Ghazal Poet Boora Devanandam Felicitated in Hyderabad
గజల్ కవి బూర దేవానందంకు ఘన సత్కారం
సిరిసిల్ల టౌన్ :(నేటి ధాత్రి)
హైదరాబాద్లోని రవీంద్ర భారతి వేదికగా జరిగిన గజల్ సాహిత్య సదస్సు ఘనంగా నిర్వహించబడింది. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ, తెలుగు సాహిత్య అకాడమీ మరియు ‘స్వరవల్లరి’ తెలుగు గజల్ అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.ఈ సదస్సుకు రాష్ట్రంలోని పలువురు ప్రముఖ గజల్ కవులను ప్రత్యేకంగా ఆహ్వానించగా, సిరిసిల్లకు చెందిన గజల్ కవి బూర దేవానందంకు కూడా ఆహ్వానం అందడం విశేషంగా నిలిచింది. సినారే పదాల శైలి ప్రభావంతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కవి దేవానందం, ఈ సందర్భంగా తన రచన “పరిపాలన గతి తప్పితే అరాచకం తెలుసుకో! సుపరిపాలన సాగితే అభ్యుదయం తెలుసుకో!” అనే గజల్ను వినిపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఆయన కవిత్వం సభికుల నుంచి ప్రశంసలు అందుకుంది.కార్యక్రమంలో ‘స్వరవల్లరి’ తెలుగు గజల్ అకాడమీ అధ్యక్షురాలు హిమజా రామం ‘లయన్’ మిరియాల విజయలత, జస్టిస్ మల్యాద్రి చేతుల మీదుగా బూర దేవానందంకు సత్కారం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా రచయితల సంఘం, మానేరు రచయితల సంఘం, సిరిసిల్ల సాహితీ సమితి అధ్యక్షులు, కార్యదర్శులు మరియు సభ్యులు కవి బూర దేవానందంకు అభినందనలు తెలిపారు.
