చిరంజీవి అభిమాని కుటుంబానికి వెలిచాల రాజేందర్ రావు సాయం అందజేత
కరీంనగర్, నేటిధాత్రి:
మెగా స్టార్ చిరంజీవి అభిమాని కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు శుక్రవారం కరీంనగర్ జిల్లా కొత్తపెల్లి(హ)లోని వెలిచాల ప్రజా కార్యాలయంలో ఇరవై వేల చెక్కును అందజేశారు. కమలాపుర్ మండలం శనిగరం గ్రామానికి చెందిన చెరిపెల్లి కిరణ్ కుమార్ గత ఇరవై సంవత్సరాల నుంచి చిరంజీవి అభిమానిగా ఉంటూ అనేక సామాజిక సేవ కార్యక్రమాలను నిర్వహించారు. మూడు సంవత్సరాల క్రితం కిరణ్ కుమార్ మృతి చెందాడు. కిరణ్ కుమార్కు భార్య ఇద్దరు కూతుర్లు ఉన్నారు. నిరుపేద కుటుంబం కావడంతో కిరణ్ కుమార్ భార్య, పిల్లలు ఆర్థిక ఇబ్బందులు పడుతున్న విషయం మెగాస్టార్ చిరంజీవి దృష్టికి వచ్చింది. దీంతో చిరంజీవి సూచనల మేరకు చిరు స్నేహితుడు బస్వారాజ్ శ్రీనివాస్ భారత సహకార సేవా ఫోరం ద్వారా కిరణ్ కుమార్ పిల్లల చదువుల కోసం ప్రతి ఏటా ఇరవై వేల ఆర్థిక సాయం అందిస్తున్నారు. పిల్లలు చదువు పదవ తరగతి పూర్తయ్యే వరకు ఈసాయం అందజేయనున్నారు. ఈనేపథ్యంలో బస్వారాజ్ శ్రీనివాస్ ఆర్థిక సాయం కింద పంపించిన ఇరవై వేల రూపాయల చెక్కును కిరణ్ కుమార్ భార్య చెరిపెల్లి స్వప్నకు కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు అందజేశారు. రాబోయే రోజుల్లో కిరణ్ కుమార్ కుటుంబానికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని రాజేందర్ రావు హామీ ఇచ్చారు. ఈకార్యక్రమంలో చిరంజీవి యువత తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు వేల్పుల వెంకటేష్, కోడూరి హరికృష్ణ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.