శబాష్‌ రేవంత్‌!

డైనమిక్‌ సిఎం అని మహిళా పోలీసుల కితాబు!

-ఖాకీచకులకు హూస్టింగే కరెక్ట్‌!

-తప్పు చేయాలంటే పోలీసు కూడా భయపడాలి.

-ఏ తప్పు చేసినా ఉద్యోగం ఊడుతుందనే భయముండాలి.

-అప్పుడే సమాజానికి రక్షణ.

-తప్పు చేసిన వారిని ఉపేక్షిస్తూ పోవడం వల్లనే ఇదంతా!

– డిపార్ట్మెంట్‌ పరువంటూ ఆలోచించొద్దు!

-ఆదర్శం లేని వాళ్ళు

-ఆదర్శంగా లేని వాళ్లు ఆ ఉద్యోగానికే అనర్హులు.

-పోలీసు అంటేనే త్యాగ నిరతికి నిదర్శనం.

-అది చాలా మంది మర్చిపోతున్నారు.

-రక్షకులే భక్షకులౌతున్నారు.

-ఖాకీని చూస్తే ధైర్యం రావాలి.

-సాటి ఉద్యోగుల మీద గౌరవం వుండాలి.

-మహిళా పోలీసులను గౌరవంగా చేసుకోవాలి.

-డిపార్ట్మెంట్‌లో కూడా మహిళలకు రక్షణ లేకపోతే ఎలా?

-అంకిత భావంతో పని చేసే వారిని ఎంపిక చేయాలి.

-పురుషాధిక్య సమాజంలో పోలీసు శాఖ.

-మహిళలు పోలీసులు కావాలంటే భయపడతారు.

-వాళ్లు కూడా అన్ని పరీక్షలు పాసయ్యే వస్తున్నారు.

-పురుష పోలీసుకేం వాళ్లు తక్కువ కాదు.

-పోలీసు శాఖలోనే లైంగిక వేధింపులతో ఏం సందేశమిస్తున్నట్లు!

 

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

 పోలీస్‌ అంటే ఒక నమ్మకం. పోలీస్‌ అంటే ఒక భరోసా. పోలీస్‌ అంటే ఒక ధైర్యం. సమాజం ఇంకా హాయిగా నిద్రపోగలుతుందంటే అందుకు కారణం పోలీస్‌. సమాజంలో అన్యాయాలు, అక్రమాలు, దోపిడీలు జరగకుండా, ప్రశాంతమైన వాతావరణం నెలకొని వున్నదంటే కారణం పోలీస్‌. కాని అన్ని వ్యవస్దల్లోలాగానే ఇక్కడ కూడా కొంత మంది పోలీసుల వ్యవహార శైలి మూలంగా వ్యవస్ధ మీద మచ్చ పడుతుతోంది. పోలీసు ఉద్యోగం అంటే ఆషామాషీ కాదు. అందుకు ఎంతో శ్రమ పడాలి. ఉన్నత విద్య కావాలి. శారీకర పరీక్షలు కూడా పాస్‌ కావాలి. అక్కడ కూడా పోటీ ఎక్కువే. కాని ఉద్యోగం కోసం మాత్రమే వచ్చేవారు కొంత మంది వుంటారు. వాళ్ల వల్లేనే పోలీసు వ్యవస్ధకు చెడ్డ పేరొస్తుందనేది ఓ సర్వే ద్వారా తెలింది. నిజానికి పోలీస్‌ కావాలనే కల చాలా మందికి వుంటుంది. సమాజానికి నేరుగా సేవ చేసే అదృష్టం ఒక్క పోలీస్‌కే వుంటుంది. సమజంలో జరిగే అన్యాయాలను నేరుగా ఎదుర్కొనే అవకాశం కూడా పోలీసు వ్యవస్ధకే వుంటుంది. ప్రజలు కూడా ఎంతో గౌరవంగా చూసే ఉద్యోగం కూడా పోలీసే. అందువల్ల యువకులు, చదువు పూర్తయిన వెంటనే పోలీసు కావాలని చాల మంది కోరుకుంటారు. పోలీస్‌ ఉద్యోగం చేయాలని కొన్ని సంవత్సరాల పాటు రకరకాల ఎక్సర్‌సైజలు చేస్తుంటారు. బాడీ బిల్డింగ్‌ కోసం శ్రమిస్తుంటారు. వాటితోపాటు పోటీ పరీక్షను కూడా తప్పనిసరి మెరిట్‌ సాధించాలి. అన్ని రకాల పరీక్షలు పాసై వచ్చిన వారికి కష్టం తెలిసి వుంటుంది. ఒక వ్యక్తి ఎదిగేందుకు ఎంత శ్రమ పడాలో తెలిసి వుంటుంది. అన్యాయాన్ని ఎదిరించాలనే కసి వుంటుంది. కాని కొంత మందిలో అది లోపిస్తుంది. నిజానికి పోలీసు ఉద్యోగంలో చేరేవారికి అంకితభావం ఎంతో అవసరం. కర్తవ్య దీక్ష మరీ ముఖ్యం. అన్నీ అనుకూలించి శ్రమ పడి ఉద్యోగం పొందిన వారిలో కొంత మంది పోలీసులు చేసే అతి కూడా వ్యవస్ధను వెలెత్తి చూపేలా చేస్తున్నాయి. వివాదాలకు కేంద్రంగా మారుతోంది. ఇందులో కింది స్ధాయి అధికారులే కాదు, పై స్ధాయిలో కూడా ఇలాంటి వారు వుండడం మూలంగానే పోలీస్‌ వ్యవస్ధకు చెడ్డ పేరు వస్తోంది. 

 రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల అవినీతి అధికారుల ఏరివేతను మొదలు పెట్టడంతో పోలీసులు కూడా పెద్దఎత్తున పట్టుబడుతున్నారు. 

ఇది ఒక కోణమైతే, పోలీసు శాఖలో మహిళా పోలీసుల మీద వేదింపులు ఎక్కువే. గత పదేళ్ల కాలంలో పుంఖాను పుంఖాలుగా వార్తలు వచ్చాయి. కాని ఎప్పుడూ చర్యలు తీసుకున్నది లేదు. సమాజంలో అన్ని వ్యవస్దలలో మహిళలపై వేధింపులు వుంటాయి. పోలీసుల శాఖలో వేధింపులు అన్నవి మాత్రం సమాజాన్ని భయభ్రాంతులకు గురిచేస్తాయి. మహిళలు ఎవరైనా తమ సమస్యలను చెప్పుకోవడానికి కూడా పోలీస్‌ స్టేషన్‌ అంటే భయపడతారు. ఇతర శాఖల్లో మహిళా వేదింపులు తొందరగా వెలుగులోకి వస్తాయి. కాని పోలీస్‌ వ్యవస్ధలో చాలా వెలుగులోకి రావు. కారణం డిపార్టుమెంటు పరువు అనే ఒక్క పదం, వేధింపులకు గురైన మహిళలకు న్యాయం జరక్కుండా పోతోంది. శరీరం మీద చిన్న కురుపు పుట్టినప్పుడే వైద్యం చేయించుకోకుంటే అది పుండై శరీరమంతా పాకుతుంది. అలాగే పోలీసు వ్యవస్ధలో కూడా ఇలాంటి సంఘటనలు వెలుగులోకి రాగానే వెంటనే చర్యలు తీసుకుంటే ఇతర ఆఫీసర్లు తప్పులు చేయాలంటే భయపడతారు. పరువు పోతుందని తప్పు చేయడానికి వెనుకాడతారు. మహిళలను గౌరవించాలన్న ఆలోచన చేస్తారు. వాళ్లు కూడా తమతో సమానమన్న భావనలో వుంటారు. లేకుంటే రెచ్చిపోతారు. కాటారం ఎస్సైలాగా మృగాలౌతారు. మహిళా పోలీసుల పాలిట యములౌతారు. వారిని వేధించుకుతింటారు. వారి జీవితాలను బుగ్గి చేస్తారు. సమాజ పరిరక్షణలో, తమ కర్తవ్య దీక్షా దక్షతలో మహిళా పోలీసులు కూడా మగ పోలీసులతో సమానమైన విధులే నిర్వర్తిస్తారు. అలాంటి వాళ్లంటే మగ పోలీసులకు గౌరవం వుండాలి. భయం కూడా వుండాలి. లేకుంటే విచ్చలవిడి తనం పెరుగుతుంది. పోలీస్‌ స్టేషన్‌లలో మహిళా కానిస్టేబుళ్లను పైస్ధాయి అధికారులు ఎలా సంబోదిస్తారో అందరికీ తెలుసు. కాని పాపం వాళ్లు నోరు మెదపలేరు. మనసు చంపుకొని బతుకుతున్నవాళ్లు ఎంతో మంది వున్నారు. పేరుకే పోలీసు ఉద్యోగం. కాని వారు చేసే వెట్టి చాకిరి ఘోరం. పైగా పై స్దాయి అదికారులు పెట్టే చీవాట్లు, తిట్లు, ముఖం పట్టుకొని వారు తిట్టే తిట్లు, భూతులు భరిస్తున్నవారే చాలా మంది. ఏ ఒక్క పోలీస్‌ స్టేషన్‌లో కూడా మహిళా పోలీసులకు గౌరవం వుందని చెప్పగలిగే వారు ఒక్కరు కూడా వుండరు. మా పోలీస్‌ స్టేషన్‌లో మహిళా పోలీసులను ఎంతో గౌరవంగా చూసుకుంటామని చెప్పే అదికారి ఒక్కరైనా వున్నారా? అంటే ఎంత మంది చెప్పగలరు. ఇంకెప్పుడు మారుతారు. ప్రపంచం దూసుకుపోతోంది. కాని మహిళలకు ఇచ్చే గౌరవం నానాటికీ దిగజారిపోతోంది. మహిళ అంటే కేవలం శారీరక అవసరమేనా? ఇంకేమీ లేదా? అంతరిక్షంలోకి కూడా వెళ్తున్నారు. వాళ్లకు అవకాశాలిస్తే అద్భుతాలు సృష్టిస్తారు. మహిళా అధికారులు ఎంత ఉన్నత స్ధాయిలో వున్నా, చిన్న చూపు చూడడం పురుష సమాజానికి బాగా అలవాటైపోయింది. ఇది మారాలి. అది పోలీసు వ్యవస్ధ నుంచే మొదలు కావలి. 

కాటారం ఎస్సై విషయంలో రాష్ట్ర ప్రభుత్వ సత్వర న్యాయం మహిళా పోలీసులకు ఎంతో ధైర్యాన్నిచ్చిందనే చెప్పొచ్చు.

 అయినా ఒక మహిళ అనుమతి లేకుండా, పరాయి వ్యక్తి ఆమె జీవితాన్ని తుంచే హక్కు ఎవరిచ్చారు. మహిళలను వేధిస్తే కేసులుంటాయని తెలుసు. అవి పోలీసులకు వర్తించవా? మహిళలను ఎవరైనా హేళన చేసినా షీ టీమ్స్‌తో పట్టుకుంటారు. మరి నిత్యం పోలీస్‌ స్టేషన్లలో అవహేళనకు గురౌతున్న మహిళా పోలీసులకు రక్షణ కల్పించేదెవరు? వారికి గౌరవం పెంచేదెవరు? మహిళను వేదించడమే పెద్ద నేరమైతే, వారిని బలవంతంగా లొంగదీసుకోవడం అంతకన్నా పెద్ద నేరం కాదా? బైట సమాజంలో ఎవరైనా మహిళలపై అత్యాచారం చేస్తే వారికి ఎంతటి కఠిన శిక్షలు వేస్తారో తెలిసిన పోలీసులు మాత్రం అందుకు అతీతులా? అందువల్ల ఇకపై ఏ పోలీస్‌ స్టేషన్‌లోనైనా ఏ పై అధికారైనా మహిళా పోలీసుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని తెలిసిన వెంటనే వారిని ఉద్యోగం నుంచి తొలగించడమే కరక్టు. ఉద్యోగం పోతుందన్న భయం వుంటే తప్ప తప్పు చేసేందుకు వెనుకాడరు. లేకుంటే విచ్చలవిడితనం మానుకోరు. తప్పు చేయాలంటే పోలీసులు కూడా భయపడాలి. తప్పు చేయడానికి సమాజంలో వ్యక్తులు ఎలా భయపడతారో పోలీసులు అందుకు మినహాయింపేం కాదు. ఒక్క మహిళల వేధింపులే కాదు, పోలీసులు ఏ ఇతర తప్పులు చేసినా, అవినీతికి పాల్పడినా, అమాయకులపై పోలీసుల ప్రతాపాలు చూపించినా ఉద్యోగం పోతుందనే భయం వుండాలి. నేర పరిశోధన పేరుతో అమాయకులను వేధించడం కూడా సరైంది కాదు. అప్పుడే సమాజానికి రక్షణ. గతంలో పోలీసు శాఖలో అనేక ఆరోపణలు వచ్చాయి. కాని అప్పటి ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించింది. పై స్ధాయి అదికారులు కూడా పరువు అనే ముసుగేసుకొని చూస్తూ పోయారు. అదే ఇంత దూరం తెచ్చింది. ఇప్పటికైనా డిపార్టుమెంటు కళ్లు తెరవాల్సిన అవసరంవుంది. మహిళా పోలీసుల పట్ల, మన కుటుంబంలో అమ్మా, చెల్లెలు, అక్కలను ఎలా గౌరవిస్తారో అలా గౌరవించాలని ఖచ్చితంగా ఆదేశాలివ్వాలి. లేకుంటే మార్పు రాదు. ఒక్క ఎస్సైపై చర్యలు తీసుకొని చేతులు దులుపుకుంటే సరిపోదు. ఎంతో అంకితభావంతో ఉద్యోగం చేస్తున్నవారు కూడా పోలీసు శాఖలో అనేక మంది వున్నారు. వాళ్లు కూడా సమాజం చేత చిన్న చూపు చూడబడుతున్నారు. నేర స్వభావం కల్గిన పోలీసులను వెంటనే ఉద్యోగాల నుంచి తొలిస్తేనే ప్రక్షాళన జరుగుతుంది. ఉద్యోగులకు మేలు కలుగుతుంది. మహిళా పోలీసులకు గౌరవం పెరుగుతుంది. సమాజంలో పోలీసులంటే మరింత గొప్ప పేరు వస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *