దొరికితే ఏమౌద్ది!

https://epaper.netidhatri.com/view/282/netidhathri-e-paper-1st-june-2024%09/2

మా కొలువు మాకొచ్చిద్ది!!

-పట్టుబడితే పోయేదేమిలేదు..మళ్ళీ కొలువు రావడం తప్ప!

-దర్జాగా లంచాలు!

-నేరం చేస్తున్నామన్న భావన లేదు.

-పట్టుకుంటారన్న భయమే లేదు!

-పరువు పోతుందన్న ఆలోచన లేదు.

-ఎంత మంది పట్టుబడుతున్నా లంచాలు ఆగడం లేదు.

-పట్టుబడినా నష్టమేమీ లేదు!

-పదేళ్లు సంపాదించుకున్నది బోలెడు.

-మళ్ళీ కొలువు రావడం పెద్ద సమస్య కాదు.

-కక్ష్యతో ఇరికించారని చెప్పుకుంటాం.

-బైటకొచ్చి కొలువులు చేస్తున్నవారిని చూస్తున్నాం.

-పదేళ్లలలో పది తరాలకు సంపాదించుకున్నాం.

-కొలువు కొట్లాడి తెచ్చుకుంటాం.

-ఎన్నటికైనా కుర్చీలో మళ్ళీ కూర్చుంటాం.

-మీ కళ్ల ముందే దర్జా వెలగబెడతాం!

-అప్పుడు మరింత సంపాదిస్తాం.

హైదరాబాద్‌,నేటిధాత్రి:

తెలంగాణలో అధికారుల అవినీతికి హద్దూ బద్దూ లేకుండాపోతోంది. మరీ అన్యాయానికి తెగబడుతున్నారు. మేం లేకపోతే వ్యవస్ధే లేదు. దాని మనుగడే లేదు. ప్రజలకు సేవలే అందవు. సమాజం ఆగమౌతుందన్న ధోరణి అధికారుల్లో పెరిగిపోతోంది. మమ్మల్ని అడేవారుండొద్దు. అడ్డు చెప్పేవారుండొద్దు. మేం ఎవరికీ సమాధానం చెప్పం. మమల్ని ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదన్న అహం బాగా పెరిగిపోయింది. కారణం తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగుల పాత్రను మరీ పెద్దది చేసి చూపించడమే ఇందుకు కారణం. తెలంగాణ ఉద్యమంలో సగటు తెలంగాణ వాది ఎలాంటి లాభాపేక్ష లేకుండా పాలుపంచుకున్నాడు. తాను సర్వం కోల్పోయినా సరే తెలంగాణ ఆత్మాభిమానం కోసం పనిచేశాడు. కాని ఉద్యోగులు పెన్‌ డౌన్‌ చేసినా జీతాలు అందుకున్నారు. ఉద్యమంలో పాల్గొంటూనే జీతాలు తీసుకున్నారు. విధులకు హజరు కాకుండా తమ పెత్తనాన్ని చూపించారు. పనులు పక్కన పెట్టారు. తెలంగాణ ఉద్యమం పేరుతో తెలంగాణ ప్రజలకు సేవలందించేందుకు కూడా ముందుకు రాలేదు. కాకపోతే తెలంగాణ సమాజం వైపు నిలిచారన్న ఒకే ఒక్క కారణం వుంది. ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించారే తప్ప, రోడ్లమీదకొచ్చిన పెద్దగాచేసిందేమీ లేదు. కాని ఆనాడు కేసిఆర్‌ వారిని నెత్తిన పెట్టుకున్నాడు. తెలంగాణ వచ్చిన తర్వాత వారికి విపరీతంగా జీతాలు పెంచారు. ప్రెండ్లీ ఎంపాయిస్‌ పేరుతో వారికి విపరీతమైన స్వేచ్ఛనిచ్చాడు. అదే తెలంగాణ సమాజం పాలిట శాపమైంది. ఏ పని చేసినా ఉద్యోగులకు అనుకూలంగా, సగటు వ్యక్తికి వ్యతిరేకంగా పరిణమించింది. దాంతో అధికారులకు బలమొచ్చినట్లైంది. ప్రభుత్వం తమ పక్షాన వుందన్న భరోసా మరింత పెరిగింది. ఏంచేసినా ఆనాటి ప్రభుత్వం స్పందించకపోవడం జరిగింది. పైఆ ఉద్యోగులను నిలదీస్తే వారి విధులకు ఆటంకం కల్పించారంటూ ప్రజల మీదే అదికారులు దౌర్జన్యం చేసే స్దితికి చేరింది. ఇదంతా ప్రజలను వంచించేందుకు,దోచుకునేందుకు మార్గం ఏర్పడిరది. తెలంగాణ ప్రజలు తల్లడిల్లేదాకా తెచ్చింది. పాలకుల చేతి కాని తనం వల్లనే ఇదంతా జరిగింది.

ఎక్కడ ఉద్యోగులు కేసిఆర్‌ను నిందిస్తారో అని ఉద్యోగులను పల్లెత్తు మాట అనలేదు.

తప్పు చేస్తే సహించేది లేదని ఏనాడు హెచ్చరించలేదు. పేద ప్రజలను ఇబ్బందులకు గురి చేయొద్దని సూచించలేదు. అవినీతికి పాల్పడితే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని హెచ్చరికలు జారిచేయలేదు. దాంతో తెలంగాణ వచ్చిన నాటి నుంచి ఉద్యోగులు పని చేయడం మానేశారు. పనికి ఆహార పధకం లాగా ప్రతి పనికి ఓ రేటు ఫిక్స్‌ చేసుకొని ప్రజలను లూటీ చేయడం మొదలు పెట్టారు. ఇంతలో ధరణి వచ్చింది. కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్లు, అదికారులు మరింత ప్రజలను దోచుకునేందుకు కొత్త అవకాశం ఏర్పడిరది. ఇక సంపాదనే సంపాదన. పెరిగిన జీతాలు కూడా వారి అడ్డగోలు సంపాదన కింత పల్లిబఠానీలుగా మారిపోయాయి. అసలు జీతాల గురించి ఆలోచించే స్దాయి దాటిపోయింది. అందుకే గత ప్రభుత్వంలో జీతాలు ఎప్పుడు పడినా అడిగిన నాధుడు లేడు. ఎందుకంటే వారికి జీతాలు సకాలంలో అందకపోయినా, నిత్యం జేబు నిండుతుంటే, చిల్లర ఖర్చులాంటి జీతాల గురించి ఆలోచించడమే మానేశారు. ఏ ఒక్కనాడు ప్రభుత్వం సరైన సమజానికి జీతాలు ఇవ్వడం లేదని ప్రశ్నించలేదు. ఏ అధికారికైనా రకరకాల రుణాలుంటాయి. వాటిని నెల మొదట్లోనే బ్యాంకులు వసూలు చేసుకుంటాయి. కాని ఏ ఒక్కనాడు ఏ ఒక్క ఉద్యోగి మేం బతకలేకపోతున్నామని చెప్పలేదు. మేం కట్టుకునే ఈఎంఐలకు ఇబ్బందులెదురౌతున్నాయి. వడ్డీలు చెల్లించాల్సివస్తుందని ప్రభుత్వాన్ని ప్రశ్నించి దాఖలాలు లేవు. సమాయానికి జీతాలు ఇవ్వకపోయినా, ఎప్పుడు వేసినా ఉద్యోగులు చప్పుడు చేయకపోవడం ప్రభుత్వానికి వెసులుబాటుగా మారింది. కాని ప్రజలను అధికారులు దోచుకుతింటున్నారన్న సంగతి మర్చిపోయింది.

ఏశాఖ చూసినా ఇదే తంతు. ముఖ్యంగా రెవిన్యూ, రిజిస్ట్రేషన్‌, వైద్య శాఖల్లో విపరీతమైన అవినీతి పెరిగిపోయింది.

ఒక రైతు తన భూమిని తన పేరుమీద పట్టా చేసుకోవాలన్నా,తన వారసుల మీదకు మార్చుకోవాలన్నా, ధరణిలో లోపాలు సరిదిద్దే క్రమంలో అదికారులు రైతుల నుంచి లక్షలు వసూలు చేశారు. ఒక్కొ నెల లక్షలు దోచుకున్నారు. ఇది ఏ ఒక్క కార్యాలయంలోనో కాదు. తెలంగాణ వ్యాప్తంగా ఇదే పరిస్దితి. పాస్‌ బుక్కులు కావాలంటే తహసిల్ధార్‌కు లక్షలు ముట్ట జెప్పాల్సిందే. అదేమంటే భూముల ధరలు పెరగలేదా? అని ఎదురు ప్రశ్నించడం వింతైన వితండ వాదం. రైతుల భూముల ధరలు పెరిగితే అదేదో రెవిన్యూ వ్యవస్ధ పుణ్యమైనట్లు దోచుకోవడం అలవాటు చేసుకున్నారు. ఇక రిజిస్రేషన్‌ శాఖలో నిత్య సంతర్పణలకు లెక్కేలేదు. ప్రజల రక్తం జలగల్లా తాగుతున్నారు. ఓ వైపు ప్రభుత్వానికి చెల్లించాల్సిన రుసుము చెల్లిస్తున్నప్పుడు అధికారులకు లంచం చెల్లించాల్సిన అవసరం లేదు. కాని లంచం ఇవ్వకుండా పనులు జరక్కపోవడం అంటే పాలకుల్లో చిత్తశుద్ది లేకపోవడమే అవుతుంది. అసలు అధికారులు ప్రతి పనికి ఒక రేటు ఫిక్స్‌ చేసుకొని పని చేయడం ఏమిటి? ప్రజలు కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరగడమేమిటి? అయినా సకాలంలో పనులు చేయకపోవడమేమిటి? గత పదేళ్లుగా ఒకే చోట పని చేయడమేమిటి? ఎక్కడైతే పనిచేస్తున్నారో అక్కడ ఆస్ధులు కూడబెట్టుకోవడం ఏమిటి? ఇంత భహిరంగంగా అవినీతికి పాల్పడడమేమిటి? అవినీతికి కొన్ని శాఖలు కేరాఫ్‌ అడ్రస్‌గా మారిపోయాయి.

అలాంటి శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులు లంచాలు తీసుకుంటూ రెడ్‌ హ్యాండెడ్‌గా దొరుకుతున్నారు.

అయినా దొరికిత ఏమౌద్ది అనే దాకా వచ్చిందంటే వారు ఆర్దికంగా ఎంత బలపడ్డారో అర్దం చేసుకోవచ్చు. కొన్నిశాఖల్లో ఉన్నతాదికారులుగా పనిచేసిన ఎంతో మంది గత శాసన సభ ఎన్నికల్లోనూ పోటీ చేసేందుకు సిద్దపడ్డారు. ఎన్ని వందల కోట్లైనా ఖర్చు చేస్తామని టికెట్లు కావాలన్నారు. అలా కొంత మంది పోటీ కూడా చేశారు. అంతగా వారికి ఆస్ధులు కూడడానికి వారు చేసిన వ్యాపారాలేమీ లేదు. కేవలం ప్రజలను పీడిరచి, సంపాదించిన సొమ్ములే తప్ప కష్టపడిన సొమ్ము ఒక్క రూపాయి వుండదు. అసలు పట్టుబడుతామన్న భయం లేదు. పరువు పోతుందన్న ధ్యాస లేదు. నేరం చేస్తున్నామన్న భావన అసలేలేదు. ప్రజల పన్నులతో జీతాలుతీసుకుంటున్నామన్న సోయి లేదు. ప్రజలకు సేవ చేసేందుకే తామున్నామన్న కృతజ్ఞత లేదు. కేవలం ప్రజలను పీడిరచుకుతినేందుకే వున్నామన్నకుంటున్నారో ఏమో కాని పని కోసం సామాన్యుడు ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లాలంటే భయపడుతున్నాడు. ఇక ముఖ్యంగా ప్రజల ఆర్యోగాలను కాపాడాల్సిన వారు కూడా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ప్రజలకు ఆరోగ్య సౌకర్యాల కల్పన కోసం ప్రభుత్వాలు ఇచ్చే నిధులను నీళ్లలా ఖర్చు చేస్తున్నారు. దుబారా చేసి చేతులు దులుపుకుంటున్నారు. వైద్య వృత్తికే కళంకం తెస్తున్నారు. ప్రభుత్వ జీతాలు తీసుకుంటూ పేద ప్రజలకు ఉచిత వైద్య సేవలు చిత్తశుద్దితో చేయాల్సిన వాళ్లు, ప్రైవేటు ఆసుపత్రులు ఏర్పాటు చేసుకొని, ప్రభుత్వ వైద్యానికి ఎగనామం పెడుతున్నారు. జీతాలు మాత్రం తీసుకుంటున్నారు. ఇతర నిధులు మింగేస్తున్నారు. మందులు పక్కదారి పట్టిస్తున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే వైద్య రంగంలో వున్నవారు చేస్తున్న అవినీతి అంతా ఇంతా కాదు. వైద్యాధికారుల అవతారమెత్తి, పాలక పెద్దల ఆశీస్సులతో ఏళ్ల తరబడి ఒకే చోటు ఉద్యోగాలు చేస్తూ, అక్కడే ప్రైవేటు ఆసుపత్రులు నిర్వహించుకుంటున్నారు. ప్రజా ధనం రెండు రకాలుగా లూటీ చేస్తున్నారు. పట్టుబడినా ఏమౌతుందన్న ధీమానే వారిలో కనిపిస్తోంది. అందుకే ఎంత మంది ఇటీవల పట్టుబడుతున్నా, అవినీతి లంచావతారుల ఆగడాలు ఆగడం లేదు. లంచాలు తీసుకోవడం మానడం లేదు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి మంచి అవకాశం. తెలంగాణలో అవినీతి రహిత పాలన అందిస్తే చరిత్రలో నిలిచిపోతారు. భవిష్యత్తు తరాల చేత కీర్తింపబడతారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *