వర్షాకాలానికి ముందే అంజయ్య నగర్ స్మశాన వాటిక పనులు పూర్తి చేయాలి
ప్రజావాణిలో సిఎంసి అడిషనల్ కమిషనర్‌కు వినతిపత్రం అందజేత
టెండర్ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆంజనేయులు సాగర్ డిమాండ్
సానుకూలంగా స్పందించిన అడిషనల్ కమిషనర్ గీతా రాధిక
శేరిలింగంపల్లి, నేటి ధాత్రి :-
అంజయ్య నగర్ డివిజన్ పరిధిలోని అంజయ్య నగర్ స్మశాన వాటిక పునరుద్ధరణ పనులను అత్యవసరంగా చేపట్టాలని, స్థానిక ప్రజల ఇబ్బందులను త్వరితగతిన తీర్చాలని డివిజన్ నాయకులు ఆంజనేయులు సాగర్ అధికారులను కోరారు. సోమవారం సిఎంసి కార్యాలయంలో నిర్వహించిన ‘ప్రజావాణి’ కార్యక్రమంలో భాగంగా ఆయన కాలనీ ప్రతినిధులతో కలిసి సిఎంసి అడిషనల్ కమిషనర్ గీతా రాధికను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా స్మశాన వాటికలో ఎదురవుతున్న సమస్యలను ఆమెకు వివరించి, పనులను త్వరితగతిన ప్రారంభించాలని కోరుతూ ఒక వినతిపత్రాన్ని అందజేశారు.ఈ సందర్భంగా ఆంజనేయులు సాగర్ మాట్లాడుతూ.. అంజయ్య నగర్ స్మశాన వాటికలో ప్రస్తుతం కనీస సౌకర్యాలు లేకపోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో వర్షాకాలం సమీపిస్తుండటంతో, ఈ సమస్య మరింత జటిలంగా మారే ప్రమాదం ఉందన్నారు. వర్షాలు పడితే ఇక్కడ కర్మకాండలు నిర్వహించేందుకు వచ్చే ప్రజలు, అంత్యక్రియల కోసం వచ్చే వారు తీవ్ర అసౌకర్యానికి గురికావాల్సి వస్తుందని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. కాలయాపన చేయకుండా ప్రజల ఇబ్బందులను గుర్తించి, తక్షణమే టెండర్ ప్రక్రియను పూర్తి చేయాలని, వర్షాలు ప్రారంభం కాకముందే పునరుద్ధరణ పనులను యుద్ధప్రాతిపదికన ప్రారంభించాలని ఆయన డిమాండ్ చేశారు.డివిజన్ నాయకులు సమర్పించిన వినతిపత్రంపై అడిషనల్ కమిషనర్ గీతా రాధిక సానుకూలంగా స్పందించారు. స్మశాన వాటిక పునరుద్ధరణకు సంబంధించిన టెండర్ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశిస్తామన్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, త్వరలోనే పనులు ప్రారంభమయ్యేలా ప్రభుత్వ పరంగా తగిన చర్యలు తీసుకుంటామని ఆమె కాలనీ నాయకులకు హామీ ఇచ్చారు.ఈ ప్రజావాణి కార్యక్రమంలో ఆంజనేయులు సాగర్‌తో పాటు అంజయ్య నగర్ కాలనీ ప్రెసిడెంట్ నరసింహ సాగర్, ప్రముఖ కాలనీ నాయకులు జి. రవి సాగర్, రామకృష్ణ మరియు ఇతర ముఖ్య నాయకులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. స్మశాన వాటిక ఆధునికీకరణ కోసం అధికారులు స్పందించి హామీ ఇవ్వడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.
