ఎన్నికల నేపథ్యంలో మండల అధికారుల సమీక్ష
జైపూర్,నేటి ధాత్రి:
ఎన్నికల నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జైపూర్ మండల కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయం లో మండల అధికారులు సమన్వయ సమీక్ష నిర్వహించారు.శనివారం నిర్వహించిన ఈ సమీక్షలో మండలంలోని అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.రెండవ సాధారణ ఎన్నికలు 2025 సంవత్సరానికి గాను సర్పంచ్ వార్డు సభ్యుల పోలింగ్ ప్రక్రియను సమర్ధవంతంగా నిర్వహించేలా పంచాయతీ కార్యదర్శులను,జిపిఓ సిబ్బందిని ముందస్తు ప్రణాళిక ప్రకారం సిద్ధం చేశారు.ఈ సందర్భంగా ఎంపీడీవో గుర్రం సత్యనారాయణ గౌడ్ మాట్లాడుతూ.. పల్లెల్లో స్థానిక ఎన్నికల పోరంటే ఆశామాషిగా ఉండదని అధికారులకు సూచించారు.ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా,ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు సజావుగా జరిగేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంగా విధులు నిర్వహించాలన్నారు.నామినేషన్ కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని,ప్రజలకు నామినేషన్ కేంద్రాల గురించి విస్తృత ప్రచారం చేయించాలని తెలిపారు.పోలింగ్ కేంద్రాల్లో తగిన సౌకర్యాలు ఉండేటట్లు చూడాలన్నారు.ఈ కార్యక్రమంలో తహసిల్దార్ వనజ రెడ్డి,సీఐ నవీన్ కుమార్, ఎస్సై శ్రీధర్,ఎంపీఓ శ్రీపతి బాబురావు,డిప్యూటీ తహసిల్దార్ సంతోష్,వివిధ శాఖల సిబ్బంది పాల్గొన్నారు.
