బీజేపీ, బీఆర్‌ఎస్ విధానాలపై నాయిని తీవ్ర విమర్శలు

బీజేపీ, బీఆర్‌ఎస్ విధానాలపై తీవ్రంగా విమర్శించిన ఎమ్మెల్యే నాయిని

హన్మకొండ, నేటిధాత్రి:

 

 

హనుమకొండ డీసీసీ భవన్‌లో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఇనగాల వెంకట్రామ్ రెడ్డిఅధ్యక్షతన ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సమావేశంలో వర్ధన్నపేట ఎమ్మెల్యే కే.ఆర్. నాగరాజు,శాసన మండలి సభ్యులు బస్వరాజు సారయ్య కూడా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్ పథకంపై కక్షసాధింపు చర్యలకు పాల్పడడం తీవ్రంగా ఖండించదగ్గ విషయమన్నారు. పేదల కోసం రూపొందించి అమలు చేస్తున్న పథకాలను నిర్వీర్యం చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని స్పష్టంగా వ్యాఖ్యానించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ పథకం ద్వారా కోట్లాది కుటుంబాలు జీవనాధారం పొందుతున్నాయని, అలాంటి పథకాలను అడ్డుకోవడం పేదల పాలిట శాపంగా మారుతుందన్నారు.
పథకాల పేర్లు మార్చాలనే నెపంతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం బీజేపీ చేస్తోందని విమర్శించారు. అసలు సమస్య పరిష్కారం కాకుండా పేర్ల రాజకీయాలు చేయడం వల్ల ప్రజలకు తీవ్ర నష్టం జరుగుతోందని చెప్పారు. గ్రామాల్లో పనులు నిలిచిపోవడంతో కూలీలు, పేద కుటుంబాలు తీరని అన్యాయాన్ని ఎదుర్కొంటున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
దేశ స్వాతంత్ర్య పోరాటంలో బీజేపీ పాత్ర శూన్యమని, ఇప్పుడు కూడా దేశ అభివృద్ధికి ఉపయోగపడే కార్యక్రమాలను అడ్డుకోవడమే వారి విధానంగా మారిందన్నారు. ఇప్పటికే అమలులో ఉన్న పథకాలను తుంగలో తొక్కుతూ, అభివృద్ధిని అడ్డుకునే రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఆర్‌టీఏ యాక్ట్ వల్ల ప్రజలకు కలిగే ప్రయోజనాలు అందరికీ తెలుసని, అలాంటి చట్టాలను కూడా బలహీనపరచే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు.
బీజేపీతో పాటు బీఆర్‌ఎస్ పార్టీ ప్రజల పట్ల చేసిన ద్రోహాలను ప్రతి గ్రామంలో, ప్రతి వార్డులో ప్రజలకు వివరించాలని కాంగ్రెస్ నాయకులు కర్తవ్యంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో నిజంగా అభివృద్ధి జరిగితే, ఇతర రాష్ట్రాలతో పోల్చి చూపాలని ప్రశ్నించారు.
రాష్ట్ర విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకే రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు జరగాల్సి ఉందని, ఆ హామీల అమలుపై కేంద్రం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే పదేళ్లు గడిచినా మామునూరు విమానాశ్రయ ఏర్పాటుకు ఎందుకు చర్యలు లేవని ప్రశ్నించారు. హామీలు ఇచ్చి అమలు చేయకపోవడం కేంద్ర ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని అన్నారు.
ఈ కార్యక్రమంలో టీపీసీసీ ఉపాధ్యక్షులు బొద్దిరెడ్డి ప్రభాకర్ రెడ్డి,ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు,ఫ్లోర్ లీడర్ తోట వెంకటేశ్వర్లు,కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.

కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకొలి

కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకొలి

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

ఝరాసంగం మండల మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్‌) నుంచి మహాత్మా గాంధీ పేరు తొలగించడాన్ని నిరసిస్తూ ఫీల్డ్ అసిస్టెంట్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన మహా ధర్నాకు టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా టీపీసీసీ చీఫ్ మాట్లాడుతూ, ఉపాధి హామీ పథకం నుంచి గాంధీజీ పేరును తొలగించడం రాజ్యాంగ విలువలకు, ప్రజాస్వామ్యానికి విరుద్ధమన్నారు. గ్రామీణ పేదల జీవనాధారంగా నిలిచిన ఈ పథకానికి గాంధీజీ పేరు చరిత్రాత్మకంగా అనుసంధానమై ఉండాల్సిన అవసరం ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు కాంగ్రెస్ ప్రభుత్వం కార్మికులు, రైతులు, పేదల పక్షాన పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేస్తూ, ఫీల్డ్ అసిస్టెంట్ల హక్కులు, ఉపాధి భద్రత కోసం పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

నూతన చట్టాన్ని తక్షణమే కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలి…

నూతన చట్టాన్ని తక్షణమే కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలి

పేదల నడ్డి విరిచేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర

గ్రామీణ ఉపాధి హామీ పథకానికి మహాత్మా గాంధీ పేరు మార్చడం సిగ్గుచేటు

వికసిత్ భారత్ జి రామ్ జి బిల్లును రద్దు చేయాలి.

వామపక్ష పార్టీ ల డిమాండ్

కరీంనగర్, నేటిధాత్రి:

 

వామపక్ష పార్టీలఆధ్వర్యంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకాన్ని రద్దుచేసి పేదల పుట్టగొట్టే చట్టాన్ని నిరసిస్తూ గాంధీ రోడ్డులోని స్థానిక గాంధీ విగ్రహం వద్ద తట్టలు, పారలు చేతబుని నిరసన ధర్నా చేశారు. ఈకార్యక్రమాన్ని ఉద్దేశించి ఎఐఎఫ్బి రాష్ట్ర కన్వీనర్ అంబటి జోగిరెడ్డి, సిపిఎం జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి, సిపిఐ నగర కార్యదర్శి కసిరెడ్డి సురేందర్ రెడ్డి, సిపిఐఎంఎల్ మాస్ లైన్ జిల్లా నాయకులు జిందం ప్రసాద్ లు మాట్లాడుతూ స్వతంత్ర సమరయోధులు ఉప్పు సత్యాగ్రహ నేత, కుల మతాలకతీతంగా తన ఊపిరిపోయంత వరకు ప్రజల కోసమే పనిచేసిన మహానుభావులు అడుగుజాడల్లో నడవవలసిన రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఆయన ఆనవాల్లు లేకుండా చేస్తున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేయడానికి, నిధులు ఎగ్గొడ్డానికే కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్నిందని అందులో భాగంగానే ఆమహాత్ముని పేరు తొలగించి వికజిత్ భారత్ జి రామ్ జి కేంద్ర ప్రభుత్వం చట్టం చేసిందని, ఆమహాత్మా గాంధీ ఏంతప్పు చేశాడని పేరు మారుస్తున్నారనివారన్నారు.
గ్రామీణ ప్రాంతంలో ఉన్న ప్రజలంతా చేయడానికి పని లేక, తినడానికి తిండి లేక సొంత ఊర్లు ఖాళీ చేసి వలసలు వెళ్లే పరిస్థితి దాపరించిందని, అటువంటి పరిస్థితుల్లో ఉపాధి హామీ పథకం గ్రామీణ ప్రాంత కూలీలకు ఉపాధి దొరుకుతుంది అని సంతృప్తిపడేలోపే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలో రాగానే కూలీలకు పనులు లేకుండా పస్తులు ఉండే పరిస్థితికి కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తుందని, ఉపాధి హామీ పనికి వెళ్లే కూలీలకు పనిముట్ల రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలని కొత్త చట్టంలో పేర్కొనడం సిగ్గుచేటన్నారు. పాత చట్టంలో పనులు నిర్ణయించే అధికారం గ్రామ సభలకు ఉండేదని కొత్త చట్టంలో నేషనల్ రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్షన్ స్టాక్ పేరుతో కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తుందని తద్వారా గ్రామ ప్రజలకు ఉపయోగపడే పనులు కాకుండా కేంద్రం ఇష్టానుసారం పనులు కేటాయించే అవకాశం ఉందన్నారు. గత చట్టంలో కేంద్ర ప్రభుత్వం తోంభై శాతం నిధులు ఇస్తే కొత్త చట్టంలో కేవలం అరవై శాతం మాత్రమే నిధులు ఇస్తుందని రాష్ట్ర ప్రభుత్వంపై అదనంగా ముప్పై శాతం నిధుల భారం కానుందన్నారు. ఇప్పటికే ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించకుండా మొండి చేయి చూపిస్తుందన్నారు.
ఓడదాటక ముందు ఓడ మల్లన్న ఓడ దాటిన తర్వాత బోడి మల్లన్న చందంగా ప్రభుత్వం తయారయిందని కొత్త ఉపాధి పరిస్థితి దేవుడేరుగని, కూలీలు ఉపాధి ఎగ్గొట్టేందుకే పేరు మార్పని, నిధులు నిలుపుదల చేయుటకు ఈకుట్ర అని గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కూలీలను బతకనివ్వండని, అర్ధాకలికి గురి చేయొద్దని వారు పేర్కొన్నారు. ఉపాధి హామీ చట్టం తేవడం కోసం 2004 సంవత్సరంలో అప్పటి యూపీఏ ప్రభుత్వంపై వామపక్ష పార్టీల ఎంపీలు ఒత్తిడి తీసుకువచ్చి మన్మోహన్ ప్రధానిగా ఉన్న సమయంలో తీసుకురావడం జరిగిందని బిజెపి ప్రభుత్వం పేరు మార్చిన జిరాంజీ ఆనాడు పార్లమెంటులో ఈచట్టాన్ని వ్యతిరేకించాడని వారు తెలిపారు.
ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వo తక్షణమే స్పందించి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని యధావిధిగా కొనసాగించాలని, కేంద్ర ప్రభుత్వమే నిధులు మంజూరు చేయాలని లేనిపక్షంలో పెద్ద ఎత్తున వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. ఈకార్యక్రమంలో వామపక్ష పార్టీల నేతలు గుడి కందుల సత్యం,గిట్ల ముకుందరెడ్డి, పిట్టల సమ్మయ్య, పైడిపల్లి రాజు,కటిక రెడ్డి బుచ్చన్న యాదవ్, సత్యరావు, రాజశేఖర్, మల్లేశం రాజేశం,అజయ్ గజ్జల శ్రీకాంత్, జి.తిరుపతి నాయక్, గామినేని సత్యం, బాకం అంజయ్య, చెంచల మురళి, పుల్లెల మల్లయ్య, రాయి కంటి శ్రీనివాస్, రమేష్, శ్రీనివాస్ రెడ్డి, వినయ్, శ్రీనివాస్,రాకేష్, సాయికుమార్, ఆకాష్ తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version