నామినేషన్ ప్రక్రియపై కలెక్టర్ ఆదేశాలు

నామినేషన్ ప్రక్రియ సమర్థవంతంగా నిర్వహించాలి

జిల్లా ఎన్నికల అధికారి,కలెక్టర్ కుమార్ దీపక్

మంచిర్యాల,నేటి ధాత్రి:

 

 

2వ సాధారణ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు నామినేషన్ ప్రక్రియ సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి,కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు.గురువారం జిల్లాలోని లక్షెట్టిపేట మండలంలోని గుల్లకోట, మిట్టపల్లి,సూరారం గ్రామాలకు గుల్లకోట గ్రామపంచాయతీ, పోతపల్లి,అంకతిపల్లి, లక్ష్మీపూర్ గ్రామాలకు పోతపల్లి గ్రామపంచాయతీ,చందారం, హనుమంతుపల్లి,రంగపేట గ్రామాలకు చందారం గ్రామపంచాయతీలలో ఏర్పాటుచేసిన నామినేషన్ కేంద్రాలను సందర్శించి రిటర్నింగ్,సహాయ రిటర్నింగ్ అధికారులకు పలు సూచనలు చేశారు.ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి,కలెక్టర్ మాట్లాడుతూ సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు చేపట్టిన నామినేషన్ స్వీకరణ ప్రక్రియను సమర్ధవంతంగా నిర్వహించాలని తెలిపారు.జిల్లాలో 3 విడతలలో ఎన్నికల ప్రక్రియ నిర్వహించడం జరుగుతుందని,ఇందులో భాగంగా మొదటి విడతలో 90 సర్పంచ్,816 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం ఎన్నికల నిర్వహణకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.నామినేషన్ స్వీకరణ కేంద్రం ముందు గ్రామపంచాయతీలోని వార్డుల వారీగా ఫోటో ఓటర్ల జాబితా, రిజర్వేషన్ల వివరాలను ప్రదర్శించాలని,నామినేషన్ కేంద్రం నుండి 100 మీటర్ల పరిధిలో గుంపులుగా ఎవరిని అనుమతించకూడదని, నామినేషన్ సమర్పించే అభ్యర్థులు,ప్రతిపాదించే వారిని మాత్రమే అనుమతించాలని తెలిపారు. నామినేషన్ల స్వీకరణలో ఎన్నికల కమిషన్ జారీ చేసిన నియమాలకు లోబడి వ్యవహరించాలని, నామినేషన్ పత్రాల స్వీకరణ, నామినేషన్ల పరిశీలన, అభ్యర్థుల ప్రకటన,గుర్తుల కేటాయింపు ప్రక్రియలో జాగ్రత్తగా వ్యవహరించాలని తెలిపారు.అనంతరం ఇటిక్యాల గ్రామంలో కొనసాగుతున్న వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి నిర్వాహకులకు పలు సూచనలు చేశారు.మండల కేంద్రంలోని 30 పడకల సామాజిక ఆరోగ్య కేంద్రంలో చేపట్టిన పోస్ట్ మార్టం గది నిర్మాణ పనులను పరిశీలించి త్వరగా పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.ఆసుపత్రికి వచ్చే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, వైద్యులు,సిబ్బంది విధుల పట్ల బాధ్యతగా వ్యవహరించాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి సరోజ,సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

నామినేషన్ కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్

నామినేషన్ల స్వీకరణ కేంద్రాలను సందర్శించిన కలెక్టర్

కరీంనగర్, నేటిధాత్రి:

 

గ్రామ పంచాయతీ ఎన్నికలలో భాగంగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ విడుదల చేసిన షెడ్యూల్ ను అనుసరిస్తూ కరీంనగర్ జిల్లాలో తొలి విడత సర్పంచ్, వార్డు స్థానాలకు రిటర్నింగ్ అధికారులు గురువారం నోటిఫికేషన్లు జారీ చేశారు. తొలి విడతలో కరీంనగర్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని గంగాధర, రామడుగు, చొప్పదండి, కొత్తపల్లి, కరీంనగర్ రూరల్ మండలాల్లోని తోంబైరెండు సర్పంచ్, ఎనిమిది వందల అరవై ఆరు వార్డు మెంబర్ల స్థానాలకు గురువారం నోటిఫికేషన్ విడుదల చేసి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభించారు. ఈనేపథ్యంలో రామడుగు మండలం వెదిర గ్రామ పంచాయతీ కార్యాలయంలో వెదిర, వెలిచాల గ్రామాల పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఏర్పాటు చేసిన నామినేషన్ల స్వీకరణ కేంద్రాన్ని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ పమేలా సత్పతి సందర్శించారు. నామినేషన్ స్వీకరణ కేంద్రంలో సదుపాయాలు పరిశీలించారు. నామినేషన్ పత్రాల స్వీకరణకు చేసిన ఏర్పాట్లు గమనించి పలు సూచనలు చేశారు. హెల్ప్ డెస్క్, పోలీస్ బందోబస్తు తదితర అంశాలను పరిశీలిస్తూ, సపోర్టింగ్ స్టాఫ్ సరిపడా ఉన్నారా అని ఆరా తీశారు. నోటీసు బోర్డులపై అతికించిన నోటిఫికేషన్ పత్రాలను తనిఖీ చేశారు. ఎలాంటి పొరపాట్లు జరగకుండా నామినేషన్ల ప్రక్రియను నిర్వహించాలని, నామినేషన్ దరఖాస్తు ఫారాలు తీసుకున్న వారి వివరాలను కూడా రిజిస్టర్ లో నమోదు చేయాలని కలెక్టర్ సూచించారు. దాఖలైన నామినేషన్లకు సంబంధించి జిల్లా కేంద్రానికి సకాలంలో రిపోర్టులు పంపించాలని అన్నారు. ప్రతి నామినేషన్ సెంటర్ వద్ద హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశామని, విధుల్లో ఉన్న ప్రభుత్వ సిబ్బంది నామపత్రాలు దాఖలు చేసే విషయంలో అభ్యర్థులకు అవసరమైన సహకారం అందించాలని సూచించారు. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను తూచ తప్పకుండా పాటిస్తూ, ప్రశాంత వాతావరణంలో ఎన్నికల ప్రక్రియను నిర్వహించాలని అన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి పక్కాగా అమలయ్యేలా చూడాలన్నారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఎలాంటి సందేహాలు ఉన్నా, ఉన్నతాధికారులను సంప్రదించాలని సూచించారు. ఈకార్యక్రమంలో రామడుగు తహసిల్దార్ రాజేశ్వరి, మండల ప్రత్యేక అధికారి అనిల్ ప్రకాష్, స్థానిక అధికారులు, తదితరులున్నారు.

నామినేషన్ ఏర్పాట్లపై అధికారుల పర్యవేక్షణ

పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ఏర్పాట్లను అధికారులు పర్యవేక్షించారు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలంలో పంచాయతీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియకు సంబంధించిన ఏర్పాట్లను పలువురు అధికారులు గురువారం మధ్యాహ్నం పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ మహేందర్ రెడ్డి, సీఐ శివలింగం తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల ప్రక్రియ సజావుగా జరిగేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

మొగుడంపల్లిలో నామినేషన్ కేంద్రాలు ఖరారు

స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల కేంద్రాలు ఖరారు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

మొగుడంపల్లి మండల పరిధిలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల స్వీకరణ కోసం గ్రామాలవారీగా కేంద్రాలను ఎంపీడీఓ మహేష్ ఖరారు చేశారు. ధనసిరి, మాడిగి, ఇప్పేపల్లి, గౌసాబాధ్ తండా, అసద్ గంజ్, గోపన్ పల్లి, ఖాజామాల్పూర్, గోడిగార్ పల్లి, మొగుడంపల్లి, మిర్జంపల్లి, జంగర్ బోలి, అర్చనాయక్ తాండ, విట్టు నాయక్ తండ, మన్నాపూర్, జాడి మల్కాపూర్, రాయిపల్లి తండా, సజ్జ రావు పేట తండా, గుడుపల్లి, చున్నం బట్టి తాండ, పడియల్ తండా, ఔరంగ నగర్ గ్రామాలకు నామినేషన్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. వివరాలకు 8309271537 నంబర్ ను సంప్రదించవచ్చు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version