సరస్వతి అంత్య పుష్కరాల పనులు వేగవంతంగా చేయాలి
జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, జిల్లా ఎస్పీ
కాళేశ్వరం వద్ద మే 21 నుండి జూన్ 1 వరకు నిర్వహించనున్న సరస్వతి అంత్య పుష్కరాల ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్‌తో కలిసి సోమవారం పరిశీలించారు.
ఈ సందర్భంగా ప్రధాన ఘాట్‌ను పరిశీలించిన కలెక్టర్ భక్తుల సౌకర్యార్థం గోదావరి నదిలో క్వయర్ మ్యాట్ ఏర్పాటు చేయాలని, పారిశుద్ధ్య పనులను వేగవంతం చేసి పరిశుభ్రం చేయాలని ఆదేశించారు. భక్తులు సమాచారం తెలుసుకునేలా తగిన సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు.
అనంతరం హెలిప్యాడ్‌ను పరిశీలించి, హెలిప్యాడ్ చుట్టూ బ్యారికేడ్లు ఏర్పాటు చేయడం, నీరు చల్లడం, ప్రధాన ఘాట్ నుండి సరస్వతి ఘాట్ వరకు ఏర్పాటు చేసిన తాత్కాలిక రహదారిపై నిరంతరం నీటిని చల్లుతూ ఉండాలని ఆదేశించారు. అలాగే హెలిప్యాడ్ వద్ద పెయింటింగ్, రోడ్డు మరమ్మతులు త్వరగా పూర్తి చేయాలని సూచించారు.
తరువాత సరస్వతి ఘాట్‌ను పరిశీలించిన కలెక్టర్ భక్తులు బట్టలు మార్చుకునే గదులు, షవర్ ట్యాప్స్ వంటి సదుపాయాలను పరిశీలించారు. గోదావరి నదిలో నీటి మట్టాన్ని పరిశీలించి, భద్రతా చర్యలల్లో భక్తులు నదిలోకి వెళ్లకుండా ప్రతి 50 మీటర్లకు బ్యారికేడ్లు ఏర్పాటు చేసి, గజ ఈతగాళ్లను నియమించాలని సూచించారు.
ఘాట్ మెట్లపై వేసిన అచ్చుల డిజైన్లకు రంగులు వేయాలని, సరస్వతి ఘాట్ వద్ద ఏర్పాటు చేస్తున్న సదుపాయాలను వేగంగా పూర్తి చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. అలాగే స్టాల్స్ ఏర్పాటు చేయుచున్న ప్రాంతాన్ని, టెంట్ సిటీ ప్రాంతాన్ని కూడా పరిశీలించారు.
మ్యూజియాన్ని పరిశీలించిన కలెక్టర్ సమయం తక్కువగా ఉన్నందున ముఖ్యమైన పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ప్రతి విగ్రహం వద్ద పూర్తి సమాచారాన్ని ప్రదర్శించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి, ఆర్డిఓ లు హరికృష్ణ, రవీందర్, ఇరిగేషన్, ఆర్ అండ్ బి, పంచాయతి రాజ్, విద్యుత్తు, పంచాయతి రాజ్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.
