బీజేపీ, బీఆర్‌ఎస్ విధానాలపై నాయిని తీవ్ర విమర్శలు

బీజేపీ, బీఆర్‌ఎస్ విధానాలపై తీవ్రంగా విమర్శించిన ఎమ్మెల్యే నాయిని

హన్మకొండ, నేటిధాత్రి:

 

 

హనుమకొండ డీసీసీ భవన్‌లో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఇనగాల వెంకట్రామ్ రెడ్డిఅధ్యక్షతన ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సమావేశంలో వర్ధన్నపేట ఎమ్మెల్యే కే.ఆర్. నాగరాజు,శాసన మండలి సభ్యులు బస్వరాజు సారయ్య కూడా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్ పథకంపై కక్షసాధింపు చర్యలకు పాల్పడడం తీవ్రంగా ఖండించదగ్గ విషయమన్నారు. పేదల కోసం రూపొందించి అమలు చేస్తున్న పథకాలను నిర్వీర్యం చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని స్పష్టంగా వ్యాఖ్యానించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ పథకం ద్వారా కోట్లాది కుటుంబాలు జీవనాధారం పొందుతున్నాయని, అలాంటి పథకాలను అడ్డుకోవడం పేదల పాలిట శాపంగా మారుతుందన్నారు.
పథకాల పేర్లు మార్చాలనే నెపంతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం బీజేపీ చేస్తోందని విమర్శించారు. అసలు సమస్య పరిష్కారం కాకుండా పేర్ల రాజకీయాలు చేయడం వల్ల ప్రజలకు తీవ్ర నష్టం జరుగుతోందని చెప్పారు. గ్రామాల్లో పనులు నిలిచిపోవడంతో కూలీలు, పేద కుటుంబాలు తీరని అన్యాయాన్ని ఎదుర్కొంటున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
దేశ స్వాతంత్ర్య పోరాటంలో బీజేపీ పాత్ర శూన్యమని, ఇప్పుడు కూడా దేశ అభివృద్ధికి ఉపయోగపడే కార్యక్రమాలను అడ్డుకోవడమే వారి విధానంగా మారిందన్నారు. ఇప్పటికే అమలులో ఉన్న పథకాలను తుంగలో తొక్కుతూ, అభివృద్ధిని అడ్డుకునే రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఆర్‌టీఏ యాక్ట్ వల్ల ప్రజలకు కలిగే ప్రయోజనాలు అందరికీ తెలుసని, అలాంటి చట్టాలను కూడా బలహీనపరచే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు.
బీజేపీతో పాటు బీఆర్‌ఎస్ పార్టీ ప్రజల పట్ల చేసిన ద్రోహాలను ప్రతి గ్రామంలో, ప్రతి వార్డులో ప్రజలకు వివరించాలని కాంగ్రెస్ నాయకులు కర్తవ్యంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో నిజంగా అభివృద్ధి జరిగితే, ఇతర రాష్ట్రాలతో పోల్చి చూపాలని ప్రశ్నించారు.
రాష్ట్ర విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకే రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు జరగాల్సి ఉందని, ఆ హామీల అమలుపై కేంద్రం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే పదేళ్లు గడిచినా మామునూరు విమానాశ్రయ ఏర్పాటుకు ఎందుకు చర్యలు లేవని ప్రశ్నించారు. హామీలు ఇచ్చి అమలు చేయకపోవడం కేంద్ర ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని అన్నారు.
ఈ కార్యక్రమంలో టీపీసీసీ ఉపాధ్యక్షులు బొద్దిరెడ్డి ప్రభాకర్ రెడ్డి,ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు,ఫ్లోర్ లీడర్ తోట వెంకటేశ్వర్లు,కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version