ప్రశాంతి నిలయంలో విద్యార్థులకు నిత్యావసర మరియు వ్యక్తిగత వినియోగ వస్తువుల పంపిణీ
కరీంనగర్, నేటిధాత్రి:
మ్యాక్స్ ఫౌండేషన్ సహకారంతో
రైజింగ్ సన్ యూత్ క్లబ్ ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెలిచాల గ్రామ శివారులోని ప్రశాంతి నిలయంలో ఉన్న పిల్లలకు అల్పాహారానికి సంబంధించిన మరియు వ్యక్తిగత వినియోగ వస్తువులు పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని రైజింగ్ సన్ యూత్ క్లబ్ అధ్యక్షులు, యువజన అవార్డు గ్రహీత గజ్జెల అశోక్ తెలిపారు. ఈకార్యక్రమంలో జుట్టు నూనె, హెయిర్ బ్రష్, సబ్బులు వంటి అవసరమైన వస్తువులను అందజేశారు. ఈసందర్భంగా మ్యాక్స్ ఫౌండేషన్ సంస్థ ఫౌండర్ మహేష్ కుమార్ మ్యాక్స్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ, సామాజిక బాధ్యతగా పిల్లలకు పదకోండు వేల రూపాయల విలువ గల ఆరోగ్యకరమైన అల్పాహారం అందించడం, వారి వ్యక్తిగత పరిశుభ్రతకు అవసరమైన వస్తువులను అందించడం మాలక్ష్యం అని తెలిపారు. అనంతరం యువజన అవార్డు గ్రహీత గజ్జెల అశోక్ మాట్లాడుతూ ఇటువంటి కార్యక్రమాలకు స్థానిక వ్యక్తులు, దాతలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు హాజరై పిల్లలకు సహాయంగా ముందుకు రావాలని ఆకాంక్షించారు. ఈకార్యక్రమంలో రైజింగ్ యూత్ క్లబ్ ప్రధాన కార్యదర్శి జేరిపోతుల మహేష్, సహాయ కార్యదర్శి గజ్జెల నవీన్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.