ఎండల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
మున్సిపల్ చైర్మన్ పావుశెట్టి సునీల్ కుమార్
పరకాల,నేటిధాత్రి
పట్టణంలో రోజురోజుకూ ఎండ తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలందరూ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకొని తగిన జాగ్రత్తలు పాటించాలని పరకాల మున్సిపల్ చైర్మన్ పావుశెట్టి సునీల్ కుమార్ సూచించారు.ఎండ ఎక్కువగా ఉన్న సమయంలో బయటకు వెళ్లేటప్పుడు గొడుగు,టోపీ లేదా రుమాలు ఉపయోగించాలని,లేత రంగు కాటన్ దుస్తులు ధరించాలని తెలిపారు.తరచూ నీరు,మజ్జిగ,గ్లూకోజ్ నీరు లేదా ఓఆర్ఎస్ ద్రావణం సేవించాలని సూచించారు.మధ్యాహ్నం తీవ్ర ఎండ సమయంలో అవసరం లేకుండా బయట తిరగకుండా ఉండాలని కోరారు.వడదెబ్బ లక్షణాలుగా తీవ్రమైన తలనొప్పి,తల తిరగడం,అధిక జ్వరం, మత్తు,ఫిట్స్,అపస్మారక స్థితి కనిపిస్తే వెంటనే బాధితుడిని చల్లని ప్రదేశానికి తరలించి ప్రథమ చికిత్స అందించాలని తెలిపారు.పరిస్థితి విషమిస్తే సమీప ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లాలని సూచించారు.ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు.
