సింగరేణి లో అక్రమ నియామకాల పై చర్యలు తీసుకోవాలి
పిడిఎస్యు జిల్లా ప్రధాన కార్యదర్శి డి.శ్రీకాంత్ డిమాండ్
శ్రీరాంపూర్,నేటి ధాత్రి:
సింగరేణి విద్యాసంస్థల్లో టీచింగ్,ఇతర పోస్టుల నియామకాలలో జరిగిన అవకతవకలపై సంబంధిత అధికారులు వెంటనే స్పందించి అక్రమ నియామకాలపై చర్యలు తీసుకోవాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం ( పిడిఎస్యు ) జిల్లా ప్రధాన కార్యదర్శి డి.శ్రీకాంత్ డిమాండ్ చేశారు.మంచిర్యాల జిల్లా నస్పూర్ మండలం శ్రీరాంపూర్ లోని సింగరేణి ఉన్నత పాఠశాల విద్యాసంస్థల యాజమాన్యం ఏప్రిల్ 25 – 2026న నోటిఫికేషన్ విడుదల చేసి టీచింగ్,ఇతర పోస్టుల భర్తీకి దరఖాస్తులు స్వీకరించినట్లు తెలిపారు.ఈ క్రమంలో అనేక మంది యువతి,యువకులు అర్హతల ప్రకారం దరఖాస్తులు చేసుకున్నప్పటికీ,యాజమాన్యం పారదర్శకత పాటించకుండా గతంలో పనిచేసిన వారినే తిరిగి నియమించిందని ఆరోపించారు.నోటిఫికేషన్ ప్రకారం మే 21-2026న ఇంటర్వ్యూలు నిర్వహించినప్పటికీ,కొంతమంది గత ఉద్యోగులు ఇంటర్వ్యూకు హాజరు కాకపోయినా వారికి పోస్టులు కేటాయించడం అన్యాయమని పేర్కొన్నారు.యాజమాన్యం ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ తమకు నచ్చిన వారికే పోస్టింగ్‌లు ఇచ్చిందని ఆరోపించారు.దీనిపై సంబంధిత సింగరేణి సీఎండీ, డైరెక్టర్ (పర్సనల్),సింగరేణి విద్యాసంస్థల జనరల్ మేనేజర్ వెంటనే స్పందించి శ్రీరాంపూర్ సింగరేణి ఉన్నత పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకుని బాధ్యులను విధుల నుంచి తొలగించాలని పిడిఎస్యు డిమాండ్ చేస్తుందని అన్నారు.ఈ కార్యక్రమంలో పిడిఎస్యు జిల్లా ఉపాధ్యక్షుడు కే.కార్తీక్,పట్టణ ఉపాధ్యక్షుడు వంశీ,తదితరులు పాల్గొన్నారు.
