సిద్దిపేట మెడికల్ కాలేజ్ విద్యార్థిని ఆత్మహత్య కేసులో కీలక మలుపు
◆-: ప్రేమ వ్యవహారమే కారణమని తేల్చిన పోలీసులు డాక్టర్ ప్రణయ్ అరెస్ట్
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ నియోజకవర్గం సిద్దిపేట మెడికల్ కాలేజీలో చదువుతున్న విద్యార్థిని లావణ్య ఆత్మహత్య కేసు కీలక మలుపు తిరిగింది. ఈ ఘటనకు ప్రేమ వ్యవహారమే ప్రధాన కారణమని పోలీసులు నిర్ధారించారు. లావణ్య ఆత్మహత్యకు కారణమైన డాక్టర్ ప్రణయ్ తేజ్ను సిద్దిపేట పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల విచారణలో లావణ్య, ప్రణయ్ తేజ్ గత ఏడాది నుంచి ప్రేమ సంబంధం కొనసాగిస్తున్నట్లు వెల్లడైంది. అయితే పెళ్లి విషయానికి వచ్చేసరికి కులం వేరని సాకుతో ప్రణయ్ వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. ఈ విషయం లావణ్యను తీవ్ర మానసిక ఒత్తిడికి గురిచేసిందని పోలీసులు పేర్కొన్నారు. పాయిజన్ ఇంజెక్షన్ వేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు దర్యాప్తులో తేలింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు సాంకేతిక ఆధారాలు, కాల్ రికార్డులు, చాట్ వివరాలను పరిశీలించి ప్రణయ్ను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన వైద్య విద్యార్థుల భద్రత, మానసిక ఆరోగ్యంపై మరోసారి చర్చకు దారి తీసింది. కేసుపై మరింత లోతైన విచారణ కొనసాగుతోందని సిద్దిపేట పోలీసులు తెలిపారు.
