బీసీ రిజర్వేషన్‌ అమలు కాకుంటే మరో తెలంగాణ ఉద్యమమే…

బీసీ రిజర్వేషన్‌ అమలు కాకుంటే మరో తెలంగాణ ఉద్యమమే…
– పూలే…అంబేద్కర్‌ను అర్థం చేసుకుంటేనే రాజ్యాధికారం సాధ్యం
– బీసీ రిజర్వేషన్‌ అమలు కాకుండా కుట్రలు జరుగుతున్నయ్‌
– రిజర్వేషన్‌ ఎవరు ఇస్తరో ఎవరుతీసుకుంటరో అలోచించాలే
– కాంగ్రెస్‌…బీజేపీ పార్టీల మద్దతు తెలుపడం సంతోషకరమే
– మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్‌

మంథని :- నేటి ధాత్రి

 

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీ చిత్తశుద్దితో బీసీ రిజర్వేషన్‌లు తీసుకువచ్చి బీసీల చేతుల్లో పెట్టాలని లేకుంటే మరో తెలంగాణ ఉద్యమంలా మారుతుందని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్‌ అన్నారు. 42శాతం రిజర్వేషన్‌ అమలు చేయాలనే డిమాండ్‌తో బీసీ సంఘాల జేఏసీ పిలుపుమేరకు మంథనిలో చేపట్టిన బంద్‌లో ఆయన పాల్గొన్నారు. ముందుగా మహాత్మా జ్యోతిరావుపూలేకు నివాళులు అర్పించి ప్రధాన చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. ప్రధాన చౌరస్తాలో మానవహారంగా ఏర్పడి నిరసన వ్యక్తం చేశారు, అనంతరం వంటావార్పు కార్యక్రమంలో పాల్గొన్న ఆయన బంద్‌లో పాల్గొన్న వారితో కలిసి సహపంక్తి బోజనం చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఆనాడు మేమెంతో మాకంత అని మహాత్మాజ్యోతీరావు పూలే సంకల్పించారని, పూలేను అర్థం చేసుకున్న డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ దేశానికి గొప్ప రాజ్యాంగం అందించారన్నారు. అయితే పూలే, అంబేద్కర్‌ను అర్థం చేసుకోకపోవడం మూలంగానే అనేక అనర్థాలు జరుగుతున్నాయని, వారిని అర్థం చేసుకున్న నాడే రాజ్యాధికారం సాధ్యమవుతుందన్నారు. బీసీ రిజర్వేషన్‌ కోసం బీసీ సంఘాల జేఏసీ పిలుపుమేరకు అన్ని రాజకీయ పార్టీలైన కాంగ్రెస్‌, బీజేపీ నాయకులు రోడ్డు మీదకు వచ్చి బంద్‌ మద్దతు తెలుపడం సంతోషకరమన్నారు. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో పాల్గొనకపోతే తెలంగాణ ద్రోహులుగా మిగిలిపోతామని ప్రతి ఒక్కరు ఉద్యమంలో ముందుకు వచ్చారని, అదే తరహాలో ఈనాడు బంద్‌కు సహకారిస్తున్నారని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. కానీ అసలు బీసీ రిజర్వేషన్‌లు ఇచ్చే వారు ఎవరు తీసుకునే వారు ఎవరనే అయోమయం నెలకొనెలా అధికార పార్టీలు పాల్గొంటున్నాయన్నారు. బీసీ రిజర్వేషన్‌లు కేంద్రం ఇస్తుందా రాష్ట్రం ఇస్తుందా అని ఆలోచించకుండా చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన అన్నారు. బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీల మద్దతుపై బీసీ సమాజం సూక్ష్మంగా ఆలోచన చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఒకరిపై ఒకరు నెపం మోపి బీసీలు ఒక్కటి కాలేరనే ఆలోచనతో బీసీవర్గాల్లో చిచ్చు పెట్టి రిజర్వేషన్‌లు ఆపేందుకు కుట్రలు జరుగుతున్నాయనే అనుమానం వ్యక్తం చేశారు. అందరూ బాపనోళ్లు అయితే రొయ్యల మొలతాడు ఏడ పోయినట్లు అన్న చందంగా అన్ని పార్టీల నాయకులు బీసీ బంద్‌లో పాల్గొంటే అసలు రిజర్వేషన్‌లు ఎవరు అమలు చేయాలనే ఆలోచన చేయాల్సిన అవసరం ఉందన్నారు. బీసీ సంఘాల ఏర్పడిన జేఏసీ ఎవరో ఒకరిపై గురి పెట్టకపోతే అయోమయపరిస్థితులకు దారి తీస్తుందని ఆయన వాపోయారు. తెలంగాణ ఉద్యమంలో ఎలాగైతే ప్రభుత్వాల మెడలు వంచి తెలంగాణ సాధించుకున్నామో అదే రీతిలో బీసీ రిజర్వేషన్‌లు సాధించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. రాహుల్‌ గాంధీ రోడ్లపై కాకుండా పార్లమెంట్‌లో గళమెత్తాలని, అలాగే ప్రధాని మోడీ బీసీల గురించి ఆలోచన చేయాలన్నారు. వీళ్లిద్దరు కలిసి మాట్లాడుకుంటే బీసీ రిజర్వేషన్‌లు సునాయమవుతాయనే అభిప్రాయం వ్యక్తం చేశారు. బీసీ సంఘాల పిలుపుమేరకు నియోజకవర్గంలో బంద్‌కు సహకరించిన వ్యాపార సంస్థలు, అన్ని రాజకీయ పార్టీ ల నాయకులు, ప్రజలు, మేధావులకు ఆయన ఈ సందర్బంగా ధన్యవాదాలు తెలిపారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version