విద్య రంగ సమస్యలు వెంటనే పరిష్కరించాలి
ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు మధ్యాహ్నం భోజనం అందించాలి
జైపూర్,నేటి ధాత్రి:
మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలో పిడిఎస్యు చెన్నూర్ ఏరియా మహాసభ నిర్వహించి నూతన కమిటీ శుక్రవారం ఎన్నుకున్నారు. జిల్లా ఉపాధ్యక్షుడు పి.సికిందర్ ఆధ్వర్యంలో సభను ప్రారంభించారు.ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా పిడిఎస్యు జిల్లా ఇంచార్జి డి.బ్రహ్మానందం,జిల్లా అధ్యక్షుడు రెడ్డి చరణ్ హాజరయ్యారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థి వ్యతిరేక విధానాల అవలంబిస్తూ ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేయడానికి కుట్రలు పన్నుతుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులు ఉదయం గ్రామీణ ప్రాంతం నుండి వచ్చి సాయంత్రం వరకు కళాశాలలో ఉన్నప్పటికీ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం లేక తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుంది.ప్రభుత్వం మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేస్తామని కమిటీలు వేసినప్పటికీ కమిటీలకే, మాటలకే పరిమితమైంది తప్ప ఎక్కడ అమలు గాని పరిస్థితి ఉందన్నారు.ప్రభుత్వం స్పందించి ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చేముందు విద్యారంగంలో ఉన్న సమస్యలు పరిష్కరించడంలో ప్రధాన పాత్ర పోషిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యార్థుల గురించి పట్టించుకునే పరిస్థితి లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం విద్యా కాషాయకరణ పెంచి పోషిస్తూ విద్యార్థుల మెదళ్లను మతోన్మాదం వైపు మళ్లించే ప్రయత్నం చేస్తుందని వారు అన్నారు.కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన జాతీయ విద్యా విధానానికి వ్యతిరేకంగా ఉద్యమించాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో పిడిఎస్యు జిల్లా నాయకులు మనోహర్,అంజి, రాహుల్,అవినాష్ తదితర విద్యార్థులు పాల్గొన్నారు.
