ప్రజల నుంచి విజ్ఞప్తులను వినతులను స్వీకరించిన మంత్రి కొండా సురేఖ
హన్మకొండ, నేటిధాత్రి:
అటవీ,పర్యావరణ,దేవాదాయ శాఖ మంత్రి వర్యులు శ్రీమతి కొండా సురేఖ హనుమకొండ రామ్ నగర్ లో తమ నివాసంలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని వివిధ వర్గాల ప్రజలు రాంనగర్ లోని తమ నివాసానికి చేరుకుని తమ సమస్యలను మంత్రి కొండా సురేఖకి విన్నవించారు. వారి సాధకబాధకాలను మంత్రి కొండా సురేఖ గారు సహృదయంతో విని సంబంధిత పలువురు అధికారులతో అప్పటికప్పుడే ఫోన్లో మాట్లాడి సమస్యలను పరిష్కరించారు. సులువుగా పరిష్కరించాల్సిన సమస్యల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులను మంత్రి సురేఖ మందలించారు. మరోసారి బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించినట్లు తన దృష్టికి వస్తే కఠిన చర్యలకు వెనకాడనని మంత్రి సురేఖ వారికి స్పష్టం చేశారు.ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ, ఏ సమస్యలున్నా ప్రజలు తనను సంప్రదించవచ్చునని కొండా సురేఖ ప్రజలకు స్పష్టం చేశారు. సమస్యల పరిష్కారం దిశగా అధికారుల నుంచి సరైన స్పందన లేనిపక్షంలో తనకు తెలియజేయాలని వారికి సూచించారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుందని మంత్రి కొండా సురేఖ స్పష్టం చేశారు. బడుగు, బలహీన వర్గాలజీవితాల్లో వెలుగులు నింపేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో సంక్షేమ పథకాలను అమలుచేస్తున్నదని మంత్రి కొండా సురేఖ వారికి భరోసానిచ్చారు.