ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ‘మన గ్రంథాలయం – జ్ఞానోత్సవం
పోటీ పరీక్షల సెల్‌కు రూ.50 వేల పుస్తకాలు, రీడింగ్ చైర్స్ అందజేసిన డాక్టర్ రవీందర్ చౌకిదార్
నర్సంపేట, నేటిధాత్రి:
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాల అటానమస్ నర్సంపేటలో ‘మన గ్రంథాలయం-జ్ఞానోత్సవం’ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రిన్సిపల్ ప్రొఫెసర్ మల్లం నవీన్ అధ్యక్షతన, గ్రంథపాలకుడు ఆర్.గణేష్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి మహబూబాబాద్ మెడికల్ కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్, సుశ్రుత ఫౌండేషన్ వ్యవస్థాపకుడు డాక్టర్ ఎం.రవీందర్ చౌకిదార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కళాశాల కాంపిటీటివ్ ఎగ్జామ్స్ సెల్‌కు రూ.50 వేల విలువైన పుస్తకాలు, రీడింగ్ చైర్స్ అందజేసి విద్యార్థుల భవిష్యత్తుకు తన వంతు సహకారం అందించారు.
గ్రంథాలయంలో ప్రత్యేక పుస్తక ప్రదర్శన ఏర్పాటు చేయగా విద్యార్థులు ఆసక్తిగా తిలకించారు. విద్యార్థిని హర్షిని రచించిన పుస్తకాన్ని ఆవిష్కరించి అభినందించారు. గ్రంథాలయాన్ని సమర్థవంతంగా వినియోగించుకుని బెస్ట్ రీడర్‌గా నిలిచిన బెత్తం అఖిలను సన్మానించారు.ప్రిన్సిపల్ మల్లం నవీన్ మాట్లాడుతూ గ్రంథాలయం విద్యార్థుల జ్ఞానానికి నిలయమని, పుస్తక పఠనంతో ఆలోచనా శక్తి, విశ్లేషణా సామర్థ్యం, వ్యక్తిత్వ వికాసం పెరుగుతాయన్నారు. పోటీ పరీక్షల్లో విజయం సాధించాలంటే పుస్తకాలతో స్నేహం అవసరమన్నారు.ముఖ్య అతిథి డాక్టర్ రవీందర్ చౌకిదార్ మాట్లాడుతూ పుస్తకాలు మనిషి జీవితాన్ని మార్చగల గొప్ప మిత్రులని, చదివే అలవాటు ఉన్న విద్యార్థులు ఉన్నత శిఖరాలు అధిరోహిస్తారన్నారు. విద్యార్థులు పాఠ్యపుస్తకాలతో పాటు జీవిత చరిత్రలు, విజ్ఞాన శాస్త్రం, పోటీ పరీక్షలు, వ్యక్తిత్వ వికాస పుస్తకాలు చదవాలని సూచించారు. భవిష్యత్తులో కళాశాల గ్రంథాలయ అభివృద్ధికి, పోటీ పరీక్షల పుస్తకాలకు తాను ఎల్లప్పుడూ సహకరిస్తానని హామీ ఇచ్చారు.
అకాడమిక్ కోఆర్డినేటర్ డాక్టర్. కందాల సత్యనారాయణ, ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కోఆర్డినేటర్ ఎస్.కమలాకర్, అసిస్టెంట్ లైబ్రేరియన్ లావణ్య, అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
