న్యాల్కల్ లో దేశభక్తితో హోలీ సంబరాలు…

న్యాల్కల్ లో దేశభక్తితో హోలీ సంబరాలు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

న్యాల్కల్ మండల కేంద్రంలో హోలీ వేడుకలు అంబరాన్నంటాయి. స్థానిక హనుమాన్ మందిరం వద్ద యువతతో పాటు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని రంగులు చల్లుకుంటూ ఆనందంగా పండుగను జరుపుకున్నారు. ఈసారి సినీ గీతాలకు బదులుగా యువత దేశభక్తి పాటలతో వేడుకలను నిర్వహించి వినూత్న సందేశం ఇచ్చారు. గ్రామీణ వాతావరణంలో సంప్రదాయబద్ధంగా, ఐక్యంగా జరిగిన ఈ సంబరాలు గ్రామీణ సంస్కృతికి, జాతీయతకు ప్రతీకగా నిలిచాయి. న్యాల్కల్ గ్రామ సంస్కృతి వైభవాన్ని మరోసారి చాటిచెప్పాయి.

దిగ్వల్ లో హోలీ సంబరాలు: రంగుల పండుగతో యువత ఉత్సాహం

సంగారెడ్డి జిల్లా, జహీరాబాద్ నియోజకవర్గం పరిధిలోని కోహిర్ మండలం దిగ్వల్ గ్రామంలో హోలీ సంబరాలు అంబరాన్నంటాయి. వసంత కాలపు తొలి వేడుకగా, చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా గ్రామ యువత ఉత్సాహంగా రంగులు చల్లుకున్నారు. ధనిక, పేద తారతమ్యం మరచి, రాధాకృష్ణుల ప్రేమ గీతాల నడుమ ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. చలికి వీడ్కోలు పలుకుతూ హోళికా దహన కాంతులతో ప్రారంభమైన ఈ వేడుకలు గ్రామంలో ప్రత్యేక సందడిని నింపాయి. ఈ పండుగను పురస్కరించుకుని గ్రామస్తులు ఆనందోత్సాహాలతో పాల్గొన్నారు.

గొట్టిగారిపల్లి గ్రామ పంచాయతీలో హోలీ వేడుకలు,..

గొట్టిగారిపల్లి గ్రామ పంచాయతీలో హోలీ వేడుకలు,

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ నియోజకవర్గ పరిధిలోని గొట్టిగారిపల్లి గ్రామ పంచాయతీలో హోలీ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగిందని గ్రామ సర్పంచ్ తెలిపారు.మంగళవారం రాత్రి గ్రామ ప్రజలు పెద్దలందరు కలిసి సర్పంచ్ విశ్వనాధ్ రాథోడ్ ఆధ్వర్యంలో గ్రామ ప్రధాన కూడలిలో ఒలికను దహనం చేసి ఒకరికొకరు రంగులను పూసుకొని ఆనందోత్సాహాలతో సంబరాలు చేసుకొన్నామని తెలిపారు.ఈ సందర్బంగా సర్పంచ్ విశ్వనాధ్ రాథోడ్ మాట్లాడుతు చెడు పై గెలపే హోలీ పండుగ అని గ్రామంలోని ప్రజలందరు అందరూ ఒక్కటై, స్నేహభావంతో, సోదరభావంతో ఈ పండుగను జరుపుకోవడం ఎంతో సంతోషకరం అని అన్నారు.
మన గ్రామం ఎల్లప్పుడూ సుఖశాంతులతో, సుభిక్షంతో ఉండాలని కోరుకుంటూ హోలీ శుభాకాంక్షలు తెలిపారు.

చెడుపై మంచికి జయం..భారతీయ సంస్కృతికి సజీవ ప్రతిబింబం హోలీ…

చెడుపై మంచికి జయం..భారతీయ సంస్కృతికి సజీవ ప్రతిబింబం హోలీ

అంగన్వాడీ టీచర్ ఎల్దండి వెన్నెల
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి

భారతీయ సంస్కృతిలో పండుగలు కేవలం సంబరాలకు మాత్రమే పరిమితం కావని, అవి మన ఆత్మను, ఆచారాలను, ఆలోచనలను తీర్చిదిద్దే ఆధ్యాత్మిక పాఠాలుగా నిలుస్తాయని అంగన్వాడీ టీచర్ ఎల్దండి వెన్నెల అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలోని అంగన్వాడీ కేంద్రాలలో మంగళవారం అంగన్వాడీ టీచర్లు పిల్లలతో హోలీ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మొగుళ్లపల్లి మండల కేంద్రంలోని 4వ అంగన్వాడీ సెంటర్ లో నిర్వహించిన హోలీ వేడుకలను ఉద్దేశించి అంగన్వాడీ టీచర్ ఎల్దండి వెన్నెల మాట్లాడారు. హిందువులు జరుపుకునే మహోన్నత పండుగల్లో ‘హోలీ’ ఒకటని, శిశిర ఋతువుకు వీడ్కోలు పలుకుతూ..వసంతాన్ని ఆహ్వానించే ఈ రంగుల పండుగ, భారతీయ జీవన శైలిలో ఆనందం, ఐక్యత, భక్తి అనే విలువలను సమగ్రంగా ప్రతిబింబిస్తుందన్నారు. హోలీ పండుగకు ఆధారం ప్రహ్లాద-హిరణ్యకశిపుడు-హోలిక పురాణ గాథ అని తెలిపారు. అహంకారానికి ప్రతీకగా నిలిచిన హిరణ్యకశిపుడి దురహంకారాన్ని, భక్తి, శక్తి ఎలా జయించిందో ఈ కథ తెలియజేస్తుందన్నారు. హోలిక దహనం ద్వారా చెడుపై మంచికి జయమనే సందేశం తరతరాలకు అందుతోందన్నారు. ఈ గాథ భక్తి పరాక్రమాన్ని మాత్రమే కాకుండా, అధికార దుర్వినియోగం ఎంత శక్తివంతమైనదైనా సత్యం ముందు నిలబడలేదనే నైతిక బోధనను కూడా ఇస్తుందన్నారు. హోలీ అంటే రంగులని, కానీ ఆ రంగుల వెనుక ప్రకృతి సోయగం దాగి ఉందని, పసుపు పూలు, గులాబీలు, చెర్రీ పుష్పాలు, నీలి ఆకాశం ప్రకృతి ఇచ్చిన ఈ వర్ణాలను మనం పరస్పరం పంచుకోవడం అంటే ప్రకృతితో మన అనుబంధాన్ని పునరుద్ఘాటించడమని, గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ సహజ వనరులతో తయారైన రంగులనే వినియోగించడం పర్యావరణ పరిరక్షణకు, ఆరోగ్య రక్షణకు దోహదం చేస్తోందన్నారు. హోలీకి కులం, మతం, ప్రాంతం అనే భేదాలు లేవని, ఉత్తర భారతదేశంలో ఘనంగా జరుపుకునే ఈ పండుగ ఇప్పుడు దేశవ్యాప్తంగా విస్తరించిందని, ఇది వైవిధ్యంలోని ఏకత్వాన్ని ప్రతిబింబించే పండుగగా నిలుస్తోందన్నారు. నేటి కాలంలో సామాజిక మాధ్యమాల కారణంగా విభేదాలు పెరుగుతున్న సందర్భంలో హోలీ మనకు ఒక గొప్ప పాఠాన్ని నేర్పుతుందన్నారు. రంగులు కలిసినప్పుడే అందం పెరుగుతుందని, మనుషులు కలిసినప్పుడే దేశం బలపడుతుందన్నారు. నాగరీకరణ, వేగవంతమైన జీవనశైలి మధ్య మనిషి ఒంటరితనాన్ని అనుభవిస్తున్నాడని, అలాంటి పరిస్థితుల్లో హోలీ ఒక సామాజిక థెరపీలా పనిచేస్తుందన్నారు. “హ్యాపీ హోలీ” అంటూ పరస్పరం శుభాకాంక్షలు చెప్పుకోవడం, చిన్న, చిన్న విభేదాలను మరిచి క్షమాపణలు కోరుకోవడం, ఇవన్నీ మానసిక ఆరోగ్యానికి దోహదం చేస్తాయన్నారు. అయితే రసాయన రంగుల అధిక వినియోగం, నీటి వృథా, అసభ్య ప్రవర్తన వంటి ప్రతికూల అంశాలు హోలీ అసలైన ఆత్మను దెబ్బతీస్తున్నాయన్నారు. అందుకే సహజ రంగులతో, సుస్థిర విధానాలతో హోలీని జరుపుకోవాలన్నారు. భారతదేశం వైవిధ్యానికి ప్రతీకని, భాషలు, సంప్రదాయాలు, వేషాలు భిన్నమైనా మనం ఒకటే అన్న భావనను బలపరిచే పండుగ హోలీ అని, ఇది కేవలం రంగుల సంబరం కాదని, భక్తి, భ్రాతృత్వం, భవిష్యత్తుపై ఆశ అనే మూడు విలువల సమ్మేళనమన్నారు. ఈ హోలీ మనకు కేవలం ఆనందాన్నే కాదు, ఆలోచననూ అందించాలన్నారు. చెడును దహనం చేసి మంచిని ఆహ్వానిద్దామని, సహజ రంగులతో ప్రకృతిని కాపాడుదామని, విభేదాలను మరిచి హృదయాలను కలుపుదామని, ఎందుకంటే హోలీ అంటే కేవలం రంగుల ఆట కాదు..మనసుల కలయిక అని, హోలీ అంటే సంబరం మాత్రమే కాదు-సంస్కృతి సజీవతని, రంగుల పండుగ మన దేశానికి రంగుల భవిష్యత్తును అందించాలని ఆమె ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆయా అంగన్వాడీ టీచర్లు మోటే రజిత, బత్తిని లావణ్య తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version