ఓట్ల కోసం కులసంఘాలను మోసం చేస్తున్న మంథని ఎమ్మెల్యే…
– కుల సంఘ భవన నిర్మాణాల్లో కుల వివక్ష చూపించిండు
– మంథని దాటి రాష్ట్రాన్ని మోసం చేస్తున్న దుద్దిళ్ల శ్రీధర్
– ప్రజల్లో చైతన్యం వచ్చే వరకు పోరాటం చేస్తూనే ఉంటా
– మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్
మంథని :- నేటి ధాత్రి
ఎన్నికలు వస్తేనే అభివృద్ది పనులు గుర్తుకు వచ్చే మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ ఈసారి ఓట్ల కోసం కుల సంఘాలను మోసం చేస్తున్నాడని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ అన్నారు. శనివారం మంథని పట్టణంలోని రాజగృహాలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత అక్టోబర్ మాసంలో కుల సంఘాలకు భవనాలు మంజూరు చేశానంటూ పాలాభిషేకాలు చేయించుకున్న మంథని ఎమ్మెల్యే దుద్దిల్ల శ్రీధర్ ఆ భవనాలకు జనవరి 12న శంఖుస్థాపనలు చేశారని అన్నారు. అయితే మంథని పట్టణంలోని పోచమ్మ గుడి వద్ద మేర, పూసల, స్వర్ణకార, కుమ్మరి, నాయిబ్రాహ్మణ కుల సంఘాలకు ఒకే చోట భవన నిర్మాణాల కోసం శిలాఫలకాలు వేసి శంఖుస్థాపన చేశారని, అయితే ఆ ప్రాంతమంతా వాగు ఒడ్డున ఉందని, ముంపుకు గురయ్యే ప్రాంతంలో కులసంఘ భవనాలు నిర్మించడం ఏంటని ప్రశ్నించారు. బఫర్ జోన్, నాలా నద్దీ ప్రాంతాల్లో నిర్మించిన నిర్మాణాలను తొలగిస్తున్న క్రమంలో ఇక్కడ భవనాలు నిర్మిస్తామనడంలో అంతర్యం ఏమిటని ఆయన ప్రశ్నించారు. సాధారణంగా టెండర్లు పూర్తయి సైట్ ఆధీనంలోకి వచ్చి కాంట్రాక్ట్ చేతికి సైట్ అందిన తర్వాతనే శిలాఫలకాలు వేసి శంఖుస్థాపనలు చేస్తుంటారని, ఒక్కోసారి కాంట్రాక్ట్ వచ్చి సైట్ ఆదీనంలోకి రాకపోసే క్యాన్సల్ అయ్యే ప్రమాదం కూడా ఉంటుందని ఆయన వివరించారు. కానీ ఇక్కడ ఏమీ లేకుండానే కేవలం టెండర్లు పిలిచి శంఖుస్థాపనలు చేసి కుల సంఘాలను మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ మోసం చేశాడని అన్నారు. అంటే వాగు ఒడ్డున ఉన్న కులసంఘా భవనాలన్నీ వాగులో కొట్టుకుపోవాలన్నదే ఆయన ఆలోచననా అని ప్రశ్నించారు. అంతేకాకుండా ఈ కులసంఘ భవనాలు గ్రామస్థాయిలోనా లేక మండల స్థాయిలోనా నియోజకవర్గ స్థాయిలోనా అనేది ఏదీ చెప్పడం లేదని, స్పష్టత లేకుండా కుల సంఘాలకు శిలా ఫలకాలు వేసి ఆ సంఘాల్లో లొల్లి పెట్టించడమే మంథని ఎమ్మెల్యే ఆలోచన అని ఆయన అన్నారు. పోచమ్మగుడి ప్రాంతంలో భవనాలు నిర్మించాలంటే ముందుగా వాగుకు సీసీవాల్స్ కట్టి రక్షణ ఉందని తేలిన తర్వాతనే శంఖుస్థాపనలు చేయాల్సి ఉండగా ఆ దిశగా చేయలేదన్నారు. ఓట్లు వస్తనే ఇవన్నీ మంథని ఎమ్మెల్యేకు గుర్తుకు వస్తాయని, రెండేళ్ల కాలంలో కులసంఘ భవనాలు ఎందుకు గుర్తుకు రాలేదని ఆయన ప్రశ్నించారు. కేవలం ఓట్లు మాత్రమే దుద్దిళ్ల కుటుంబానికి కావాలని, ప్రజలపై ఎలాంటి చిత్తశుద్ది లేదని తేలిందన్నారు. అంతేకాకుండా బీద కులాలన్నింటిని ఊరి బయటపడేసి వాళ్లకు కావాల్సిన కుల సంఘాలకు మాత్రం మంథనిలో చోటు ఇచ్చారని, అంటే ఇక్కడ కులవివక్ష చూపినట్లే కదా అని అన్నారు. కాపు కుల సంఘానికి కూచిరాజ్‌పల్లి వద్ద కేటాయింపు చేశారని ఆయన వివరించారు. కులాలు లేవని అంటూనే వివక్ష చూపిస్తున్నాడని ఆయన అన్నారు. ఇప్పటికే 420హమీల చైర్మన్‌గా మంథని నియోజకవర్గాన్ని దాటి రాష్ట్రాన్ని మోసం చేస్తున్నాడని, రాబోయే రోజుల్లో రాహుల్ గాంధీ పక్కన చేరి రాష్ట్రం దాటి దేశాన్ని సైతం మోసం చేస్తాడని ఆయన విమర్శించారు. శిలాఫలకాలు వేసినవన్నీ కులసంఘాల భవనాల కోసం కాదని అవన్నీ ఓట్ల సంఘ భవనాలని ఆయన ఎద్దేవా చేశారు. సమాజం మేల్కొనే వరకు ప్రజలను అప్రమత్తం చేయడంలో అలసత్వం వహించకుండా నా పాత్రను పోషిస్తానని ఆయన ఈసందర్బంగా స్పష్టం చేశారు. రాష్ట్ర ఖజానాలో పైసాలేవని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఓవైపు మొత్తుకుంటుంటే నగర అభివృద్ది సంస్థ పేరిట నిధులు ఎలా కేటాయిస్తారని ఆయన ప్రశ్నించారు. ఇప్పటికే బిల్లులు రాక ఎంతో మంది కాంట్రాక్టర్‌లు పనులు మధ్యలోనే ఆపేస్తున్నారని ఆయన వివరించారు,. ఇప్పటికైనా కుల సంఘాల నాయకులు మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ మాటలకు మోసపోవద్దని, ఈనాడు శిలాఫలకాలు వేసి మున్సిపల్ ఎన్నికల పూర్తయ్యాక మిమ్మల్ని పట్టించుకోడని, మళ్లీ ఎన్నికలు వచ్చాకనే మరోరూపంలో వచ్చి మభ్యపెట్టే ప్రయత్నం చేస్తాడని తెలిపారు. మోసాలకు మారుపేరు అబద్దాలకు నిలువెత్తు సాక్ష్యం మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ అని ఆదారాలతో సహ ఈ సమాజం ముందు చూపుతున్నానని, మనం ఎప్పటి వరకు చైతన్యవంతులం కామో అప్పటి వరకు ఓట్ల కోసం మోసం చేస్తూనే ఉంటాడని ఆయన ఈ సందర్బంగా స్పష్టం చేశారు.
