క్యాన్సర్‌పై వారికి అవగాహన ఉండాల్సిందే: బోండా ఉమ
మహిళలు, విద్యార్థినిలకు క్యాన్సర్‌పై అవగాహన ఉండాలని బోండా ఉమ సూచించారు. ఈ క్యాన్సర్ అవగాహన కార్యక్రమాలు కేవలం సమాచారాన్ని అందించడమే కాకుండా ప్రజలలో భయాన్ని తొలగిస్తాయన్నారు.
విజయవాడ, అక్టోబర్ 31: ఇన్నర్ వీల్ ఇంటర్నేషనల్ క్లబ్ ఆధ్వర్యంలో క్యాన్సర్‌పై అవగాహన కల్పిస్తూ నిర్వహించిన ర్యాలీలో ఎమ్మెల్యే బోండా ఉమా మహేశ్వర్ రావు (MLA Bonda Uma Maheshwar Rao) పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నేడు ప్రపంచం మొత్తం క్యాన్సర్‌ని జయించటం కోసం పోరాడుతోందన్నారు. క్యాన్సర్‌ని జయించాలంటే, మొట్టమొదటి పరిస్థితుల్లోనే దాన్ని డయాగ్నెస్ చేస్తే చాలా వరకు క్యూరైపోయే పరిస్థితి ఉంటుందని చెప్పారు. ఇవాళ లేటెస్ట్ టెక్నాలజీ, లేటెస్ట్ ట్రీట్‌మెంట్‌తో అనేక క్యాన్సర్లకి మందులు, వ్యాక్సిన్ కూడా వచ్చాయని.. దీన్ని సామాన్య ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఉచితంగా బెస్ట్ క్యాన్సర్‌తో పాటు సర్వైవల్ క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్లు నిర్వహిస్తున్నారని వెల్లడించారు.
క్యాన్సర్ రహిత ఆంధ్రప్రదేశ్‌ను చూడాలన్నదే సీఎం చంద్రబాబు (CM Chandrababu) కల అని స్పష్టం చేశారు. మహిళలు, విద్యార్థినిలకు క్యాన్సర్‌పై అవగాహన ఉండాలని సూచించారు. ఈ క్యాన్సర్ అవగాహన కార్యక్రమాలు కేవలం సమాచారాన్ని అందించడమే కాకుండా ప్రజలలో భయాన్ని తొలగిస్తాయన్నారు. ఇన్నర్‌విల్ క్లబ్ వంటి సంస్థలు ఈ దిశగా చేస్తున్న కృషి అభినందనీయమని కొనియాడారు. వారు కేవలం అవగాహన కార్యక్రమాలు నిర్వహించడమే కాకుండా.. ఉచిత స్క్రీనింగ్ టెస్ట్‌లను కూడా అందిస్తున్నారని తెలియజేశారు.
ఇది ఆర్థికంగా వెనుకబడిన వర్గాల ప్రజలకు ఎంతో సహాయపడుతుందన్నారు. ఆడపిల్లలు, యువత తమ ఆరోగ్యం పట్ల మరింత శ్రద్ధ వహించాలని సూచనలు చేశారు. క్యాన్సర్ లక్షణాలను గుర్తించడం, క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం.. ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవడం వంటివి చాలా ముఖ్యమన్నారు. డాక్టర్ల సలహాలు, సూచనలు పాటించడం ద్వారా అనేక వ్యాధులను నివారించవచ్చని ఎమ్మెల్యే బోండా ఉమ పేర్కొన్నారు.
