పల్లెల్లో అంతర్గత రోడ్ల అభివృద్ధికి కృషి చేస్తా
ఎమ్మెల్యే జీఎస్సార్.
భూపాలపల్లి నేటిధాత్రి
గ్రామీణ ప్రాంత ప్రజలకు రాకపోకలు సులభతరం చేయడం, వ్యవసాయ ఉత్పత్తులకు రవాణా సౌకర్యం కల్పించడం, విద్యార్థులు, కార్మికులు, రోగులు సులభంగా ప్రయాణించేలా చేయడం లక్ష్యంగా భూపాలపల్లి నియోజకవర్గంలోని అన్ని పల్లెల్లో అంతర్గత రోడ్ల అభివృద్ధికి కృషి చేస్తానని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు తెలిపారు. గురువారం భూపాలపల్లి నియోజకవర్గంలోని భూపాలపల్లి మండలంతో పాటు గణపురం మండలంలోని వివిధ గ్రామాల్లో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పర్యటించారు. వివిధ అభివృద్ధి పనులకు జిల్లా అడిషనల్ కలెక్టర్ విజయలక్ష్మీ తో కలిసి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు మొత్తం రూ.390 లక్షల వ్యయంతో వివిధ గ్రామాల్లో రోడ్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు.
భూపాలపల్లి మండలం కమలాపూర్ గ్రామంలో కమలాపూర్ నుండి పెద్దాపూర్ వరకు రూ.20 లక్షలు, ఎస్ యం కొత్తపల్లి నుండి దొమ్మటిపల్లి చెరువు వరకు రూ.100 లక్షలు, గొర్లవీడు గ్రామంలో జడ్పీ రోడ్డు నుండి మల్లయ్యపల్లి వరకు రూ.20 లక్షలు, ట్రాన్స్ఫార్మర్ నుండి మొరంచవాగు వరకు రూ.20 లక్షలు.
గణపురం మండలం రంగారావుపల్లి నుండి దశరథం తండా వరకు రూ. 20 లక్షలు, వీర్లపల్లి(బంగ్లాపల్లి) నుండి చక్రవర్తిపల్లి వరకు రూ.20 లక్షలు, బంగ్లాపల్లి ఎస్సీ కాలనీ నుండి మామిడి తోట వరకు రూ.20 లక్షలు, సీతారాంపూర్ నుండి కొండాపూర్ వరకు రూ.20 లక్షలు, అప్పయ్యపల్లి తూపురం నుండి కొండంపల్లి వరకు రూ.20 లక్షలు, గణపురం చీరలపల్లి చింతల నుండి లబ్బదండ వాగు వరకు రూ.130 లక్షలతో వ్యవసాయ పొలాలకు వెళ్లే అంతర్గత రోడ్ల నిర్మాణపనులకు ఎమ్మెల్యే శంకుస్థాపనలు చేశారు.
ఈ సందర్భంగా ఆయా గ్రామాలల్లో ఎమ్మెల్యే మాట్లాడుతూ… గ్రామీణ రహదారులు బాగుంటేనే ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని, అందుకోసం ప్రభుత్వ నిధులతో పాటు ఇతర పథకాల ద్వారా కూడా రహదారి పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి రోడ్డు సౌకర్యం అందే వరకు కృషి చేస్తానని ఎమ్మెల్యే చెప్పారు. అభివృద్ధి అన్నది పట్టణాలకు మాత్రమే పరిమితం కాకుండా, పల్లెల్లో కూడా సమానంగా ఉండాలి అని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.
గొర్లవీడు గ్రామంలో సీసీ కెమెరాలను ప్రారంభించిన ఎమ్మెల్యే జీఎస్సార్.
నేరాల నియంత్రణలో సీసీ కెమెరాలు కీలకపాత్ర పోషిస్తాయని ఎమ్మెల్యే జీఎస్సార్ అన్నారు. భూపాలపల్లి మండలం గొర్లవీడు గ్రామంలో గ్రామ దాతల సహకారంతో సుమారు రూ.2 లక్షల 50 వేల వ్యయంతో 20 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకున్నారు. కాగా, సీసీ కెమెరాల ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… ఎక్కడైతే శాంతిభద్రతలు పటిష్టంగా ఉంటాయో, అక్కడే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. ప్రజల రక్షణ, భద్రత గురించి పోలీసులు ఎల్లవేళలా పనిచేస్తున్నట్లు తెలిపారు. దొంగతనాలు, నేరాలు, రోడ్డు ప్రమాదాలు, నిందితులను తొందరగా పట్టుకునేందుకు సీసీ కెమెరాలు ఎంతో దోహదపడతాయన్నారు. గొర్లవీడు గ్రామస్తులు దాతల సహకారంతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం మంచి విషయమన్నారు. నియోజకవర్గంలోని అన్ని గ్రామాల ప్రజలు కూడా ముందుకువచ్చి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. గ్రామంలో సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రజల్లో అవగాహన కల్పించి ముఖ్య పాత్ర పోషించిన భూపాలపల్లి పోలీసులను ఎమ్మెల్యే ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, పోలీసులు, కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు