https://epaper.netidhatri.com/view/315/netidhathri-e-paper-10th-july-2024
పిర్జాధిగూడ లాంటి కాలనీలలోనేనా…
చిత్రపురి ‘‘రోహౌస్’’ల మీదకు రావా!
సర్వే నెంబర్’’327 పైకి’’ షేక్ పేటకు వెళ్లవా!
`చిత్రపురిలో పెద్దల బాగోతం….షేక్ పేటలో రియల్ మాయాజాలం!
`చిత్రపురిలో గద్దల వేషాలు.. షేక్ పేటలో రియల్ మోసాలు!
`అప్పుడు తప్పు…ఇప్పుడు ఒప్పు!
`పెద్దలకు గొడుగు…పేదలు దిగదుడుపు!
`చిత్రపురిలో రో హౌస్‌లు.
`షేక్ పేటలో చకచకా అప్పార్డుమెంట్లు.
`ఫిర్జాది గూడలో బుల్డోజర్లు.
-దోళ్ల ఇండ్లు కూల్చివేతలు.
-చిత్రపురి మోసాలు పట్టవా!
-షేక్ పేట కబ్జాలు మర్చిపోయారా!
-చిత్రపురి భూమి కార్మికులకే అంటిరి.
-ఆ భూములు కార్మికులకే చెందాలంటిరి.
-ఎన్నికల మ్యానిఫెస్టోలో పెడితిరి.
-కార్మికుల గోడు గాలికొదిలేస్తిరి.
-సినీ పెద్దలు అందులో దూరిరి.
-14 ఎకరాలు ఆక్రమించుకొనిరి.
-220 సినీ పెద్దలు కేక్‌ను కట్ చేసి
పంచుకున్నట్లు పంచుకొనిరి.
-చిత్రపురిలో రో హౌస్ ల పేర పాగా వేసిరి.
-అప్పార్టుమెంట్లు కట్టాల్సిన చోట రో హౌస్ లు కట్టిరి.
-పేద కార్మికులకు దక్కకుండా చేసిరి.
-‘‘327 పైకి’’ ప్రభుత్వ భూమి అని చెప్పిందే రేవంత్ రెడ్డి.
-మీడియా సమావేశాలు పెట్టి ప్రశ్నించిందే సిఎం. రేవంత్.
-పిసిసి. చీఫ్‌గా వున్నప్పుడు నా చేతిలో అధికారం వుంటే ఆపేస్తానంటివి.
-సిఎం అయ్యాక షేక్ పేట భూమి సంగతి మర్చిపోతివి.
-అక్కడ అప్పార్టుమెంట్లు నిర్మాణం జరుగుతుండె.
-శ్మశానాన్ని కూడా వదలకుండా కజ్జా కావట్టే.
-అమ్మవారి గుడి స్థలం గుటుక్కున మింగవట్టే.
-బోనాలకు కూడా జాగ లేకుండా చేయవట్టే.
`అప్పనంగా కబ్జాలు చేసి అప్పార్టుమెంట్లు కట్టవట్టే.
`‘‘327 పైకి’’ సర్వే నెంబర్ లో 30 ఎకరాల పార్కుండాలే అంటివి.
`అన్యాక్రాంతమౌతున్నా పట్డించుకోరా!
హైదరాబాద్,నేటిధాత్రి:
రాజకీయ పార్టీలకు, నాయకులకు కొన్ని విచిత్రమైన లక్షణాలుంటాయి. ఏ పార్టీ నాయకుడైనా సరే…ఒక దశలో అందరూ ఒకేలా వ్యవహరిస్తుంటారు. తాను అధికారంలోకి రావాలన్నప్పుడున్నంత శ్రద్ద అదికారంలోకి వచ్చిన తర్వాత వుందు. అధికారంలోకి రావడానికి ఎన్నేళ్లైనా కష్టపడతారు. ఎన్ని సార్లు ఓడినా మళ్లీ మళ్లీ గెలుపుకోసం ప్రయత్నిస్తారు. ఒక్కసారైనా పాలకపక్షంలో ఉండాలని కోరుకుంటారు. ప్రజలను పాలించాలని కోరుకుంటారు. అందుకోసం ఎంతో శ్రమిస్తుంటారు. అలాంటి శ్రమనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా చేశారు. తాను ముఖ్యమంత్రి కావాలన్నదే తన కల అంటూ మొదటి నుంచి చెబుతూ వచ్చారు. ముందు తాను ఎమ్మెల్యే కావాలనుకున్నారు. తర్వాత పిపిసి. ప్రెసిడెంటు కావాలనుకున్నారు. అయ్యారు. ఇలా అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చారు. సిఎం కావాలని బలంగాకోరుకున్నారు. అయ్యారు. ఇ ంత వరకు బాగనే వుంది. కాని ఎన్నికల సమయంలో, ప్రతిపక్షంలో వున్నప్పుడు నిత్యం ప్రతి క్షణం ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు ప్రయత్నిసార్తు. వాటి పరిష్కారానికి పోరాటం చేస్తారు. అలా సిఎం.రేవంత్ రెడ్డి వద్దకు కూడా ఆయన పిపిసి. అధ్యక్షుడుగా వున్న సమయంలో అనేక సమస్యలు ఆయన దృష్టికి వచ్చేవి. కాలుకు బలపం కట్టుకొని ఆయన తిరిగేవారు. కాని ఒక్కసారి అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ కాలం మర్చిపోతారు. ఇది ఒక్క రేవంత్ రెడ్డి విషయంలోనే కాదు. అందరూ అలాగే వుంటారు. ప్రతిపక్షంలో వున్నప్పుడు ప్రజలను కలిసేందుకు సమయం వుంటుంది. కాని అధికారంలోకి వచ్చినప్పుడు జనాన్ని నేరుగా కలిసే సమయం వుండదు. తీరిక వుండదు. ప్రతిపక్షంలో వున్నప్పుడు ఇచ్చిన మాటలు గుర్తుండవు. కాకపోతే వారికి బాధితులైనా గుర్తు చేయాలి. మీడియా గుర్తు చేయాలి. అలాంటి సమస్యలే ఇక్కడ రెండు వున్నాయి.
సిని రంగానికి చెందిన కార్మికుల జీవితాలు గత ముప్పై ఏళ్లుగా ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లున్నాయి. ఒక అడుగు ముందుకు పడినట్లు కనిపించినా,మళ్లీ పది అడుగులు వెనక్కి పడుతుంటాయి. దాంతో కార్మిక లోకం పడే బాద అంతా ఇంతా కాదు. తమ సమస్యలు తీర్చాలంటూ గత పాలకుల ముందుకు ఎన్నిసార్లు తిరిగినా వాళ్లు పట్టించుకోలేదు. పైకి పెద్ద పెద్ద మాటలు చెప్పి,పేద వారి మీది మొసలి కన్నీరు కార్చిన బిఆర్‌ఎస్ పెద్దలు ఎవరూ పేదల పక్షాన నిలిచింది లేదు. పేద సినీ కార్మికులకు న్యాయం చేసింది లేదు. పైగా వారి జీవితాల్లో కొంత మంది బిఆర్‌ఎస్ నేతలే నిప్పులు పోశారు. తమకు సంబంధం లేని చిత్రపురిలో రోహౌస్‌లు కొట్టేశారు. పిట్ట పోరు, పిట్ట పోరు పిల్లి తీర్చిందన్నట్లు కార్మికులు తమ బాధలు చెప్పుకుంటే, పెద్దలతో చేతులు కలిపి, గత బిఆర్‌ఎస్ పెద్దలు రోహౌస్‌లలో పాగా వేశారు. కంచె చేను మేసినట్లు చేశారు. ఆ సమయంలో కార్మికులు తమ సమస్యలను కాంగ్రెస్ పార్టీ నాయకుల దృష్టికి పదే పదే తీసుకెళ్లారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు చిత్రపురి కార్మికుల నిరసన కార్యక్రమాలకు హజరై వారికి సంఫీుబావం తెలిపారు. వారికి అండగా వుంటామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికూడా వారు కలిసినప్పుడు భరోసా ఇచ్చారు. వారిని ఆదుకుంటామని మాట ఇచ్చారు. తాము అధికారంలోకి వస్తే కార్మికులకు న్యాయం చేస్తామని చెప్పారు. చిత్రపురిలో ఏ ఒక్క కార్మికుడికి అన్యాయం జరక్కుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. పేదల భూమి పేదలకే చెందేలా చూస్తామన్నారు. పేద సినీ కార్మికుల జీవితాలలో వెలుగులు నింపుతామన్నారు. వారికి నీడ కల్పించే బాధ్యత తాము తీకుంటామని మాటిచ్చారు. అర్హలైన సినీ కార్మికులందరికీ ప్లాట్లు వచ్చేలా చేస్తామన్నారు. రోహౌస్‌లు లేకుండా చేస్తామన్నారు. వాటి కూల్చి వాటి స్ధానంలో అప్పార్టుమెంట్లు కట్టిస్తామన్నారు. నిజానికి 628 జీవో ప్రకారం కూడా అదే జరగాలి. చిత్రపురిలో అసలు ప్రత్యేక ఇండ్లకు ఆస్కారమేలేదు. ఆ అవకాశమే లేదు. వేలాది మంది కార్మికులకు న్యాయం జరగాలంటే, వారి సొంతింటికల నెరవేరాలంటే అందరికీ ఫ్లాట్లు రావాలి. అంటే అక్కడ అప్పార్లుమెంట్ల నిర్మాణమే జరగాలి. ప్రభుత్వం ఇచ్చిన జీవోలో ఇదే విషయాన్ని సూటిగా, స్పష్టంగా చెప్పారు. కాని కొందరు పెద్దలు ప్రభుత్వ ఆదేశాలను తుంగలో తొక్కారు. జిహెచ్‌ఎంసి అధికారులను తప్పుదోవ పట్టించారు. సినీ పెద్దలు 220 మంది చిత్రపురిలోని ఓ పద్నాలుగు ఎకరాలు ఆక్రమించుకున్నారు. రో హౌజ్‌ల కోసం భూమిని కేక్ పంచుకున్నట్లు పంచుకున్నారు. ఇండ్లు కట్టుకున్నారు. వాటిని ఎట్టి పరిస్ధితుల్లో కూల్చేసి, కార్మికులకు న్యాయం చేస్తామన్నారు. మరి ఏమైంది? ఇంత వరకు చిత్రపురి మీద దృష్టిపెట్టింది లేదు. రో హౌస్‌ల మీద దృష్టిపెట్టింది లేదు. కార్మికులకు న్యాయంచేసింది లేదు. ఎన్నికల మ్యానిఫెస్టోలోని అంశానికి దిక్కులేదు.
ఇక షేక్‌పేటలోని 327పైకి అనే సర్వే నెంబర్ రియల్ మాఫియా మాజా జాలం గురించి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి పూర్తిగా తెలుసు. ఆ స్ధల వివాదం మీద పూర్తి అవగాహన వుంది. అదంతా ప్రభుత్వ భూమి అన్న సంగతి రేవంత్‌రెడ్డికి తెలియంది కాదు. రేవంత్ రెడ్డి కి ఈ భూ వివాదం తెరమీదకు వచ్చినప్పుడే వెళ్లి పర్యవేక్షించారు. ఆ భూమి వివరాలు తెలుసుకున్నారు. పూర్తి అవగాహనతోనే షేక్‌పేటలోని ఆ స్ధలంలోనే మీడియా మిత్రులతో మాట్లాడారు. ఇది ముమ్మాటికీ ప్రభుత్వ భూమి. దీనిని ఎవరు సొంతం చేసుకున్నా భవిష్యత్తులో ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది. ముఖ్యంగా త్వరలోనే మా ప్రభుత్వం వస్తుంది. ఈ భూమిని రక్షిస్తుంది. అని సాక్ష్యాత్తు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. దీనిపై అప్పట్లో ఓ ఆంగ్ల దినపత్రికలో నిత్యం వార్తలు వచ్చేవి. వాటిపై రేవంత్ రెడ్డి అనేక సార్లు స్పందించడం కూడా జరిగింది. జూబ్లీహిల్స్, బంజార హిల్స్ ప్రజలకు ఒక్క కేబిఆర్ పార్కు తప్ప మరొకటి లేదు. ఇంత పెద్ద నగరంలో ఆ ఒక్క పార్కు ప్రజలకు సరిపోదు. షేక్ పేటలో వున్న ఈ 327 పైకి లోని 30 ఎకరాలు పార్కుగా మార్చుతామన్నారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటే ఆ పనులు చేపడతామన్నారు. అక్కడ జరుగుతున్న రియల్ వ్యాపారాన్ని నమ్మిమోసపోవద్దని ప్రజలను కోరారు. కాని అక్కడ వ్యాపారం ఆగలేదు. భూ ఆక్రమణలు ఆగలేదు. ఆఖరుకు 327 సర్వే నెంబర్‌లో భూమిని సొంతం చేసుకున్న వ్యాపారి అక్కడున్న స్మశాన వాటికను కూడా వదలకుండా కమ్మేస్తున్నాడు. సమాధులు కూడా తవ్వేసి, ప్లాట్లు చేస్తున్నాడు. నేటిధాత్రి వరుస కథనాలతో అక్కడ ఏర్పాటు చేసిన రేకులు తొలగించినట్లు చేసిన అదికారులు మమ అనిపించారు. కాని అక్కడ జరుగుతున్న తంతును ఆపలేదు. ఇప్పటికీ అక్కడ నిర్మాణాలు అడ్డుకోవడంలేదు. ఎక్కడిక్కడ అప్పార్టుమెంట్ల నిర్మాణం చకచకా సాగుతున్నాయి. కాని ప్రభుత్వం వినిపించుకున్నది లేదు. చూసింది లేదు. ఇప్పటి వరకు ఆ భూమి గురించి ఆరా తీసిందిలేదు. ఎన్నికల ముందు ఎన్నో మాటలు చెప్పిన రేవంత్‌రెడ్డికి తీరిక లేదు. అని స్ధానిక ప్రజలు అంటున్నారు. బోనాల పండుగ మొదలైంది. ఇదే సర్వే నెంబర్‌లో అమ్మవారి గుడి వుంటుంది. అక్కడ పెద్దఎత్తున ఏటా బోనాల పండుగ జరగుతుంది. అమ్మవారి జాతర కోసం ఇక్కడ వున్న భూమిని అంతా ఆక్రమించుకున్నారు. గుడి ముందు పార్కు అంటూ కొంత స్ధలాన్ని వదిలేసి, అక్కడే భోనాల సమర్పణ చేసుకొమ్మంటున్నాడు. ఈ అన్యాయం రేవంత్‌రెడ్డికి అప్పుడు కనిపించింది. ఇప్పుడు కనిపించడం లేదా? అని ప్రజలు అంటున్నారు. ఇప్పటికైనా దీనిపై దృష్టిపెడితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేదల పక్షపాతి అన్న పేరు సార్ధకమౌతుంది. లేకుంటే అందరూ తాను ముక్కలే అని జనం ముక్తాయించుకోవాల్సివస్తుంది. ఎందుకంటే పిర్జాది గూడలో పేదలు రూపాయి రూపాయి కూడబెట్టుకొని ఇండ్లు కట్టుకొని కొన్నేండ్లుగా జీవిస్తుంటే బుల్డోజర్లు వెళ్లాయి. ఆ పేదల ఇండ్లను నేల మట్టం చేశాయి. మరి చిత్రపురిలోకి బుల్డోజర్లు వెళ్లవా? సినీ పెద్దలు అక్రమంగా నిర్మాణం చేసుకున్న రో హౌస్‌లను కూల్చవా? 327 ఫైకి సర్వేనెంబర్‌లో అక్రమంగా వెలుస్తున్న అప్పార్లుమెంట్లను కూల్చరా? ప్రజా ప్రభుత్వమైన రేవంత్ సర్కారులో కూడా పేదలకు ఒక న్యాయం, పెద్దలకు ఒక న్యాయమా? అని అంటున్నారు.