endalo jagratha, ఎండలో జాగ్రత్త

ఎండలో జాగ్రత్త

జిల్లాలో ఎండ తీవ్రత పెరుగుతుండడంతో ప్రజలు వడదెబ్బకు గురికాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్‌ పి.వెంకట్రామరెడ్డి తెలిపారు. ఈ మేరకు బుధవారం జిల్లా కలెక్టర్‌ ప్రకటన జారి చేసారు. మే నెలాఖరు వరకు ఎండల తీవ్రత అధికంగా ఉంటుందన్నారు. జిల్లాలో ఎండ వేడిమి అధికంగా ఉండడంతో వడదెబ్బ బారిన పడకుండా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. వడదెబ్బకు వద్ధులు, గర్భిణులు, బాలింతలు, పసిపిల్లలు, అనారోగ్యంతో బాధపడుతున్నవారు ఎక్కువగా గురి అవుతున్నారని పేర్కొన్నారు. అలాంటి వారు ఎండ తీవ్రంగా ఉన్నప్పుడు ఇంటి నుంచి బయటికి రావొద్దని సూచించారు. తప్పనిసరి పరిస్థితులలో రావాల్సివస్తే రక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. ఆరుబయట పనిచేసేవారు ఎండ తీవ్రత నుంచి తగిన రక్షణ పొందాలని, పలుచని మజ్జిగ, ఓఆర్‌ఎస్‌ ద్రావణాలను ఎక్కువగా తీసుకుంటే వడదెబ్బ నుంచి ఉపశమనం పొందవచ్చని పేర్కొన్నారు. విపరీతమైన తలనొప్పి, తల తిరగడం, తీవ్రంగా జ్వరం కల్గి ఉండడం, మగత నిద్ర, కలవరింతలు, ఫిట్స్‌, పాక్షికంగా అపస్మారక స్థితిలో ఉంటే వడదెబ్బ లక్షణాలుగా గుర్తించి బాధితుడిని డాక్టరుకు చూపించాలన్నారు. వెంటనే ప్రథమ చికిత్స అందజేయాలని తెలిపారు. వడదెబ్బ తగిలిన వ్యక్తిని త్వరగా నీడ గల ప్రదేశానికి చేర్చడం, శరీర ఉష్ణోగ్రత సాధారణస్థాయికి వచ్చే వరకు చల్లని నీటిలో ముంచిన తడిగుడ్డతో శరీరం తుడవటంతోపాటు ఉప్పు కలిపిన మజ్జిగ, చిటికెడు ఉప్పు కల్గిన గ్లూకోజు ద్రావణం, ఒఆర్‌ఎస్‌ ద్రావణం తాగించాలని పేర్కొన్నారు. ఎండలకు బయటికి వచ్చేటప్పుడు మాత్రం చల్లని మజ్జిగ, నిమ్మరసం, మంచినీరు తాగాలని పేర్కొన్నారు. తీవ్రమైన ఎండలో బయటికి వెళ్లినప్పుడు మాత్రం అనారోగ్య సమస్యలు ఏర్పడితే వెంటనే వైద్యుడిని సంప్రదించి వైద్యం తీసుకోవాలని ఆయన సూచించారు. ప్రభుత్వ నిబంధనల మేరకు వైద్య సిబ్బంది అందుబాటులో ఉండి వడదెబ్బ తగిలిన వ్యక్తులను గుర్తించి మెరుగైన చికిత్స అందించాలని అన్నారు. వడదెబ్బకు గురైన వ్యక్తులు ప్రాథమిక చికిత్స అనంతరం సాధారణ స్థితికి రాకుంటే మెరుగైన చికిత్సకు ప్రభుత్వ ఆసుపత్రులను ఆశ్రయించాలని, స్వచ్చంద సంస్థలు ఎండ తీవ్రతతో కలిగే నష్టాలను ప్రచారం చేయాలని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో 108వాహనాలను వినియోగించుకోవాలని సూచించారు.

వడదెబ్బ లక్షణాలు

1. ఉష్ణోగ్రతలు తీవ్రంగా ఉండే సమయంలో ప్రజలు బయటకు వెళ్లడం, పనిచేయడం మంచిది కాదని, చల్లని నీరు ఎక్కువగా తీసు కోవాలని తెలిపారు.

2. ప్రజలు తప్పని పరిస్థితులలో ఎండలోనికి వెళ్లవలసి వస్తే గొడుగు, తలపై టోపీ, కళ్లకు కూలింగ్‌ అద్దాలు ఉపయోగించాలని చెప్పారు.

3. కూలి పనులకు వెళ్లేవారు ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న సమయంలో కాకుండా తక్కువ ఎండ ఉన్నపుడు పనులు చేసుకుంటే మంచిదని సూచించారు.

4. ఎండ వేడిమికి ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా శరీర ఉష్ణోగ్రతలు తగ్గకుండా ఉంటే తక్షణమే డాక్టర్లను సంప్రదించడం మంచిదని,

వడదెబ్బ వచ్చే అనుకూలతలు చిన్న పిల్లల్లో, వద్ధుల్లో ఎక్కువగా వడదెబ్బ వస్తుందని, ఎండలో ఎక్కువగా పనిచేయడం వల్ల కానీ, ఎక్కువగా తిరగటం వల్ల వడదెబ్బ తగులుతుందని తెలిపారు. ఎండలో, గాలిలేని చోట పనిచేస్తే తక్కువ నీరు, ఉప్పు లవణ ద్రావణాలు తీసుకోకపోవడం వల్ల వడదెబ్బ తగులుతుందని పేర్కొన్నారు.

వడదెబ్బకు ప్రథమ చికిత్స

1. వడదెబ్బకు గురైనట్లు అనుమానం ఉంటే అటువంటి వారిని ఎండ నుంచి గాలి, వెలుతురు, నీడ ఉన్న ప్రదేశానికి వెంటనే తర లించాలని సూచించారు.

2. శరీర ఉష్ణోగ్రతను వెంటనే తగ్గించుకునేందుకు చల్లని నీటితో తడిసిన గుడ్డతో శరీరం అంతటా తుడుస్తూ ఉండాలని అన్నారు.

3. వడదెబ్బకు గురైన వారు ధరించిన దుస్తులు వదులు చేయాలని, చల్లటి గాలి ఉండేటట్లు ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు.

4. వడదెబ్బకు గురైన వారు క్రమం తప్పకుండా చల్లటి నీరు తాగుతూ ఉండాలని చెప్పారు.

వడదెబ్బ తగులకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు

ఎండలో ఎక్కువగా తిరగరాదని, ఎండలో తిరిగేటప్పుడు తలకు టోపీ, గొడుగు, టవల్‌ కానీ ఉపయోగించాలని, ఎక్కువగా పనిచేయకూడదని, ఒకవేళ పనిచేయాల్సి వస్తే ఎక్కువ నీరును ఉప్పుతో కలిపి తీసుకోవాలని సూచించారు. మధ్యమధ్యలో విశ్రాంతి తీసు కుంటూ ఉండాలని, వేడి తాపం వల్ల మొదట కండరాల నొప్పి, అలసట కలుగుతుందని, చెమట ద్వారా శరీరంలోని నీరు బయటకు వెళ్తుందని అన్నారు. దీనిని ఎండ అలసట అంటారని, ఎండలో అలాగే పనిచేస్తే మనిషి అపస్మారకస్థితిలోకి వెళ్లే ప్రమాదముందని తెలిపారు. ఆ సమయంలో ఉప్పు కలిపిన నీటిని తాగాలని, ఎక్కువ ఎండ అలసట వస్తే నీటిలో తడిపిన గుడ్డతో శరీరాన్ని తడిపి చల్లగాలి తగిలేలా పడుకోబెట్టాలని అన్నారు. ఇలా చేయడం వల్ల శరీర ఉష్ణోగ్రత తగ్గుతుందని, అప్పటికీ తగ్గకుండా ఉంటే డాక్టరును సంప్రదించాలని, ప్రజలంతా తప్పనిసరిగా పైసూచనలు పాటించి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని కలెక్టర్‌ పి.వెంకట్రామరెడ్డి విజ్ఞప్తి చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *