క్యాబినెట్ విస్తరణ ఇప్పట్లో లేనట్లే.
ఉత్తరాధిన కాంగ్రెస్‌లో జోష్ .
హర్యానా,కశ్మీర్ చేతికి చిక్కే అవకాశం.
మహారాష్ట్ర,జార్ఖండ్ ,డిల్లీ వశం కోసం తీవ్ర ప్రయత్నం.
అధిష్టానం ఎన్నికల పరుగులు.
తెలంగాణలో పదవుల కోసం నాయకుల ఎదురుచూపులు.
క్యాబినెట్ బెర్తుల కోసం పడిగాపులు.
పది నెలలైనా ఊరిస్తూనే ఉన్నారు.
రోజు రోజుకూ ఆశావహులు పెరుగుతున్నారు.
అడుగడుగునా ఎదురౌతున్నా అడ్డంకులు.
అదిగో…ఇదిగో అంటూ అపుడప్పుడు వార్తలు
అధిష్టానం ఎన్నికలలో బిజీ బిజీ.
త్వరలో మరో మూడు రాష్ట్రాలలో ఎన్నికలు.
అధిస్టానం ఎవ్వరినీ రానివ్వడం లేదు .
సీఎం,రేవంత్ రెడ్డి మాట తప్ప ఎవరి మాట వినడం లేదు.
రేవంత్ ముందు అడిగే ధైర్యం ఎవరికీ లేదు.
రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు ఎవరికీ మాటివ్వలేదు.
అన్నీ ఊహాగానాలే, ఆశావహుల మనుసులో ఆందోలనలే.
ఇప్పుడు విస్తరించినా ఒరిగే ప్రయోజనం లేదు
ఆలస్యమైనా వచ్చే ఇబ్బందేమీ లేదు.
తేనెతుట్టెను కదపాలని రేవంత్ అనుకోవడం లేదు.
హైదరాబాద్,నేటిధాత్రి:
రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు ఎదురు చూస్తున్న మంత్రి వర్గ విస్తరణ ఇప్పట్లో వున్నట్టు కనిపించడం లేదు. మూడు రాష్ట్రాల ఎన్నికల తర్వాతే ముహూర్తం! అనే సంకేతాలే వినిపిస్తున్నాయి. ఈ మధ్య ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిల్లీకి వెళ్లిన ప్రతిసారీ మంత్రి వర్గం విస్తరణపై వార్తలు రావడం సర్వసాధారణమైపోయింది. నిజంగానే అలాంటి విషయం వుంటే పార్టీ నుంచి స్పష్టమైన సంకేతాలు వెలువడుతాయి. మీడియా అత్యుత్సాహం మూలంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆశగా ఎదురుచూడడం ఎలాంటి కదలికలు కనిపించకపోవడంతో ఉసూరుమనడం పరిపాటిగా మారింది. ముఖ్యంగా పార్లమెంటు ఎన్నికలైపోయిన తర్వాత ఈ వార్తలు ఊపందుకున్నాయి. తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా వెళ్లారు. అమెరికా నుంచి తిరిగి వచ్చిన వెంటనే మంత్రి వర్గం విస్తరణ వుంటుందని ఊహాగానాలు వినిపించాయి. కాకపోతే అప్పటికే పిసిసి మీద పెద్ద ఎత్తున చర్చలు జరిగాయి. ముందు పిసిసి పదవి ప్రకటించే అవకాశం వుందన్న లీకులు వినిపించాయి. అప్పుడు అవి నిజమయ్యాయి. అయినా అక్కడ కూడా స్పష్టంగా రేవంత్ రెడ్డి మార్క్ రాజకీయం స్పష్టంగా కనిపించింది. నిజానికి ఆ సమయంలో రేవంత్ రెడ్డికి పోటీగా మరో పవర్ స్టేషను ఏర్పాటు చేస్తారని అనుకున్నారు. గతంలో ఎప్పుడూ కాంగ్రెస్ పార్టీ అనుసరించిన విధానాలలో ఇది ముఖ్యమైనది. ముఖ్యమంత్రి ఎవరుండే, వారికి వ్యతిరేక వర్గం పిసిసి కమిటీ వుండేది. దాంతో ఆధిపత్య రాజకీయానికి అవకాశం వుండేది కాదు. రెండు పవర్ సెంటర్లు వుంటే రెండు గ్రూపులు తమ కనుసన్నల్లో వుండేలా అధిష్టానం ప్లాన్ చేసిది. ఇప్పుడు అలాంటి ఆలోచనలు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అమలు చేయడం లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీని ముందుకు నడిపే నాయకుడి మీదనే పూర్తి బాధ్యత పెడుతున్నారు. లేకుంటే లుకలుకల మూలంగా మొదటికే మోసం వచ్చే పరిస్థితులు సృష్టించబడుతున్నాయి. ముఖ్యమంత్రి స్థానంలో వున్న నాయకులు అభద్రతా భావానికి గురౌతున్నారు. అందుకే రాష్ట్ర రాజకీయాలపై పూర్తిగా రేవంత్ రెడ్డి నిర్ణయాలనే అమలు చేయడానికి అధిష్టానం ఇష్టపడుతోంది. ఇతర నాయకుల పప్పులు ఉడకడానికి అవకాశం లేకుండా పోయింది. పిసిసి విషయంలో కూడా అదే జరిగింది. రేవంత్ రెడ్డి మాటే చెల్లుబాటైంది. రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహిడుగా పేరున్న నిజామాబాదు మాజీ ఎంపి. మధుయాష్కీ గౌడ్‌ను కాదని అదే జిల్లాకు చెందిన మహేష్ కుమార్ గౌడ్ ను ఎంపిక చేశారు. మంత్రి వర్గ విస్తరణ, కూర్పు మొత్తం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మాత్రమే వదిలేసినట్లు తెలుస్తోంది. అందుకే అధిష్టానం ఎలాంటి రాజకీయాలకు తావు ఇవ్వడం లేదు. ఎవరినీ ప్రోత్సహించడం లేదు. ఈ వారం రోజుల సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెండు సార్లు డిల్లీ వెళ్లారు. ఇప్పుడు కూడా డిల్లీలోనే వున్నారు. అధిష్టానం రెండు రాష్ట్రాల ఫలితాల మీద ఉత్కంఠగా వుంది. ఇలాంటి సందర్భంలో మంత్రి వర్గ విస్తరణ గురించి ఆలోచించే ప్రసక్తి లేదు. అందుకే అందుతున్న సమాచారం మేరకు క్యాబినెట్ విస్తరణ ఇప్పట్లో లేనట్లే అనేది స్పష్టంగా తెలుస్తోంది. ఇదిలా వుంటే ఉత్తరాధిన కాంగ్రెస్‌లో జోష్ కనిపిస్తోంది. హర్యానా, కశ్మీర్ చేతికి చిక్కే అవకాశంపై ఎగ్జిట్ పోల్స్‌గా ముక్త కంఠంతో ఒకే ఫలితాలు అందిస్తున్నాయి. ఏ ఒక్క ఎగ్జిట్ పోల్ సంస్థ కూడా రెండు రాష్ట్రాలలో బిజేపి గెలుస్తుందన్న ఫలితాలు ఇవ్వలేదు. హర్యానాలో ప్రముఖ నాయకుడు ఎన్నికల చివరి రోజున కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇక త్వరలో మూడు రాష్ట్రాల ఎన్నికలు జరగనున్నాయి. అక్కడ కూడా ఇదే జోష్ మీద ఎన్నికల యుద్ధం చేయాలని కాంగ్రెస్ చూస్తోంది. మహారాష్ట్ర, జార్ఖండ్, డిల్లీ వశం కోసం తీవ్ర ప్రయత్నం చేసే ఎన్నికల వ్యూహాలకు పదునుపెడుతున్న సమయంలో తెలంగాణలో మంత్రి వర్గ విస్తరణ ప్రస్తావనే రాకపోవచ్చు. అయినా తెలంగాణలో మళ్ళీ మంత్రి వర్గం విస్తరణ అంశం తెరమీదకు వచ్చింది. డిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈసారి మంత్రి వర్గ కూర్పు పూర్తి చేసుకొస్తారన్న ఆశాభావం మళ్ళీ ఆశావహుల్లో మొదలైంది. తెలంగాణలో పూర్తి స్థాయి మంత్రి వర్గం కొనసాగుతోందంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో కీలక వ్యాఖ్యలు చేశారు. అప్పుడు అందరూ వాటిని కొట్టిపారేశారు. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఏ విషయాన్ని దాచుకోరు. కుండబద్దలు కొట్టినట్లు చెప్పేస్తారు. సహజంగా రాజకీయ నాయకులు ఔనంటే కాదన్నట్లు, వుందంటే లేదన్నట్లు అనే రాజకీయమే ఎక్కువగా వుండేది. ఉమ్మడి రాష్ట్రంలోనైనా, తర్వాత కేసిఆర్ అయినా ఏదీ ముక్కుసూటిగా చెప్పేవారు కాదు. కానీ రేవంత్ రెడ్డి అందుకు భిన్నంగా చెప్పడమే అలవాటు. ఎందుకంటే ఎన్నికల ముందైనా, అంతకు ముందైనా తన మనసులో వున్నదే బైటపెట్టడమే అలవాటు. డొంక తిరుగుడు సమాధానాలు ఆయన నోట ఎప్పుడూ రావు. ఎప్పుడైతే రాజకీయాలలోకి వచ్చారో అప్పటి నుంచి ఇతర నాయకులకు భిన్నమైన శైలినే ఆయన అనుసరిస్తూ వస్తున్నారు. అందుకే ఈ తరానికి ఆయన నచ్చుతున్నారు. ముఖ్యంగా సరిగ్గా ఇరవై సంవత్సరాల క్రితం వరకు రాజకీయాలు వేరుగా వుండేవి. ఏ మాట చెప్పినా నర్మగర్భంగా మాత్రమే చెప్పేవారు. ఆత్మ విశ్వాసాన్ని కూడా పదిలంగా బైటపెట్టేవారు. ఎలాంటి ప్రశ్నలు ఉత్పన్నమైనా చేద్దాం..చూద్దాం.. పరిస్థితులు ఎలా వుంటాయో ఆలోదిద్దామని దాట వేసేవారు. చేయాల్సింది చేసేవారు. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నుంచి అలాంటి సమాధానాలు ఊహించలేం. తన మనసులో వున్నది వున్నట్లు చెప్పేస్తారు. ఆ ముక్కు సూటి తనమే రేవంత్ కు ఇబ్బందులు తెచ్చిపెట్టినా, లక్ష్యసాధనకు ఉపయోగపడ్డాయి. ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్‌ఆర్ పాదయాత్ర చేసిన సందర్భంలో కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఎవరు? అని ప్రశ్నించిన ప్రతి సారి అధిష్టానం నిర్ణయం ఫైనల్ అనే వారు. ఆ సమాధానం అందరికీ తెలుసు. అయినా ఆయన అదే చెప్పేవారు. పాదయాత్ర చేసినా నేనే ముఖ్యమంత్రి అని చెప్పుకునే ధైర్యం ఏనాడు చేయలేదు. కానీ రేవంత్ రెడ్డి మాత్రం నేనే ముఖ్యమంత్రి అనే నమ్మకంతోనే పార్టీని నడిపించారు. అధిష్టానానికి భరోసా కల్పించారు. నిజం చెప్పాలంటే అలా అధిష్టానానికి భరోసా కల్పించిన నాయకుడు తెలంగాణలో మరొకరు లేరు. నేను కష్టపడి పార్టీని అధికారంలోకి తీసుకొస్తా! నాకు పూర్తి స్వేచ్చనిస్తే నేనేంటో చూపిస్తా!! అని అధిష్టానానికి జంకూ బొంకు లేకుండా చెప్పిన ఏకైక నాయకుడు రేవంత్ రెడ్డి. అందుకే రేవంత్ రెడ్డి ఏది చెప్పినా అధిష్టానం జోక్యం చేసుకోవడం లేదు. ఎన్నికల సందర్భంలో కూడా తనకు అనుకూలమైన టీన్‌ను ఆనాడే ఎంచుకున్నాడు. టిక్కెట్లు ఫైనల్ చేయించుకున్నారు. గెలిపించుకున్నారు. మంత్రి వర్గ కూర్పు కూడా పూర్తి ఆధిపత్యం ఆయనే చూసుకున్నారు. పెండిరగ్‌లో వున్న ఖాళీలు తనకు నచ్చిన వారినే ఎంచుకుంటానని కూడా ముందే అధిష్టానానికి సూచించారు. అందుకే తొలి విడతలో పూర్తి క్యాబినెట్ కూర్పు చేయలేదు. అధిష్టానం సూచించిన సీనియర్లును మంత్రి వర్గంలోకి తీసుకున్నారు. ఇప్పుడు కూడా ఏ సీనియర్ మంత్రి జోక్యం లేకుండా చూసుకోవాలనే అనుకుంటున్నాడు. ఆరుగురికి దక్కే అవకాశంలో కూడా పూర్తిగా తన టీం తయారు చేసుకోవాలనుకుంటున్నాడు. ఏ మాత్రం సీనియర్లకు అవకాశం కల్పించినా క్యాబినెట్ మీద పట్టుపోతుందని రేవంత్ రెడ్డికి తెలుసు. పైగా ఇప్పటి వరకు కొన్ని ఉమ్మడి జిల్లాలకు మంత్రి వర్గంలో చోటు దక్కలేదు. ముఖ్యంగా హైదరాబాద్ నుంచి మంత్రి లేకపోవడం తొలిసారి కావడం విశేషం. త్వరలో జిహెచ్‌ఎంసికి ఎన్నికలు జరగాల్సివుంది. ఆ సమయానికి కూడా మంత్రి లేకపోతే ఇబ్బందికరమే అవుతుంది. అయితే హైదరాబాద్ నుంచి తనకు అనుకూలమైన నాయకుడు ఎవరూ లేరు. పైగా హైదరాబాదు నుంచి గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు లేరు. ఇది కూడా ఇబ్బందికరంగా మారింది. హైదరాబాద్ నుంచి దానం నాగేందర్ అవకాశం దక్కుతుందన్న ఆలోచనతో తన మాతృసంస్థ కాంగ్రెస్ పార్టీ గూటికి మళ్ళీ చేరాడు. కానీ ఉప ఎన్నిక వచ్చే అవకాశం కనిపిస్తోంది. అంటే ఇప్పటికిప్పుడు విస్తరణ జరిగినా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు అవకాశం దక్కకపోవచ్చు. అందుకే మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఇదిలా వుంటే మైనారిటీలకు మంత్రి వర్గంలో చోటు దక్కలేదు. నాంపల్లి నుంచి పోటీ చేసిన ఫిరోజ్ ఖాన్ గెలవలేదు. కానీ కొంత కాలం ఆశపెట్టుకున్నాడు. ఇప్పుడు తనకు మంత్రి పదవి రాదని నిర్థారణ చేసుకున్నాడు. అందుకే అందరూ మైనంపల్లి హనుమంతరావు వైపు చూస్తున్నారు. ఇక నిజామాబాదు, ఆదిలాబాదు, రంగారెడ్డి జిల్లాలకు కూడా స్థానం దక్కలేదు. వరంగల్ నుంచి ఇద్దరు మహిళా మంత్రులున్నారు. ఇక్కడి నుంచి మూడు స్థానం కావాలని కోరుతున్నారు. స్టేషను ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆశలు పెట్టుకున్నారు. రాజకీయాలలో కడియం శ్రీహరి అదృష్టవంతుడు అంటారు. పదవులు ఆయనను వరిస్తూ వచ్చాయి. ఇప్పుడు కూడా అవకాశం రావొచ్చన్న అభిప్రాయం వుంది. ఎమ్మెల్యేల మీద కోర్టు తీర్పును బట్టి అవకాశం వస్తుందా? ఉప ఎన్నికలు వస్తాయా? అన్నది త్వరలో తేలుతుంది. అదే సమయంలో ఒక వేళ కడియం మళ్ళీ గెలిస్తే మాత్రం మంత్రి పదవి ఖాయం. ఇప్పుడున్న వారిలో ఎవరో ఒకరికి పదవీ గండం కూడా వుండడం తధ్యం. ములుగు ఎమ్మెల్యే మంత్రి సీతక్క విషయంలో రేవంత్ రెడ్డి మార్పును కోరుకోడు. ఖమ్మం జిల్లా నుంచి ముగ్గురు మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇక అక్కడ ఎవరికీ అవకాశం ఇవ్వరు. మహబూబ్‌నగర్ జిల్లా నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వున్నారు. మంత్రిగా జూపల్లి కృష్ణారావు వున్నారు. అక్కడ కూడా మూడో పదవి వుండకపోవచ్చు. మెదక్ కు నుంచి దామోదర రాజనర్సింహ నర్సింహ మాత్రమే వున్నారు. గత ఎన్నికలలో సంగారెడ్డి నుంచి జగ్గారెడ్డి గెలిస్తే ఆయన మంత్రి అయ్యేవారు. అందువల్ల మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావుకు అవకాశం దక్కినా ఆశ్చర్యపోనక్కర్లేదు. కాకపోతే హైదరాబాదు నుంచి హనుమంతరావు కా లేక, మెదక్ నుంచి రోహిత్ కా అన్నది తేలాల్సివుంది. కరీంనగర్ నగర్ నుంచి ఇద్దరు మంత్రులున్నారు. నల్గొండ నుంచి ఇద్దరున్నారు. కానీ ఆశావహులు చాలా మంది వున్నారు. తనకు కూడా మంత్రి పదవి కావాలని రాజగోపాల్ రెడ్డి అడుగుతున్నారు. కానీ ఇవ్వకపోవచ్చు. ఏది ఏమయినా ఆరుగురు మంత్రులను క్యాబినెట్ లోకి ఇప్పుడే తీసుకోవాలని రేవంత్ రెడ్డికి లేదు. అధిష్టానం ఒత్తిడి చేసి మంత్రి వర్గ కూర్పు తప్పనిసరి అని ఆదేశిస్తే మాత్రం తన అనుకునే వారికే అవకాశం కల్పిస్తారని చెప్పడంలో సందేహం లేదు