ప్రజావాణి సమస్యల పరిష్కారంపై అధికారులు సమన్వయంతో కృషి చేయాలి
జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
మంచిర్యాల,నేటి ధాత్రి:
ప్రజావాణి కార్యక్రమంలో అందిన దరఖాస్తుల పరిష్కారంపై అధికారులు సమన్వయంతో కృషి చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు.సోమవారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్లు పి.చంద్రయ్య, వి.రాములు లతో కలిసి అర్జీదారుల నుండి దరఖాస్తులు స్వీకరించారు.మంచిర్యాల పట్టణం జాఫర్ నగర్ ప్రాంతానికి చెందిన పర్వీన్ సుల్తానా,ఫర్జానా నిరుపేద అయిన తమకు రెండు పడక గదుల ఇల్లు మంజూరు చేయాలని కోరుతూ వేరువేరుగా అర్జీలు సమర్పించారు.మంచిర్యాల పట్టణానికి చెందిన కమ్మరి రాజేశ్వరి నిరుపేద అయిన తనకు ఒంటరి మహిళ పింఛన్ ఇప్పించాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు.మంచిర్యాల పట్టణం ఎన్ టి ఆర్ నగర్ కు చెందిన ముజ్జిగ స్వప్న కూలి పని చేసుకుంటూ జీవిస్తున్న నిరుపేద అయిన తనకు ఇందిరమ్మ ఇల్లు ఇప్పించాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు.బెల్లంపల్లి మండలం చాకేపల్లి గ్రామస్తులు తమ గ్రామంలో ఎస్ సి నేతకాని గూడెంలో మంజూరు అయిన బోర్ వెల్ ఏర్పాటు చేయాలని కోరుతూ అర్జీ సమర్పించారు.జన్నారం మండలం వినాయక నగర్ కాలనీవాసులు తమ కాలనీలో ఇండ్ల మధ్యలో నిర్వహిస్తున్న బీడీ ఫ్యాక్టరీని తొలగించాలని కోరుతూ అర్జీ సమర్పించారు.దండేపల్లి మండలం మాకులపేట గ్రామానికి చెందిన ముత్తినేని రాజమణి తన పొలంలో సాగు చసిన మొక్కజొన్న పంట చేతికి వచ్చే సమయంలో అడవి పందులు పూర్తిగా నాశనం చేశాయని, నష్టపరిహారం ఇప్పించాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణి కార్యక్రమంలో 64 దరఖాస్తులు అందాయని,ప్రతి దరఖాస్తులు క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించే విధంగా అధికారుల సమన్వయంతో చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.
హమాలీల సంఖ్య పెంపుదలపై ప్రత్యేక దృష్టి
మండల ప్రత్యేక అధికారులుగా నియమించబడిన జిల్లా అధికారులు తమ మండలాల పరిధిలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించి రైతులకు ఎలాంటి సమస్యలు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మద్దతు ధర చెల్లించి రైతుల వద్ద నుండి ధాన్యం కొనుగోలు చేయడం జరుగుతుందని తెలిపారు.రైతుల వద్ద నుండి కొనుగోలు చేసిన వరి ధాన్యాన్ని కేటాయించిన ప్రకారంగా రైస్ మిల్లులు,గోదాములకు తరలించాలని,దిగుమతి, హమాలీల సంఖ్య పెంపుదల అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు.
జన జాతీయ గరిమ ఉత్సవ్ 2026 గోడపత్రుల ఆవిష్కరణ
అనంతరం ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా ఈ నెల 18వ తేదీ నుండి 23వ తేదీ వరకు పర్యాటక రంగం ఆధ్వర్యంలో నిర్వహించవలసిన కార్యక్రమాల సంబంధిత కరపత్రాలు,గిరిజనుల సంక్షేమం కోసం దేశవ్యాప్తంగా చేపట్టిన జన జాతీయ గరిమ ఉత్సవ్ 2026 సంబంధిత గోడ ప్రతులను అధికారులతో కలిసి ఆవిష్కరించారు.యువ టూరిజం క్లబ్,అవగాహన కార్యక్రమాలు, హెరిటేజ్ వాక్,స్థానిక ఇన్ఫ్లుయెన్సర్/యూట్యూబర్స్తో సమావేశం,స్వచ్ఛత,టూరిజం బ్రాండ్ విడుదల,పారిశుధ్యం వంటి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.ధర్తీ ఆబా జన జాతీయ గ్రామ్ ఉత్కర్ష అభియాన్ లో భాగంగా గిరిజన గ్రామాలలో రహదారులు, త్రాగునీరు,ఆరోగ్యం,విద్యుత్, ఇండ్ల నిర్మాణం వంటి కనీస సదుపాయాలు కల్పించడం జరుగుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
