి కార్మికులకు అండగా నిలుస్తోంది, భద్రత, వైద్యం, గృహ వసతి, బోనస్ మరియు పింఛన్ సౌకర్యాలను అందిస్తోంది. భవిష్యత్తులో కూడా వారి శ్రేయస్సు కోసం ప్రభుత్వం కృషి చేస్తుంది అని మాట్లాడారు.ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు ఏడునూతుల నిషిధర్ రెడ్డి మాట్లాడుతూ
“దీన్ దయాల్ ఉపాధ్యాయ్ గారి ఆలోచనలను ప్రతి కార్యకర్త జీవన సూత్రంగా తీసుకోవాలి. బీజేపీ యొక్క ప్రతి అడుగు పేదల కోసం, కార్మికుల కోసం, రైతుల కోసం ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం మాదిరిగానే మనం కూడా ప్రజలతో మమేకమై కష్టనష్టాలను అర్థం చేసుకుంటూ కృషి చేయాలి” అని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వెన్నంపల్లి పాపయ్య,పార్లమెంట్ కో కన్వీనర్ లింగంపల్లి ప్రసాద్ రావు,జిల్లా ప్రధాన కార్యదర్శి లు దొంగల రాజేందర్, పెండ్యాల రాజు, తాటికొండ రవి కిరణ్,జిల్లా కార్యదర్శి భూక్య భాగ్య,జిల్లా మీడియా కన్వీనర్ మునెందర్,కార్యాలయ కార్యదర్శి తిరుపతి, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు పోలసాని తిరుపతిరావు, బీజేవైఎం జిల్లా అధ్యక్షులు సయ్యద్ గాలిఫ్,అర్బన్ అధ్యక్షులు గీస సంపత్, రూరల్ అధ్యక్షులు పులిగుజ్జు రాజు నాయకులు సునీత,కొమరన్న, శివకృష్ణ తదితరులున్నారు.